Titanic Tour:
అడ్వెంచరస్ టూర్..
టైటానిక్ శకలాల్ని చూసేందుకు వెళ్లిన సబ్‌మెరైన్ గల్లంతైంది. దాదాపు మూడు రోజులుగా అందులోని ఐదుగురు ప్రయాణికులను కాపాడాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ ఐదుగురూ చనిపోయినట్టు యూఎస్ కోస్ట్ గార్డ్ ప్రకటించింది. అసలు ఈ టూరే అలాంటిది. చాలా సాహసంతో కూడుకుంది. సముద్రంలో దాదాపు 13 వేల అడుగుల లోతుకి వెళ్లి రావడం అంటే అంత సింపులేమీ కాదు. అయినా సరే..థ్రిల్ కోసం రిస్క్ తీసుకుంటున్నారు కొందరు టూరిస్ట్‌లు. అలానే ఈ ఐదుగురూ వెళ్లి రావాలని అనుకున్నారు. కానీ..తిరిగి రాలేకపోయారు. సబ్‌మెరైన్ ఉన్నట్టుండి మిస్ అయిపోవడం అది ఎంతకీ కనిపించకపోవడం, అందులో ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడం లాంటి కారణాల వల్ల ప్రాణాల మీదకు వచ్చింది. అసలు ఇంతగా థ్రిల్ ఫీల్ అయ్యేంత ఏముంటుంది ఈ టూర్‌లో..? అది ప్రమాదకరమని తెలిసినా బిలియనీర్లు ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..?
111 ఏళ్ల విషాదం..
1912లో టైటానిక్ షిప్ (Titanic Ship Tragedy) మునిగిపోయింది. ఇప్పటికి 111 ఏళ్లు గడిచిపోయాయి. ఆ ప్రమాదంలో 15 వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వాటి శకలాలు ఎక్కడో సముద్ర గర్భంలో చిక్కుకున్నాయి. వాటిని బయటకు తీయడం అసాధ్యం. అందుకే అక్కడే ఉంచేశారు. కానీ...ప్రపంచ చరిత్రలోనే అత్యంత భారీ ప్రమాదంపై జనాలకు ఇంట్రెస్ట్ మాత్రం తగ్గిపోలేదు. అందుకే Oceangate అనే సంస్థ సముద్రంలోనే టైటానికి శకలాల్ని చూసేందుకు స్పెషల్ టూర్ ప్లాన్ చేసింది. అందుకోసం స్పెషల్‌గా ఓ సబ్‌మెరైన్ తయార చేసింది. టైటానిక్ ఎక్కడ మునిగిపోయిందో..ఆ లొకేషన్‌ని 1985లో కనుగొన్నారు. సరిగ్గా అదే ప్రాంతానికి సబ్‌మెరైన్‌లో వెళ్లొచ్చు. దాదాపు 12,500 అడుగుల లోతులో ఉంటుందీ స్పాట్. ఈ స్పాట్‌ని కనిపెట్టినప్పటి నుంచి చాలా సంస్థలు అక్కడికి వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపించాయి. కొందరు ప్రైవేట్ వ్యక్తులూ ఆసక్తి చూపించారు. Titanic Ventures Limited Partnership (TVLP) తొలిసారి సముద్ర గర్భంలోకి వెళ్లి టైటానిక్‌కి సంబంధించిన 1800 శకలాల్ని కలెక్ట్ చేసింది. వాటిని భద్రపరిచింది. ఆ తరవాత దాదాపు 5వేల వస్తువుల్ని వెలికి తీసింది. వీటిలో కొన్ని జ్యుయెల్లరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి.
తొలిసారి టూర్ అప్పుడే..
అయితే...తొలిసారి బ్రిటన్‌కి చెందిన Deep Ocean Expeditions కంపెనీ మునిగిపోయిన టైటానిక్ టూర్‌కి టికెట్‌లు అమ్మడం మొదలు పెట్టింది. 1998లో దీన్ని ప్రారంభించింది. అప్పట్లో ఒక్కో టికెట్ ధర 32,500 డాలర్లు. 1997లో డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ టైటానిక్ సినిమా (Titanic Movie) తీశాడు. ఈ సినిమా ప్రపంచ సినీ చరిత్రలోనే సంచలనమైంది. సినిమా తీసే ముందు ఆయన కూడా షిప్ మునిగిపోయిన స్పాట్‌కి వెళ్లి వచ్చారు. ఆ తరవాత OceanGate ఈ మార్కెట్‌లోకి వచ్చింది. ప్రత్యేకంగా Titan పేరిట ఓ సబ్‌మెరైన్ ( Titan submersible) తయారు చేసింది. సముద్ర గర్భంలో 13 వేల అడుగుల లోతు వరకూ వెళ్లేలా దీన్ని డిజైన్ చేసింది. అంత లోతుకి వెళ్లే కొద్ది సముద్రంలో ప్రెజర్ ఎక్కువవుతూ ఉంటుంది. ఎక్కువ సేపు అక్కడే ఉంటే ఒత్తిడి తట్టుకోలేక ఏ వస్తువైనా పేలిపోతుంది. ఇప్పుడు టైటాన్ విషయంలో జరిగింది ఇదే. దీన్నే టెక్నికల్‌గా Impulsion అంటారు. ఓషన్ గేట్ ఈ టూర్ కోసం ఒక్కొక్కరి నుంచి 2 లక్షల 50 వేల డాలర్లు వసూలు చేస్తుంది. అంటే...ఇంత డబ్బు ఇచ్చి మరీ చావుని కొని తెచ్చుకున్నారు ఆ ఐదుగురు ప్రయాణికులు.