ఎయిర్‌ ఇండియాకు కొత్త సీఈవో, ఎండీగా ఐకెర్ ఆయ్‌సీని నియమించింది టాటా సన్స్. ఫిబ్రవరి 14న జరిగిన బోర్డు సమావేశంలో ఐకెర్‌ ఆయ్‌సీని కొత్త బాస్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించింది. 2022 ఏప్రిల్‌ 1 నుంచి ఆయన ఎయిరిండియా చీఫ్‌గా బాధ్యతలు చేపడతారు. ఇప్పటి వరకు టర్కీ ఎయిర్‌వేస్‌కి చీఫ్‌గా ఐకెర్‌ ఆయ్‌సీ ఉన్నారు. 









ప్రొఫైల్



  • 1994లో బిల్‌కెంట్‌ యూనివర్సిటీ నుంచి పబ్లిక్‌ అడ్మినిష్టేషన్‌ పట్టాను ఆయ్‌సీ పొందారు.

  • ఆ తర్వాత యూకేలని లీడ్స్‌ యూనివర్సిటీ నుంచి పొలిటికల్‌ సైన్స్‌లో పట్టా సాధించారు.

  • టర్కీ ఎయిర్‌లైన్స్ ఛైర్మన్‌గా ఐకెర్ ఆయ్‌సీ పనిచేశారు.


టాటా చేతికి


భారత విమానయాన రంగంలో 'ఎయిర్‌ ఇండియా'ది ప్రత్యేక ప్రస్థానం. ఎయిర్ ఇండియాను 1932లో టాటా సంస్థ స్థాపించింది. ఆపై 1953లో ఎయిర్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం జాతీయం చేసింది. ప్రస్తుతం సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ భాగస్వామ్యంతో విస్తారా విమాన సేవలను టాటా సంస్థ అందిస్తోంది. ఎయిర్ ఇండియా నష్టాలతో కూరుకుపోతుండడంతో మెజారిటీ వాటాలు విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.


2018లో బిడ్‌ల‌కు కేంద్రం ఆహ్వానించినా.. వాటా కొనుగోలుకు ఎవరూ ముందుకు రాలేదు. సుమారు 76 శాతం వాటాను విక్రయించాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కానీ ఇటీవల వేసిన బిడ్‌లలో స్పైస్ జెట్‌తో పోటీ ఎదుర్కొని టాటా సన్స్ ఎయిరిండియాను తిరిగి దక్కించుకుంది. రూ.18 వేల కోట్ల బిడ్‌తో టాటా గ్రూప్​ ఎయిర్ ఇండియాను సొంతం చేసుకుంది.


75 ఏళ్ల క్రితం ఒపీనియన్ పోల్‌ ద్వారా సంస్థకు ఎయిర్‌ ఇండియాగా ఈ పేరు పెట్టామని టాటా గ్రూప్‌ వివరించింది. 1946లో టాటా సన్స్‌ కంపెనీ నుంచి విస్తరిస్తున్నప్పుడు టాటా ఎయిర్‌ లైన్స్‌ పేరును ఎంపిక చేశారు. 'ఎయిర్‌ ఇండియా, ట్రాన్స్‌ ఇండియా ఎయిర్‌ లైన్స్‌, పాన్‌ ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌, ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ నుంచి భారత తొలి ఎయిర్‌లైన్‌ కంపెనీ పేరును ఎంపిక చేశాం' అని టాటా గ్రూప్‌ వెల్లడించింది. ఒపీనియన్ పోల్ ద్వారా ఈ పేరును ఎంపిక చేసినట్లు స్పష్టం చేసింది.


Also Read: UP Election 2022: 'కాంగ్రెస్‌ను నాశనం చేయడానికి వాళ్లిద్దరూ చాలు- మేం ఏం చెయ్యక్కర్లేదు'


Also Read: UP Election 2022: 'ఆ పాలకులు యూపీని కొల్లగొట్టారు- అందుకే ప్రజలు వెళ్లగొట్టారు'