విశాఖ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను నూతిలో పడేసి తల్లి ఆత్మ హత్యాయత్నం చేసింది. ఈ దారుణ ఘటనలో ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందగా, తల్లిని అతి కష్టమ్మీద స్థానికులు కాపాడారు. విశాఖపట్నం జిల్లాలోని రోలుగుంటలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలివీ..
విశాఖపట్నం జిల్లా రోలుగుంట మండలం జె.నాయుడుపాలెంలో కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలను బావిలో పడేసి, తల్లి కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో పిల్లలు భాను (5), పృథ్వి (3) మృతి చెందగా, తల్లిని స్థానికులు ప్రాణాలతో కాపాడారు. రోలుగుంట మండలానికి చెందిన గడదాసి నాగరాజుతో 6 సంవత్సరాల క్రితం ఇదే మండలం వడ్డిపకు చెందిన సాయితో ఈమెకు వివాహం జరిగింది. దంపతులు ఇద్దరు నాగరాజు స్వగ్రామం జె.నాయుడు పాలెంలో నివాసం ఉంటున్నారు. వీరికి భాను (పాప) పృథ్వి (బాబు) జన్మించారు. కొద్ది రోజులుగా భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో సోమవారం ఉదయం ఈ అఘాత్యానికి పాల్పడింది. నాగరాజు ఆటో డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు. రోలుగుంట పోలీస్ లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గతంలో అనంతపురంలోనూ..
గతంలో అనంతపురం జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పుట్టపర్తిలో ఓ మహిళ తన ముగ్గురు కుమార్తెలను బావిలో తోసేసి ఆపై తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ ఘటనలో ముగ్గురు కుమార్తెలు మృతి చెందగా, తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరుణ, రమేశ్ దంపతులు పుట్టపర్తి సమీపంలోని పెదకమ్మ వారి పల్లి దొమ్మర పాలెంలో నివాసం ఉంటున్నారు. ఈ భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కాలనీ సమీపంలో ఉన్న బావిలో ముగ్గురు కుమార్తెలను తోసేసి అరుణ కూడా దూకింది. దీన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన స్పందించి వారిని బయటకు తీశారు. అయితే కుమార్తెలు భవ్య (8), చందన (5) అప్పటికే మృతి చెందగా.. భార్గవి (8), తల్లి అరుణను ఆసుపత్రికి తరలించారు. అక్కడ భార్గవి చికిత్స పొందుతూ మరణించింది. అరుణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. భార్గవి, భవ్య ఇద్దరు కవల పిల్లలు. ఈ ఘటనపై పుట్టపర్తి అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేశారు.
Also Read: Medaram Jatara: సమ్మక్క సారలమ్మ జాతరలో తొలిఘట్టం - పగిడిద్దరాజు రాకతో జాతర ప్రారంభం, 16న మేడారానికి