అరణ్యం గుండా అమ్మ భర్త పయనమవుతున్నాడు. వారం రోజుల పాటు కాలినడకన వరాల తల్లి ఆడ బిడ్డ నగరం నుంచి వనానికి బైలెళ్లుతోంది. వన జాతరకు తొలి దర్శనమిచ్చే తల్లి ఎదురు పిల్ల కోసం ఎదురు చూస్తోంది. మేడారంలో ఎవరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? తెలంగాణ మహాకుంభమేళ తొలి ఘట్టం ఎవరి రాకతో ప్రారంభమవుతుంది? ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.


మహా జాతర ఘట్టంలో ప్రత్యేకతగా నిలిచే పగిడిద్దరాజును గిరిజన సంస్కృతి, సంప్రదాయాల నడుమ ఈ నెల 16న మేడారానికి తరలించనున్నారు. ఈ నెల 16 నుంచి 19 వరకు మహాజాతర జరగనున్న తరుణంలో సమ్మక్క భర్త పగిడిద్దరాజు వేడుకల్లో పాల్గొననున్నాడు. రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క, సారలమ్మ జాతరలో పగిడిద్దరాజుకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్లలోని గిరిజన పూజారులు భక్తి శ్రద్ధలతో పగిడిద్దరాజుకు పూజలు చేస్తున్నారు. పగిడిద్దరాజు ఆలయంలో గిరిజన సంప్రదాయరీతిలో కార్యక్రమాలను సిద్ధం చేస్తున్నారు.







మేడారానికి పగిడిద్దరాజు బయలుదేరాకే జాతర ప్రారంభం కావడం అనవాయితీగా వస్తోంది. పగిడిద్దరాజును కొలిచే కోయదొరలు వారి సంస్కృతికి అద్దం పట్టేలా ఈ నెల 16న మేడారానికి పంపనున్నారు. ఆ రోజున ఉదయం తెల్లవారుజామున ఐదుగురు ముత్తైదువులను పంపించి గుడిని శుద్ధి చేయిస్తారు. తలపతి అయిన పెనక వంశీయుల వద్దకు వెళ్లి పనిముట్లను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. దేవుడికి సంబంధించిన పడిగెలను శుద్ధిచేసి, శివశక్తుల మధ్య గుడి చుట్టూ ఊరేగించి తదనంతరం అరణ్యం గుండా మేడారానికి పగిడిద్దరాజును గిరిజన పూజారులు కాలినడకన తరలిస్తారు. మేడారంలో సమ్మక్కతో వివాహం అనంతరం తిరుగు ప్రయాణం అనంతరం మరుపెళ్లి జాతరను పూనుగొండ్లలో ఘనంగా నిర్వహిస్తారు.


పూర్వం నుంచే పూనుగొండ్లలో పగిడిద్దరాజును కొలుస్తున్నారు. గిరిజనుల కొంగు బంగారంగా కొనసాగుతున్న సమ్మక్క, సారలమ్మ జాతరలో భాగంగా 1986 నుంచి మేడారానికి పగిడిద్దరాజును తరలిస్తున్నట్లు  గిరిజన పూజారుల సంస్క్రుతి సంప్రదాయాల ద్వారా బోధపడుతోంది. అంతకు ముందు పగిడిద్దరాజును గ్రామంలోనే కొలిచే వారు. పూనుగొండ్లలో వెలిసిన పగిడిద్దరాజు తన భార్య సమ్మక్క మేడారంలో కొలువుతీరిందనేది పూనుగొండ్ల, కొత్త గూడ ఎజెన్సీ ఆదివాసీల విశ్వాసం.  దీంతో అప్పటి ఆదివాసీలు మేడారానికి వెళ్లి సమ్మక్కను పూనుగొండ్లకు పంపాలని కోరగా, దీనికి స్పందించిన పెద్దలు బంగారం ఇచ్చి తీసుకెళ్లాలని సూచించారు. అంత స్థోమత తమవద్ద లేదని చెప్పి సమ్మక్కను అక్కడే ఉంచాల్సి వచ్చిందని పూర్వికులు ఇప్పటికీ చెబుతున్న కథ ప్రచారంలో ఉంది. అప్పటి నుంచి మేడారంలో సమ్మక్క- సారలమ్మ జాతర కొనసాగుతుండగా పగిడిద్దరాజును పూనుగొండ్ల నుంచి తరలించే కార్యక్రమాన్ని గిరిజన పూజారులు చేపట్టారు.


గత పాలకులు పగిడిద్దరాజు ఆలయాన్ని పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పడిన అనంతరం మహాజాతర నేపథ్యంలో పగిడిద్దరాజు దేవాలయానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించినా అవి సరి పోవడం లేదు. ఉన్నంతలో  ఆలయం ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. గుట్టకు వెళ్లేలా ప్రత్యేక రహదారిని నిర్మించడం, బలిచ్చే గదిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం, భక్తుల కోసం తాగునీరు, విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో నూతనంగా పగిడిద్దరాజు, సమ్మక్క, సారలమ్మ గద్దెలను ఏర్పాటు చేశారు.


మేడారం మహాజాతరకు గణపురం మండలం నగరంపల్లి నుంచి సమ్మక్క ఆడబిడ్డ లక్షీదేవర పయనమవుతోంది. వనదేవత సమ్మక్క, సారలమ్మ చెంతకు చేర్చడానికి నాయకపోడ్ పూజారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతరకు నగరంపల్లి నుంచి నాయకపోడ్ ల ఆరాధ్య దైవమైన లక్ష్మీదేవర, పోతురాజు, కిష్ణస్వామి దేవతల ప్రతిమలను తీసుకుని మేడారం వెళ్తారు. వారం రోజుల పాటు కాలినడకన దట్టమైన అడవి ద్వారా పయణించి తల్లుల వద్దకు చేరుకుంటారు. సమ్మక్క, సారలమ్మలతో పాటు   లక్ష్మీదేవర, పోతురాజు, కిష్ణస్వామి దేవతలు పూజలందుకున్న తర్వాత నాయకపోడ్ లు జాతర ముగిసే సమయానికి నగరంపల్లికి పయనమవుతారు. ఈ క్రమంలో నాయకపోడ్ లు గిరిజన దేవతలకు సంప్రదాయ బద్దంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. లక్ష్మీదేవరను నాయక్ పోడులు 50 ఏళ్ల నుంచి మేడారం తీసుకువస్తున్నారు. ఇది పూర్వీకుల ఆచారంగా గిరిజనులు భావిస్తున్నారు.


ఆదివాసీ నాయక పోడు సంస్క్రుతి, సంప్రదాయాల్లో భాగంగా బుధవారం వనజాతర తొలి దర్శనంగా ములుగులో  విలసిల్లుతున్న గట్టమ్మ తల్లికి ఎదురు కోడిపిల్ల పండుగను గిరిజనులు నిర్వహిస్తున్నారు. నాయకపోడ్ ల ఆచార వ్యవహారాల మేరకు డప్పు చప్పుళ్లు, లక్ష్మీదేవర న్రుత్యాలు, గిరిజన సంస్కుతి, సంప్రదాయాలతో ములుగులోని గట్టమ్మకు ఎదురు కోడిపిల్ల పండుగను చేస్తారు. మేడారం సమ్మక్క, సారలమ్మ లను దర్శించుకునే భక్తులు తొలుత గట్టమ్మను దర్శించుకుంటే క్షేమంగా వెళ్లి లాభంగా వస్తారనేది గిరిజనులు, మేడారం భక్తుల విశ్వాసం.


మహాజాతర ప్రారంభానికి వారం ముందే పగిడిద్ద రాజు కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుంచి పయనమవ్వడం, సమ్మక్క ఆడబిడ్డ లక్ష్మీదేవర నగరంపల్లి నుంచి మేడారం చేరుకోవడం ఆనవాయితే అయితే అదే సమయంలో మేడారంలో మండమెలిగే పండగను నిర్వహించడంతో మేడారం జాతర అధికారికంగా ప్రారంభమవుతుంది. దీని కోసం మేడారం గ్రామంలోని సమ్మక్క ఆలయం, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాల్లో గిరిజనులు ప్రత్యేక పూజలు నిర్వహించి జాతర తొలి అంకానికి తెరతీస్తారు. సమ్మక్క ఆలయంలో సిద్దబోయిన, చందా వంశీయులు, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయంలో కాక వంశీయలు గిరిజన సంస్క్రుతి సంప్రదాయాల మేరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీంతో తెలంగాణ మహాకుంభమేళా మేడారం జాతర అధికారికంగా ప్రారంభమవుతుంది. దానికి నేటి నుంచి మేడారం జాతర ప్రారంభమైనట్లుగా అంతా భావిస్తారు.