నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్‌వీ సీ-52 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 13వ తేదీ తెల్లవారుజామున 4.29 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం కాగా.. నిరంతరాయంగా 25 గంటల 30 నిమిషాలపాటు కౌంట్ డౌన్ కొనసాగి పీఎస్‌ఎల్‌వీ నింగిలోకి దూసుకెళ్లింది. అయితే, ఈ రాకెట్ ప్రయోగ సమయంలో ఆకాశంలో అద్బుత దృశ్యాలు కనిపించాయి. ఈ దృశ్యాలను వీక్షకులు తమ ఫోన్లలలో బంధించారు. వివిధ ఆకృతుల్లో ప్రకాశవంతంగా గీతలమాదిరిగా కనిపించిన ఈ దృశ్యాలను వీడియోలు తీశారు. చూసి జనం ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎప్పుడూ చూడని విధంగా ఆ వెలుగును చూసి జనం కాస్త తికమకపడ్డారు. 


కానీ, ఆ తర్వాత అది రాకెట్ గమనం వల్ల ఏర్పడిన వెలుగు అని తెలుసుకున్నారు. ప్రధానంగా ఈ ఆకాశంలో ఈ వెలుగులు నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కనిపించాయి. కొన్ని చోట్ల ఆకాశంలో ఒక భారీ టార్చిలైటు మాదిరిగా వెలుగు విరజిమ్ముతూ దృశ్యం కనిపించగా.. మరికొన్ని చోట్ల అత్యంత ప్రకాశవంతంగా గజిబిజి వెలుగు దర్శనమిచ్చింది. ఈ వెలుగు కాసేపు అలాగే ఉంది. తెల్లవారు జామున నల్లటి ఆకాశంలో ఇలాంటి వెలుగు కనిపించేసరికి జనం అమితమైన ఆశ్చర్యానికి గురయ్యారు.


అయితే, గతంలో రాకెట్ ప్రయోగాలు జరిగినప్పుడు ఏనాడూ ఎలాంటి వెలుగులు కనిపించలేదు. కానీ, తాజా పీఎస్‌ఎల్వీ సి-52 ప్రయోగం అనంతరం కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది.




బెంగళూరు నగరం నుంచి తూర్పు వైపుగా ఆకాశం నుంచి ఇలాంటి వెలుగు కనిపించినట్లుగా కూడా అక్కడి స్థానికులు ట్వీట్లు చేశారు.