PSLVC52 Mission launches 3 satellites: ఈ ఏడాది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తొలి ప్రయోగం మొదలైంది. సరిగ్గా 5 గంటల 59 నిముషాలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సి-52 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ నెల 13వ తేదీ వేకువజామున 4.29 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం కాగా.. నిరంతరాయంగా 25 గంటల 30నిముషాలపాటు కౌంట్ డౌన్ కొనసాగింది.
ఈ రాకెట్ మొత్తం 3 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశ పెడుతుంది. ఆర్‌ఐశాట్-1ఎ (ఈవోఎస్-04)తోపాటు ఐఎన్‌ఎస్-2టీడీ, విద్యార్థులు రూపకల్పన చేసిన ఇన్‌స్పైర్‌శాట్-1 ఉపగ్రహాలను మోసుకెళ్తోంది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లో ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ ఆధ్వర్యంలో ఈ ప్రయోగం జరిగింది. ఇస్రో చైర్మన్ గా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన మొదటి ప్రయోగం ఇది. ఈ ఏడాదికి కూడా ఇదే తొలి ప్రయోగం.
EOS-04 అనేది రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం. వ్యవసాయం, అటవీ, ప్లాంటేషన్‌లు, నేల తేమ, హైడ్రాలజీ, ఫ్లడ్ మ్యాపింగ్ వంటి అప్లికేషన్‌ల కోసం అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ అధిక నాణ్యత చిత్రాలను అందించడానికి దీన్ని రూపొందించారు. గతంలో ప్రయోగించిన EOS-03 రాకెట్ ప్రయోగం విఫలం కారణంగా నింగిలోకి వెళ్లలేదు. ఈ సిరీస్ లో నాలుగో ఉపగ్రహాన్ని నేడు ప్రయోగించారు.
మొదటి లాంచింగ్ ప్యాడ్ నుంచి ప్రయోగం..
కొన్నాళ్ల గ్యాప్ తర్వాత ఇస్రో తొలి ప్రయోగం కావడంతో, కొవిడ్ నియమాలు పాటిస్తూ షార్ కేంద్రం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. శ్రీహరికోట రోడ్డులో అటకానితిప్ప వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేసి వాహనాలు, పాదచారులను తనిఖీ చేసి లోపలికి పంపించారు. షార్ మొదటి, రెండో గేట్ల వద్ద సాధారణ రోజుల కన్నా భద్రత దళాల సంఖ్యను పెంచారు. వారం రోజుల నుంచి కేంద్ర పారిశ్రామిక భద్రత దళాలు శ్రీహరికోట చుట్టూ జల్లెడ పడుతున్నాయి. శ్రీహరికోట అడవులు, సమీప గ్రామాల్లో కూంబింగ్ చేస్తున్నాయి. రాకెట్ ప్రయోగం సందర్భంగా వాకాడు మండలంలోని రాయదొరువు నుంచి తమిళనాడులోని పలవర్ కాడ్ తీరం వరకు రెండు రోజులపాటు చేపల వేటను నిషేధించారు.
ప్రయోగం ప్రత్యక్షంగా చూసేందుకు..
కొవిడ్ ప్రొటోకాల్ వల్ల ఈ ఏడాది పరిమిత సంఖ్యలోనే సందర్శకులను అనుమతించారు. మీడియా విషయంలో కూడా ఆంక్షలు విధించారు. పీఎస్‌ఎల్‌వీ సి-52 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు కేంద్ర, రాష్ట్ర అధికారులు పలువురు ఆదివారం రాత్రికే షార్ కేంద్రానికి చేరుకున్నారు. ఇన్ స్పేస్ ఛైర్మన్ డాక్టర్ పవన్ కుమార్, ఢిల్లీ వ్యవసాయ మంత్రి సెక్రటరీ సంజయ్ అగర్వావాల్, నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఏపీ సౌత్ కోస్టల్ డీఐజీ డాక్టర్ త్రివిక్రమ వర్మ, ఎస్పీ విజయరావు తదితరులు షార్ లో ఉన్నారు. పీఎస్ఎల్వీ ప్రయోగాన్ని వారు ప్రత్యక్షంగా వీక్షించారు.
ఇస్రో ప్రయోగం సక్సెస్.. సమష్టి విజయం అన్న సోమనాథ్..
ఇస్రో పీఎస్ఎల్వీ సి-52 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. మూడు ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యల్లో ప్రవేశపెట్టింది. 25 గంటల 30నిముషాల కౌంట్ డౌన్ తర్వాత సరిగ్గా ఈ ఉదయం 5.59 గంటలకు పీఎస్ఎల్వీ సి-52 షార్ అంతరిక్ష కేంద్రం తొలి ప్రయోగ వేదికనుంచి నింగికి ఎగిసింది. సరిగ్గా 6 గంటల 17నిముషాలకు ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అయిన ఈవోఎస్-04ను 529 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలో ప్రవేశ పెట్టింది. ఇన్ స్పైర్ శాట్-1, ఐఎన్ఎస్ 2టిడి అనే రెండు చిన్న ఉపగ్రహాలు కూడా విజయవంతంగా వాటి కక్ష్యల్లోకి దూసుకెళ్లాయి. ఇస్రో చైర్మన్ గా తొలి విజయం అందుకున్న సోమనాథ్.. ఇది సమష్టి కృషి అని అన్నారు. అన్ని డిపార్ట్ మెంట్ ల సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రోలో సందడి వాతావరణం నెలకొంది. శాస్త్రవేత్తలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.