నెల్లూరు కుర్రాడు ఐపీఎల్ లో ఛాన్స్ కొట్టేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అశ్విన్ ను 20 లక్షల రూపాయలకు వేలంలో దక్కించుకుంది. ఆంధ్రా జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తున్న అశ్విన్ చిన్నతనం నుంచే క్రికెట్ పై మక్కువ పెంచుకున్నాడు. నెల్లూరు పేరుని తన ప్రతిభతో దేశవ్యాప్తం చేయబోతున్నాడు.
1995 నవంబర్ 15న నెల్లూరులో జన్మించాడు అశ్విన్ హెబ్బార్. తండ్రి రాజ్ గిరి హెబ్బార్, తల్లి నళిని హెబ్బార్. వీరిద్దరూ చిన్న తనంలోనే అశ్విన్ ప్రతిభ గుర్తించి అతడికి క్రికెట్ లో శిక్షణ ఇప్పించారు. నెల్లూరులోనే అశ్విన్ విద్యాభ్యాసం సాగింది. క్రికెట్ అంటే అశ్విన్ కు ప్రాణం అని, తెల్లవారు జామున 4 గంటల నుంచే క్రికెట్ గ్రౌండ్ కి వెళ్లేవాడని, బాగా కష్టపడే మనస్తత్వం అతనిదని అంటున్నారు తల్లిదండ్రులు. ఐపీఎల్ లో చోటు దక్కడం సంతోషంగా ఉందని, ఇంకా మంచి స్థాయికి అశ్విన్ వెళ్లాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో తమ కొడుకు టీమిండియాకు ఆడాలనేది కల అని అంటున్నారు. 2007లో అండర్ -13 జిల్లా జట్టుకి ఎంపికైన అశ్విన్.. ఇప్పుడిలా ఐపీఎల్ తో సత్తా చాటబోతున్నాడు.
అశ్విన్ రైట్ హ్యాండెడ్ బ్యాట్స్ మన్, రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలర్ కూడా. కానీ బ్యాట్స్ మన్ గానే అశ్విన్ తన సత్తా చాటాడు. 2015లో త్రిపుర వర్సెస్ ఆంధ్రా టీమ్ మధ్య జరిగిన మ్యాచ్ తో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి అశ్విన్ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అతను చెలరేగిపోయాడు. బ్యాట్స్ మన్ గా సత్తా చూపుతూనే బౌలర్ గా కూడా రాణిస్తున్నాడు అశ్విన్.
ఢిల్లీ టీమ్ లో చోటు ఇలా..
బెంగళూరులో జరిగిన ఐపీఎల్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అశ్విన్ ను రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది. ఐపీఎల్ వేలానికి ప్రపంచ వ్యాప్తంగా 1300 మంది ఆటగాళ్లతో కూడిన జాబితాను సిద్ధం చేశారు. వారిలో 599 పేర్లను వడపోసి తీశారు. ఆ క్రమంలో లిస్ట్ లో 57వ స్థానంలో అశ్విన్ పేరు ఖరారు చేశారు. తొలి రోజు 161 పేర్లకు వేలంలో అవకాశం ఇవ్వగా.. ఏడో సెట్ లో అశ్విన్ ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. మార్చి 26 నుంచి ఐపీఎల్ 2022 మ్యాచ్ లు మొదలవుతాయి.
నెల్లూరులో సంబరాలు..
అశ్విన్ ఐపీఎల్ కి సెలక్ట్ కావడంతో నెల్లూరులో అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఐపీఎల్ లో అశ్విన్ సత్తా చాటాలని, ఢిల్లీ తరపున మంచి ప్లేయర్ గా రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో అశ్విన్ టీమిండియాలో కూడా చోటు దక్కించుకుంటాడని, ఐపీఎల్ తో దానికి పునాది పడాలని ఆకాంక్షించారు.