దేశీయ రక్షణ రంగ పరిశ్రమ ఆధునికీకరణకు 68 శాతం నిధులు కేటాయించడం, ప్రైవేటు రంగంలో ఆయుధ తయారీ పరిశోధనకు ప్రభుత్వం నిధులు కేటాయించేలా బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేయడతో మేలు జరుగుతుందని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. స్వదేశీ ఆయుధ వ్యవస్థల తయారీలో స్వయం సమృద్ధికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. ఫలితంగా ఈ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల సృష్టి జరుగుతుందని వెల్లడిస్తున్నారు.


గతేడాదితో పోలిస్తే మరో పది శాతం నిధులు పెంచి దేశీయ రక్షణ రంగానికి 68 శాతం నిధులు కేటాయించడం మెరుగైన చర్యలని అదానీ డిఫెన్స్‌ ఎయిరోస్పేస్‌ అధ్యక్షుడు ఆశీష్‌ రాజ్‌వంశీ అన్నారు. 'ఇది స్వాగతించదగ్గ పరిణామం. ఎందుకంటే ఈ చర్యలు పెట్టుబడులను ఆకర్షిస్తాయి. పరిశోధన, అభివృద్ధికి 25 శాతం నిధులు కేటాయించడం వల్ల పరిశ్రమలో ఆర్‌ అండ్‌ డీకి ప్రోత్సాహం లభిస్తుంది.  డీఆర్‌డీవో సహా ఇతర పరిశోధన సంస్థలతో పబ్లిక్‌ ప్రైవేటు భాగస్వామ్యంతో సరికొత్త ఆయుధ వ్యవస్థలను తయారు చేసి సైన్యానికి అందించొచ్చు' అని రాజ్‌వంశీ అన్నారు.  అదానీ గ్రూప్‌ కొన్నేళ్ల క్రితమే రక్షణ రంగం పరిశ్రమలో ప్రవేశించింది. సైన్యానికి సంబంధించిన కొన్ని కీలక ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది.


చిన్న, మధ్య తరహా పరిశ్రమలు సైతం దేశీయ రక్షణ రంగ పరిశ్రమకు కేటాయింపులు పెంచడం పట్ల సంతోషంగా ఉన్నాయి. ఈ రంగంలో తాము మరిన్ని అవకాశాలను అన్వేషించేందుకు ఇది సాయ పడుతుందని అంటున్నారు. 'దేశీయ పరిశ్రమకు అవకాశాలు కల్పించేందుకు ఇదో పెద్ద ముందడుగు. ఈ రంగంలో భారత్‌ స్వయం సమృద్ధి సాధించేందుకు, మాలాంటి కంపెనీలకు సాయపడేందుకు వీలవుతుంది' అని నాగ్‌పుర్‌కు చెందిన జేఎస్‌ఆర్‌ డైనమిక్స్‌ ఛైర్మన్‌ ఎయిర్‌ మార్షల్‌ ఎస్‌బీ డేవ్‌ (రిటైర్డ్‌) అంటున్నారు.


హిందుస్థాన్‌ ఎయిరోనాటిక్స్‌ లిమిటెడ్‌ మాజీ ఛైర్మన్‌ త్యాగీ సైతం దేశీయ రక్షణ రంగానికి బడ్జెట్లో పెద్ద పీట వేస్తుండటం సరైన చర్యగా అభివర్ణించారు. ఈ రంగంలో పరిశ్రమలు ఎదిగేందుకు ప్రభుత్వ చర్యలు ఉపయోగపడతాయని అంటున్నారు. ఇప్పటికీ చాలా ఆయుధ వ్యవస్థలు, ప్రాజెక్టులను భారత్‌ దిగుమతి చేసుకుంటోంది. భారత్‌లో తయారీపై ఎక్కువ శ్రద్ధ పెట్టలేదు. ఇలాంటి తరుణంలో బడ్జెట్‌ కేటాయింపులు పరిశ్రమకు సాయపడుతాయని అంటున్నారు.


చాలా విదేశీ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. భారీ స్థాయిలో దిగుమతులు తగ్గించేసింది. ఫలితంగా మన సైన్యానికి ఆయుధ వ్యవస్థలు అందించేందుకు దేశీయ కంపెనీలకు ఆర్డర్లు వస్తాయని చాలామంది అంచనా వేస్తున్నారు. 'ఈ బడ్జెట్‌ నేవీ అవసరాలను కచ్చితంగా తీరుస్తుంది. భారత నౌకా నిర్మాణ సంస్థలకు పబ్లిక్‌, ప్రైవేట్‌ భాగస్వామ్యంలో ప్రాజెక్టుల నిర్మాణానికి కొత్త ఆర్డర్లు వచ్చేలా చేస్తుంది' అని రక్షణ రంగ నిపుణుడు, డిఫెన్స్‌ మాజీ అధికార ప్రతినిధి కెప్టెన్‌ డీకే శర్మ అంటున్నారు.