ఆపదలో ఉన్నవారికి సాయం చేయడం గొప్ప విషయమే. అయితే అలా సాయం చేసేవారికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందనేది కొత్త విషయం. అవును, ఆపదలో ఉన్నవారికి ప్రథమ చికిత్స చేస్తే.. వారికి కేంద్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ప్రోత్సాహకం ఇస్తుంది. ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ వ్యక్తికి సత్వరం ప్రథమ చికిత్స అందించి, వారిని హాస్పిటల్ లో చేర్చిన వారికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఐదు వేల రూపాయలు అందజేస్తారు. ఒకే ఏడాదిలో ఐదు కంటే ఎక్కువ సార్లు ఇటువంటి ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తులకు సేవ చేసి, వారి ప్రాణాలు కాపాడినట్లు నిర్థారణ అయితే, వారికి కేంద్ర ప్రభుత్వం లక్ష రూపాయలు పారితోషికంగా ఇస్తుంది. జిల్లా కలెక్టర్ ద్వారా వివరాలు సేకరించి, గుడ్ సమారిటేరియన్ అవార్డు ఇస్తారు, దానితోపాటు లక్ష క్యాష్ అవార్డు ఇస్తారు. ఇటీవల ఈ ప్రథమ చికిత్స విషయంపై ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రథమ చికిత్సపై శిక్షణా తరగతులను కూడా నిర్వహిస్తోంది. 


ప్రథమ చికిత్సలో సర్టిఫికెట్ కోర్స్.. 
అయితే ప్రథమ చికిత్స చేయడంలో ఎలాంటి మెళకువలు పాటించాలనే విషయంపై రెడ్ క్రాస్ సంస్థ సర్టిఫికెట్ కోర్సు అందిస్తోంది. నెల్లూరులోని రెడ్ క్రాస్ సంస్థ ఇలా శిక్షణ ఇస్తూ కొంతమంది వాలంటీర్లకు సర్టిఫికెట్లు అందించింది. నెల్లూరులోని రెడ్ క్రాస్ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 



ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు జిల్లా శాఖ, సెయింట్ జాన్ అంబులెన్స్ న్యూఢిల్లీ  సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నెల్లూరులోని రెడ్ క్రాస్ కార్యాలయంలో 4 రోజుల సీనియర్ ప్రొఫెషనల్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ కార్యక్రమం జరిగింది. నాలుగు రోజులపాటు వివిధ అంశాల్లో వాలంటీర్లకు దీనిపై శిక్షణ ఇచ్చారు. 48 మంది యువతీ యువకులు ఇందులో శిక్షణ తీసుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి వీరంతా నెల్లూరుకి వచ్చి శిక్షణ తీసుకున్నారు. శిక్షణపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ఎలాంటి సాయం అందించాలో తెలుసుకున్నామని చెప్పారు. రెడ్ క్రాస్ జిల్లా శాఖ చైర్మన్ పి.చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ కన్వీనర్ భాస్కర్ రెడ్డి ఇతర సభ్యులు.. ప్రథమ చికిత్స విషయంలో పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. 


ఆపదలో ఉన్నవారిని ఆస్పత్రికి వెంటనే చేర్చడం ఎంత ముఖ్యమో.. వారికి అత్యవసరంగా ప్రథమ చికిత్స అందించడం కూడా అంతే ముఖ్యం. అందుకే ప్రథమ చికిత్సకు అత్యంత ప్రాధాన్యత ఉందని అంటున్నారు నిపుణులు. ఇందుకోసం ప్రత్యేకంగా సర్టిఫికెట్ కోర్స్ ఏర్పాటు చేశారు. సర్టిఫికెట్ కోర్స్ చేసినవారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి తోడ్పడాలని, వారిని వెంటనే ఆస్పత్రికి చేర్పించే విషయంలో చొరవ చూపాలని కోరారు.