Tata Motors Q1 Results:
దేశీయ వాహన దిగ్గజం టాటా మోటార్స్ లిమిటెడ్ (Tata Motors) అదుర్స్ అనిపించింది. మార్కెట్ అంచనాలను తలదన్నేలా జూన్ త్రైమాసికం ఫలితాలు విడుదల చేసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.3,203 కోట్ల నికర లాభం నమోదు చేసింది. ఏడాది క్రితం రూ.5,007 కోట్ల నికర నష్టంతో పోలిస్తే ఇది అద్భుతమే! ఎకనామిక్స్ టైమ్స్ పోల్‌లో అంచనా వేసిన రూ.2412 కోట్ల నికర లాభం కన్నా ఇదెంతో ఎక్కువ కావడం విశేషం.
కంపెనీ విక్రయాలు ఊపందుకోవడంతో టాటా మోటార్స్ నికర లాభం బాగా పెరిగింది. వార్షిక ప్రాతిపదికన ఆపరేషన్స్ రెవెన్యూ 42 శాతం పెరిగి రూ.1.02 లక్షల కోట్లుగా ఉంది. అందరూ ఊహించిన రూ.99,887 కోట్ల కన్నా ఇది ఎక్కువే. ఇక ఎబిటా విలువ ఐదు రెట్లు పెరిగి రూ.13,218 కోట్లకు చేరుకుంది. ఆపరేటింగ్ మార్జిన్ 700 బేసిస్ పాయింట్లు పెరిగి 14.4 శాతానికి చేరుకుంది. బ్రిటన్‌లోని జాగ్వార్ లాండ్‌రోవర్ వ్యాపారం మెరుగవ్వడం, భారత్‌లో ప్యాసెంజర్, కమర్షియల్ వాహనాల విక్రయాల పెరుగుదల ఇందుకు కారణాలు.
'సమీప భవిష్యత్తులో అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ డిమాండ్ పెరుగుదలపై మేం ఆశావహంగా ఉన్నాం. అలాగే ద్రవ్యోల్బణ ప్రభావం కొంతమేర ఉంటుందని అంచనా వేస్తున్నాం' అని టాటా మోటార్స్ తెలిపింది. ఆర్డర్ బుక్ బాగుండటంతో ఈ ఆర్థిక ఏడాదిలో ఇంకా మెరుగైన ప్రదర్శన చేస్తామని కంపెనీ అంటోంది. జేఎల్‌ఆర్‌కు డిమాండ్ పెరగడం, పండగల సీజన్లో విక్రయాల పెరుగుదల వంటివి ఇందుకు దోహదం చేస్తాయని తెలిపింది.
బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ జేఎల్‌ఆర్ ఆదాయం 57 శాతం పెరిగి 6.9 బిలియన్ పౌండ్లకు చేరుకుంది. గతేడాది నష్టంతో పోలిస్తే పన్నులు చెల్లించక ముందు లాభం 435 మిలియన్ పౌండ్లకు చేరుకుంది. ఆపరేటింగ్ మార్జిన్ 960 బేసిస్ పాయింట్లు పెరిగి 16.3 శాతానికి చేరుకుంది. కంపెనీ ఆర్డర్లు పటిష్ఠంగా ఉన్నాయి. 185,000 రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్స్, డిఫెండర్ యూనిట్లకు ఆర్డర్లు వచ్చాయి. మొత్తం ఆర్డర్ బుక్‌లో వీటి విలువ 76 శాతం.
భారత్‌లో వాణిజ్య వాహనాల వ్యాపారం మెరుగైంది. ఆదాయం 4.4 శాతం పెరిగి రూ.17,000 కోట్లుగా నమోదైంది. ఆపరేటింగ్ మార్జిన్ 390 బేసిస్ పాయింట్లు పెరిగి 9.4 శాతంగా ఉంది. అయితే ఈ త్రైమాసికంలో హోల్‌సేల్ విక్రయాలు 14.4 శాతం తగ్గాయి. రిటైల్ విక్రయాల్లోనూ తగ్గుదల కనిపిస్తోంది. ఎగుమతులు సైతం 32 శాతం తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడమే ఇందుకు కారణం.
ప్యాసెంజర్ వాహనాల విక్రయాల్లో మాత్రం అదరగొట్టాయి. ధరల పెరుగుదలతో ఆదాయంలో 11 శాతం వృద్ధి నమోదైంది. అయితే ఆపరేటింగ్ మార్జిన్ 80 బేసిస్ పాయింట్లు తగ్గి 5.3 శాతానికి చేరింది. ఖర్చులు పెరగడం, ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తి చేస్తుండటమే ఇందుకు కారణాలు. స్థానికంగా హోల్‌సేల్ విక్రయాలు 7 శాతం రిటైల్ విక్రయాలు 6 శాతం పెరిగాయి. టాటా మోటార్స్ షేరు నేడు 12 రూపాయల లాభంతో 641 వద్ద ముగిసింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 62 శాతం పెరిగింది. రూ.247 లాభపడింది.
Also Read: కొత్తిమీర కట్ట రూ.50, టమాట కిలో రూ.200 - ముంబయిలో రికార్డులు!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు నవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial