Tomato Price Hike: 


టమాట ధరలు చంద్రయాన్‌-3 దశలను తలపిస్తున్నాయి. నెల రోజుల క్రితం కిలో 10 రూపాయాలు ఉండేవి. 15 రోజుల క్రితం కిలో రూ.50కి చేరాయి. మరో రెండు రోజులకే సెంచరీ కొట్టాయి. వారం రోజుల నుంచి రూ.150 వద్ద కదలాడుతున్నాయి. ఇప్పుడేమో ఏకంగా రూ.200ను టచ్‌ చేశాయి. కిలో టమాటాలు డబుల్‌ సెంచరీ దాటడం చరిత్రలో ఇదే తొలిసారి!


ముంబయి మార్కెట్లో కిలో టమాట ధర రూ.200కు చేరుకుంది. పెరిగిన ధరలతో (Tomato Prices) అటు కస్టమర్లు ఇటు వ్యాపారులు లబోదిబోమని మొత్తుకుంటున్నారు. వినియోగదారులు కొనుగోలు చేయడం లేదు. గిరాకీ లేకపోడంతో కొందరు వ్యాపారులు తాత్కాలికంగా దుకాణాలు మూసేస్తున్నారని తెలిసింది. నగరంలోని ఏపీఎంసీ వాషీ రైతుమండిలో పరిస్థితి దారుణంగా ఉంది.


నిజానికి హోల్‌సేల్‌ మార్కెట్లో కిలో టమాటలు మొన్నటి వరకు రూ.80 నుంచి 100 వరకు లభించాయని వాషీ మార్కెట్‌ డైరెక్టర్‌ శంకర్‌ పింగాలె తెలిపారు. దురదృష్ట వశాత్తు లోనవాలాలో కొండ చరియలు విరిగి పడటంతో ట్రాఫిక్‌ జామ్‌లు పెరిగాయన్నారు. ఇతర మార్గాల్లో టమాటాలు మార్కెట్‌కు వచ్చాయన్నారు. అంతరాయాల వల్లే తాత్కాలికంగా ధరలు పెరుగాయని వివరించారు. కొన్ని రోజుల్లోనే పరిస్థితి సద్దుమణుగుతుందని, ధరలు తగ్గుతాయని వెల్లడించారు.


కొన్ని రోజులుగా కిలో టమాటాలు రూ.100-120 వరకు విక్రయించామని వాషి మార్కెట్‌ ట్రేడర్‌ సచిన్‌ శిటోల్‌ అన్నారు. దాదర్‌ మార్కెట్లో మాత్రం హోల్‌సేల్‌గా కిలో రూ.160-180 వరకు అమ్ముతున్నారని రోహిత్‌ కేసర్‌వాని వెల్లడించారు. రెండు రోజుల క్రితం వాషి మార్కెట్లో నాణ్యమైన టమాటాలు దొరకకపోవడం విచిత్రమని అన్నారు. ఇక ఖార్‌ మార్కెట్‌, పాలి మార్కెట్‌, బాంద్రా, దాదర్‌, మతుంగా, ఫోర్‌ బంగ్లోస్‌, అంధేరీ, మలద్‌, పారెల్‌, ఘట్కోపర్‌, బైకుల్లాలో కిలో రూ.200 వరకు విక్రయిస్తున్నారు. మరీ బేరమాడితే తప్ప ఎవరో ఒకరు రూ.20 వరకు రాయితీ ఇస్తున్నారు. 'మీరు కాబట్టే తగ్గించాను' అనే డైలాగులు వాడుతున్నారట.


ఆదివారం కస్టమర్లు లేకపోవడంతో ఫోర్‌ బంగ్లోస్‌, అంధేరీ మార్కెట్లలో కూరగాయల షాపులు మూసేశారని తెలిసింది. ఖరీదైన టమాటాలను అమ్మడం కష్టంగా మారిందని వ్యాపారులు మొత్తుకుంటున్నారు. ధరలు తగ్గేంత వరకు టమాట బేరం మూసేసి రాఖీలు అమ్ముకుంటానని ఓ వ్యాపారి అనడం గమనార్హం. చాలా దుకాణాల్లో రోజుకు మూడు కిలోల టమాటాలే విక్రయిస్తున్నారని తెలిసింది. వీటికి తోడు కిలో అల్లం రూ.350, కొత్తిమీర కట్ట రూ.50, పచ్చిమిర్చి కిలో రూ.200 కావడంతో ప్రజలు అల్లాడుతున్నారు.


Also Read: ఈపీఎఫ్‌ వడ్డీరేటు డిక్లేర్‌! FY 2022-23కి ఎంత చెల్లిస్తున్నారంటే?


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial