EPF Interest Rate: 


ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (EPFO) ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది! 2022-23 ఆర్థిక ఏడాదికి గాను ఈపీఎఫ్‌ ఖాతాదారులకు 8.15 శాతం వడ్డీని చెల్లిస్తున్నామని ప్రకటించింది. ఈ మేరకు ఈపీఎఫ్‌వో ధర్మకర్తల మండలి సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.


ఉత్తర్వుల సారాంశం


'2022-23 ఆర్థిక ఏడాదికి గాను ఈపీఎఫ్‌వో చందాదారులకు ఖాతాల్లో 8.15 శాతం వడ్డీ చెల్లించాలని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేటును ఆమోదించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పటికే ఉన్న చందాదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది' అని ఈపీఎఫ్‌వో తెలిపింది.


ఈపీఎఫ్‌ అంటే ఏంటి?


వేతన జీవుల కోసం ప్రభుత్వం ఉద్యోగ భవిష్య నిధిని ఏర్పాటు చేసింది. ఉద్యోగులు ప్రతి నెలా తమ జీతంలో 12 శాతం వరకు ఈపీఎఫ్‌లో జమ చేయాల్సి ఉంటుంది. యజమాని సైతం ఇందుకు సమానంగా కంట్రిబ్యూట్‌ చేస్తారు. అయితే వారి కాంట్రిబ్యూషన్‌లో 3.67 శాతమే ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. మిగిలిన 8.33 శాతం ఎంప్లాయీ పెన్షన్‌ స్కీమ్ (EPS)కి బదిలీ అవుతుంది.  ఏటా ఈపీఎఫ్‌లో జమ చేసిన డబ్బుకు కేంద్ర ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుంది. ఎంత మేరకు చెల్లించాలనేది ఈపీఎఫ్‌ ధర్మకర్తల మండలి, కార్మిక మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం కలిసి నిర్ణయిస్తాయి.


ఈపీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోవడం ఎలా?


1. మిస్డ్ కాల్ ద్వారా PF బ్యాలెన్స్ తెలుసుకోండి


మీరు కేవలం ఒక మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మీ పీఎఫ్‌ ఖాతా బ్యాలెన్స్‌ని తనిఖీ చేయవచ్చు. దీని కోసం, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 9966044425 నంబర్‌కు ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి. ఆ తర్వాత కొన్ని నిమిషాల వ్యవధిలో మీకు సమాచారం వస్తుంది. మీ PF ఖాతాలో జమ అయిన మొత్తం గురించి సమాచారం అందులో తెలుస్తుంది. మిస్డ్ కాల్ ద్వారా PF ఖాతా బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే, మీ యూనివర్సల్ అకౌంట్‌ నంబర్ (UAN) తప్పనిసరిగా యాక్టివ్‌గా ఉండాలని గుర్తుంచుకోండి. UANతో మొబైల్ నంబర్‌ను లింక్‌ చేసి ఉండడం కూడా ఇక్కడ అవసరం.


2. SMS ద్వారా బ్యాలెన్స్ తనిఖీ చేయండి


మిస్డ్ కాల్ కాకుండా, మీరు SMS ద్వారా కూడా PF ఖాతా నిల్వను తనిఖీ చేయవచ్చు. దీని కోసం, మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి EPFOHO UAN అని టైప్ చేసి 7738299899 నంబర్‌కు పంపాలి. మీ ఖాతాలో జమ అయిన మొత్తం గురించి కొన్ని నిమిషాల్లో మీకు తిరిగి సమాచారం అందుతుంది.


3. ఉమాంగ్ యాప్ ద్వారా నగదు నిల్వ చేసుకోవచ్చు        


ఒకవేళ మీ ఫోన్‌ నుంచి మిస్డ్‌ కాల్‌ లేదా SMS వెళ్లని పరిస్థితుల్లో, ఉమాంగ్‌ యాప్‌ ద్వారా కూడా మీ PF ఖాతా బ్యాలెన్స్‌ను చెక్‌ చేసుకోవచ్చు. దీని కోసం, ముందుగా మీ స్మార్ట్‌ ఫోన్‌లోకి Umang యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి. ఆ తర్వాత, మీ మొబైల్ నంబర్, OTP నమోదు చేయడం ద్వారా రిజిస్టర్‌ చేసుకోండి. ఇప్పుడు, యాప్‌ ఓపెన్‌ చేసి సర్వీసెస్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. EPFO ఆప్షన్‌కు​వెళితే పాస్‌బుక్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. అక్కడ UAN, OTPని నమోదు చేయండి. దీని తర్వాత, మీరు మీ ఖాతాలో జమ చేసిన మొత్తం డబ్బు గురించి సమాచారాన్ని పొందుతారు.



4. EPFO వెబ్‌సైట్ ద్వారా సమాచారం పొందండి


PF బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే EPFO అధికారిక వెబ్‌సైట్ www.epfindia.gov.in  ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఈ సైట్‌లో, అవర్‌ సర్వీసెస్‌ జాబితాను ఎంచుకోండి. ఇక్కడ, ఫర్‌ ఎంప్లాయీస్‌ ఆప్షన్‌ను ఎంచుకోండి. దీని తర్వాత, మెంబర్ పాస్‌బుక్‌ను ఎంచుకోండి. ఇక్కడ, మీ UAN & పాస్‌వర్డ్‌ నమోదు చేయాలి. మీరు వివరాలను విజయవంతంగా నమోదు చేస్తే, మీ PF ఖాతాలో డిపాజిట్ చేసిన మొత్తం గురించిన సమాచారం మీకు కనిపిస్తుంది.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial