Stock Market Today, 19 April 2024: ఇరాన్‌ న్యూక్లియర్‌ ఫ్లాంట్‌ సమీపంలో బాంబ్‌ పేలుళ్ల వార్తలతో పాటు US ఫెడరల్ రిజర్వ్ అధికారుల హాకిష్ కామెంట్లతో ప్రపంచ స్టాక్‌ మార్కెట్ల పరిస్థితి దారుణంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లలోని అత్యంత బలహీనత ప్రభావం ఈ రోజు (శుక్రవారం) దేశీయ ఈక్విటీ మార్కెట్లపై పడుతుంది. దీంతోపాటు.. ఇండియన్‌ కార్పొరేట్‌ కంపెనీల మార్చి త్రైమాసిక ఫలితాలు, 2024 లోక్‌సభ ఎన్నికల మొదటి దశ ప్రారంభం వంటివి కూడా పెట్టుబడిదార్లపై ప్రభావం చూపుతాయి. 


గురువారం సెషన్‌లో నిఫ్టీ ఇండెక్స్‌ 21,995.85 దగ్గర క్లోజ్‌ అయింది. ఈ ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 22,725 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు గ్యాప్‌ డౌన్‌లో ప్రారంభం కావచ్చని GIFT NIFTY సూచిస్తోంది.


గ్లోబల్‌ మార్కెట్లు
ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లలో.. ఈ ఉదయం జపాన్‌కు చెందిన నికాయ్‌ 3 శాతం పతనమైంది. దక్షిణ కొరియాకు చెందిన కోస్పి 2 శాతం, ఆస్ట్రేలియా ASX, హాంగ్‌కాంగ్‌ హాంగ్‌సెంగ్ 1.3 శాతం చొప్పున ఆవిరయ్యాయి.


గురువారం యూఎస్‌ మార్కెట్లు మిశ్రమ నోట్‌తో అస్థిరంగా క్లోజ్‌ అయ్యాయి. S&P 500 ఇండెక్స్ 0.22 శాతం, నాస్‌డాక్ కాంపోజిట్ 0.52 శాతం పడిపోయాయి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.06 శాతం పెరిగింది.


యూఎస్‌ మాన్యుఫాక్చరింగ్‌ డేటా స్ట్రాంగ్‌గా రావడంతో అమెరికన్‌ బెంచ్‌మార్క్‌ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ 4.526 శాతం వద్ద ఉంది. మిడిల్‌ ఈస్ట్‌లో టెన్షన్ల కారణంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 3% పైగా పెరిగింది, $90 పైన ట్రేడ్‌ అవుతోంది. గోల్డ్ ఒక్కసారిగా దూసుకెళ్లింది, ఔన్సుకు $2,427 దగ్గర ఉంది. 
 
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 


ఈ రోజు Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: ఎలెకాన్ ఇంజనీరింగ్, HDFC AMC, హిందుస్థాన్ జింక్, జియో ఫైనాన్షియల్స్, విప్రో. శనివారం నాడు... అలోక్ ఇండస్ట్రీస్, HDFC బ్యాంక్, ఇండ్ బ్యాంక్ హౌసింగ్, ఇంటర్నేషనల్ ట్రావెల్ హౌస్, స్టెర్లింగ్ అండ్ విల్సన్ రెన్యూవబుల్ ఎనర్జీ మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తాయి.


ఇన్ఫోసిస్: 2024 మార్చి త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం రూ. 7,969 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలోని రూ. 6,128 కోట్లతో పోలిస్తే 30 శాతం వార్షిక (YoY) వృద్ధిని నమోదు చేసింది. ఏకీకృత ఆదాయం రూ.37,441 కోట్ల నుంచి 1.3 శాతం పెరిగి రూ.37,923 కోట్లకు చేరింది.


బజాజ్ ఆటో: ఏకీకృత నికర లాభం సంవత్సరానికి 18 శాతం పెరిగి రూ. 2,011.43 కోట్లుగా నమోదైంది. ఆదాయం 30 శాతం జంప్‌తో రూ. 11,249.8 కోట్లకు చేరుకుంది. బజాజ్ ఆటో బోర్డు ఒక్కో షేరుకు రూ.80 డివిడెండ్‌ను సిఫార్సు చేసింది. అయితే.. స్వతంత్ర ప్రాతిపదికన QoQలో కంపెనీ ఆదాయం, లాభం 5 శాతం చొప్పున తగ్గాయి.


HDFC లైఫ్: Q4 FY24 నికర లాభం YoYలో రూ.358.66 కోట్ల నుంచి 14.7 శాతం వృద్ధితో రూ.411.66 కోట్లకు పెరిగింది. పన్నులన్నీ తీసేసిన తర్వాత, న్యూ బిజినెస్‌ వాల్యూ (VNB) మార్జిన్ 29.30 శాతం నుంచి 26.10 శాతానికి తగ్గింది.


ICICI సెక్యూరిటీస్: ఏడాది క్రితం వచ్చిన లాభం రూ.263 కోట్లతో పోలిస్తే, Q4 FY24లో లాభం రెండు రెట్లు పెరిగి రూ.537 కోట్లకు చేరుకుంది. మొత్తం ఆదాయం భారీగా 74 శాతం పెరిగి రూ.1,544 కోట్లుగా నమోదైంది. ఏడాది క్రితం ఇది రూ.885 కోట్లుగా ఉంది.


టాటా మోటార్స్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త విధానం ప్రకారం, తన జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లను దిగుమతి చేసుకోవాలని యోచిస్తోంది. కొత్త విధానం ప్రకారం, స్థానికంగా తయారీ ఫ్లాంట్లను స్థాపించే కంపెనీలకు దిగుమతి పన్నులు తగ్గుతాయి. 


ITC: పుణెకు చెందిన బ్లేజ్‌క్లాన్‌ టెక్నాలజీస్‌లో (Blazeclan Technologies) 100 శాతం వాటాను రూ. 485 కోట్లతో కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.


వొడాఫోన్ ఐడియా: వొడాఫోన్ ఐడియా నుంచి అభ్యర్థన వస్తేనే, ఈ కంపెనీ ప్రస్తుత రుణాన్ని ఈక్విటీగా మారుస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌