Infosys Q4 FY24 Results: దేశంలోని రెండో అతి పెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్, 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో బంపర్‌ లాభాలు సాధించింది. 2024 జనవరి - మార్చి త్రైమాసికంలో కంపెనీ లాభం 30 శాతం ‍‌(YoY) వృద్ధితో రూ. 7,969 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం 2022-23 ఇదే త్రైమాసికంలో ఇన్ఫోసిస్ రూ. 6,128 కోట్ల లాభాన్ని ఆర్జించింది. Q4 FY24 లో కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం రూ. 37,923 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం అదే త్రైమాసికంలో రూ. 37,441 కోట్లుగా నమోదైంది. ఇది YoY ప్రాతిపదికన ఒక శాతం పెరిగింది.


పూర్తి ఆర్థిక సంవత్సరం FY24లో కంపెనీ నెట్‌ ప్రాఫిట్‌  8.9 శాతం వృద్ధి చెందింది. YoYలో ఇది రూ. 26,233 కోట్ల నుంచి రూ. 24,095 కోట్లకు పెరిగింది. అదే సమయంలో మొత్తం ఆదాయం 4.7 శాతం పెరిగి రూ. 1,53,670 కోట్లకు చేరింది.


ఆదాయ అంచనా
2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆదాయంలో 1 నుంచి 3 శాతం వృద్ధిని ఈ ఐటీ మేజర్‌ అంచనా వేసింది. కాగా, గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 4 నుంచి 7 శాతం రెవెన్యూ గైడెన్స్‌ను అందించింది. 


డివిడెండ్‌
తన వాటాదార్లకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ. 20 డివిడెండ్‌ను కూడా ఇన్ఫీ ప్రకటించింది. అంతేకాదు, ఒక్కో షేరుకు రూ. 8 ప్రత్యేక డివిడెండ్ కూడా ఇస్తామని వెల్లడించింది. దీంతో ఇన్ఫోసిస్‌ షేర్‌ హోల్డర్లకు రూ. 28 డివిడెండ్‌ అందుతుంది.  


జనవరి - మార్చి త్రైమాసికంలో, ఇన్ఫోసిస్ 4.5 బిలియన్‌ డాలర్ల విలువైన ఒప్పందాలు చేసుకుంది. ఇందులో 44 శాతం కొత్తవి. మొత్తం FY24 ఆర్థిక సంవత్సరంలో డీల్స్‌ విలువ 17.7 బిలియన్ డాలర్లు.


తగ్గిన హెడ్‌కౌంట్‌ 
2023-24 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య 25,994 తగ్గిందని ఇన్ఫోసిస్ తెలిపింది. 2001 తర్వాత, గత 23 ఏళ్లలో ఇన్ఫోసిస్ ఉద్యోగుల సంఖ్య తగ్గడం ఇదే తొలిసారి. ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి తమ వద్ద 3,17,240 మంది పని చేస్తున్నట్లు ఈ ఐటీ కంపెనీ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం కంటే ఇది 7.5 శాతం తక్కువ. కంపెనీని విడిచిపెట్టే వ్యక్తులను సూచించే అట్రిషన్ రేటు నాలుగో త్రైమాసికంలో 12.6 శాతానికి తగ్గింది, అంతకుముందు త్రైమాసికంలో ఇది 12.9 శాతంగా ఉంది. 


గురువారం (18 ఏప్రిల్‌ 2024) మార్కెట్ ముగిసిన తర్వాత ఇన్ఫోసిస్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఆ ట్రేడింగ్‌ సెషన్‌లో కంపెనీ షేరు 0.34 శాతం లాభంతో రూ. 1419.25 వద్ద ముగిసింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ఇప్పుడు తులం బంగారం కొన్నవాళ్లు రేపు లక్షాధికారి!