Stock Market Today, 15 May 2024: అమెరికన్ మార్కెట్లు, ఆసియా మార్కట్లలోని సానుకూలతను బట్టి భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (బుధవారం) కూడా పాజిటివ్ మోడ్‌లో ఓపెన్ కావచ్చు. అయితే, బిగ్‌బాయ్స్ భారీ అమ్మకాలను కొనసాగిస్తున్నారు. నిన్న, FIIs రూ. 4,065.52 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు. DIIs 3,527.86 కోట్ల విలువైన షేర్లను కొన్నారు.
విరుష్క జంట పెట్టుబడులు ఉన్న గో డిజిట్ ఐపీవో (Go Digit IPO) ఈ రోజు ఓపెన్ అవుతుంది, మార్కెట్ ఫోకస్ దీనిపై ఉంటుంది.
సోమవారం సెషన్‌లో నిఫ్టీ ఇండెక్స్ 22,217 దగ్గర క్లోజ్ అయింది. ఈ ఉదయం 8.05 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 22,370 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం కావచ్చని GIFT NIFTY సూచిస్తోంది.
గ్లోబల్ మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో, ఈ ఉదయం, నికాయ్ & ASX200 ఇండెక్స్ తలో 0.5 శాతం పెరిగాయి. షాంఘై కాంపోజిట్ 0.4 శాతం పడిపోయింది. దక్షిణ కొరియా, హాంగ్ కాంగ్ మార్కెట్లకు ఈ రోజు సెలవు.
అమెరికన్ మార్కెట్లలో, నిన్న, నాస్‌డాక్ కాంపోజిట్ 0.75 శాతం లాభపడి 16,511.18 వద్ద రికార్డు స్థాయిలో క్లోజ్ అయింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.32 శాతం పెరిగింది, S&P 500 0.48 శాతం ర్యాలీ చేసింది.
అమెరికాలో ద్రవ్యోల్బణం మార్కెట్ అంచనాలను మించడంతో 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ 4.441% వద్దకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గాయి, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు $83 దిగువకు చేరింది. గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ రేటు పుంజుకుంది, ఔన్సుకు $2,363 డాలర్లకు పెరిగింది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి (Stocks in news Today):
భారతి ఎయిర్‌టెల్: Q4 FY24లో కంపెనీ ఏకీకృత నికర లాభం 31 శాతం తగ్గింది, ఇది గత ఏడాది ఇదే కాలంలోని రూ. 3,005.6 కోట్లతో పోలిస్తే ఇప్పుడు రూ. 2,071.6 కోట్లుగా నమోదైంది. ఏకీకృత ఆదాయం కూడా 10.5 శాతం తగ్గి రూ. 7,467 కోట్లకు పరిమితమైంది.
సిప్లా: ఈ ఫార్మా కంపెనీ ప్రమోటర్లు రూ. 2,637 కోట్ల విలువైన షేర్లు లేదా 2.53 శాతం వాటాను విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నారని నేషనల్ మీడియాలో రిపోర్ట్స్ వచ్చాయి.
పేటీఎం: MSCI ఇండియా ఇండెక్స్ నుంచి పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ చోటు కోల్పోయింది. అయితే, MSCI ఇండియా స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లో దీనికి స్థానం దక్కింది.
కోల్గేట్: 2024 మార్చి త్రైమాసికంలో రూ. 379.82 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఈ FMCG దిగ్గజం ప్రకటించింది. ఇది గత ఏడాది కాలంతో పోలిస్తే ఈసారి 20.11 శాతం వృద్ధిని సాధించింది. మొత్తం అమ్మకాలు గత ఏడాది కంటే 10.35 శాతం పెరిగి రూ.1,480.66 కోట్లకు చేరాయి.
శ్రీ సిమెంట్: 2024 జనవరి-మార్చి కాలంలో శ్రీ సిమెంట్ సూపర్ పెర్ఫార్మ్ చేసింది. కంపెనీ ఏకీకృత నికర లాభం 28 శాతం YoY పెరిగి రూ.674.9 కోట్లకు చేరుకుంది, మార్కెట్ అంచనాల కంటే ఇది ఎక్కువ. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం కూడా ఏడాది ప్రాతిపదికన 6 శాతం పైగా పెరిగి రూ. 5,433 కోట్లకు చేరుకుంది.
సీమెన్స్: 2023-24 నాలుగో త్రైమాసికంలో సీమెన్స్ లాభం దాదాపు 74 శాతం జంప్‌తో రూ. 896 కోట్లకు చేరుకుంది. మార్చి క్వార్టర్‌లో ఈ కంపెనీ రూ. 5,184 కోట్ల విలువైన కొత్త ఆర్డర్‌లు అందుకుంది. ఆదాయం రూ. 5,248 కోట్లుగా ఉంది, ఇది గత సంవత్సరంతో పోలిస్తే 19 శాతం పెరిగింది.
అపోలో టైర్స్: Q4లో కంపెనీ నికర లాభం 13.7 శాతం తగ్గి రూ. 354 కోట్లకు పరిమితమైంది. ఆదాయం అతి స్వల్పంగా 0.2 శాతం పెరిగి రూ. 6,258 కోట్లకు చేరింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి