Stocks to watch today, 09 December 2022: ఇవాళ (శుక్రవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 66.5 పాయింట్లు లేదా 0.36 శాతం రెడ్‌ కలర్‌లో 18,794 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


హిందుస్థాన్ యూనిలీవర్: OZivaలో మెజారిటీ వాటాను, Wellbeing Nutritionలో 19.8 శాతం ఈక్విటీని కలిపి, మొత్తం రూ. 335 కోట్ల పెట్టుబడితో ఆరోగ్య విభాగంలోకి హిందుస్థాన్ యూనిలీవర్ అడుగుపెడుతోంది. OZiva బ్రాండ్‌తో బిజినెస్ చేస్తున్న Zywie వెంచర్స్‌లో 51 శాతం వాటాను రూ. 264.28 కోట్లతో కొనుగోలు చేస్తోంది.


సన్ ఫార్మాస్యూటికల్: హలోల్ ఫెసిలిటీకి ఇంపోర్ట్‌ అలెర్ట్‌ తర్వాత, ఈ ఔషధ కంపెనీ ఒక వివరణాత్మక నోట్‌ రిలీజ్‌ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆదాయ మార్గదర్శకాన్ని సవరించడం లేదని, ప్రత్యేక ఆదాయాల మీద ఎటువంటి ప్రభావం ఉండదని పేర్కొంది. హాలోల్‌ నుంచి USకు వెళ్లే ఉత్పత్తులు FY22 ఏకీకృత ఆదాయంలో సుమారు 3 శాతం వాటాను అందించాయి.


అదానీ ఎంటర్‌ప్రైజెస్: అదానీ ఇన్‌ఫ్రా (ఇండియా) చేతిలో ఉన్న అల్లువియల్ మినరల్ రిసోర్సెస్‌లో (Alluvial Mineral Resources) 100 శాతం వాటాను అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ కొనుగోలు చేసింది. మినరల్స్‌ & ఖనిజాల తవ్వకం, ఇతర అనుబంధ కార్యకలాపాల్లో అల్లువియల్ మినరల్ రిసోర్సెస్‌ నిమగ్నమై ఉంది.


ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో): న్యూ గోవా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశంలోని ఎనిమిది నగరాలకు వారానికి 168 విమానాలను నడుపుతామని ఇండిగో తెలిపింది. ఆ రాష్ట్రంలో రెండో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని డిసెంబర్ 11న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 5న ఈ విమానాశ్రయం వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించనుంది.


వన్‌97 కమ్యూనికేషన్స్ (పేటీఎం): షేర్ బైబ్యాక్ ప్రతిపాదనను పరిశీలించేందుకు డిసెంబర్ 13న డైరెక్టర్ల బోర్డు సమావేశమవుతుందని డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ Paytm తెలిపింది. తాజా ఆదాయ నివేదిక ప్రకారం, Paytm చేతిలో రూ. 9,182 కోట్ల లిక్విడిటీ ఉంది.


లుపిన్: స్పిరో గావరిస్‌ను అమెరికా జనరిక్స్ బిజినెస్ ప్రెసిడెంట్‌గా ఈ ఫార్మా మేజర్ నియమించింది. మల్లిన్‌క్రోడ్ట్ ఫార్మాస్యూటికల్స్‌లో స్పెషాలిటీ జెనరిక్స్ బిజినెస్‌ ప్రెసిడెంట్‌గా, హిక్మాలో US ఇంజెక్టబుల్స్ ప్రెసిడెంట్‌గా అధ్యక్షుడిగా స్పిరో గావరిస్‌ పని చేశారు.


అశోక్ లేలాండ్: తక్షణమే అమల్లోకి వచ్చేలా షేను అగర్వాల్‌ను కంపెనీ MD & CEO గా ఈ హిందూజా గ్రూప్ ఫ్లాగ్‌షిప్ నియమించింది. ప్రపంచవ్యాప్తంగా టాప్ టెన్ కమర్షియల్ వెహికల్ ప్లేయర్లలో ఒకటిగా ఉండాలనే ఉద్దేశ్యంతో కంపెనీ సాంకేతికత అభివృద్ధిని, భవిష్యత్తు వ్యూహాన్ని అగర్వాల్‌ అమలు చేస్తారు.


త్రివేణి ఇంజినీరింగ్ & ఇండస్ట్రీస్: BSEలో అందుబాటులో ఉన్న బల్క్ డీల్ డేటా ప్రకారం, ఈ చక్కెర కంపెనీ ప్రమోటర్ ధృవ్ మన్మోహన్ సాహ్ని 7 శాతం వాటాను లేదా 1.7 కోట్ల షేర్లను ఒక్కొక్కటి సగటు ధర రూ. 280.75 చొప్పున, మొత్తం రూ. 477.27 కోట్లకు విక్రయించారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.