Stocks to watch today, 03 January 2023: ఇవాళ (మంగళవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 48 పాయింట్లు లేదా 0.26 శాతం రెడ్‌ కలర్‌లో 18,175 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


బజాజ్ ఆటో: 2022 డిసెంబర్‌లో ఈ కంపెనీ మొత్తం అమ్మకాలు 22% క్షీణించి 2,81,486 యూనిట్లకు చేరుకున్నాయి. అదే నెలలో మొత్తం ద్విచక్ర వాహనాల విక్రయాలు 23% తగ్గి 2,47,024 యూనిట్లకు పడిపోయాయి. దేశీయ మార్కెట్లో ద్విచక్ర వాహనాల విక్రయాలు 2% తగ్గి 1,25,525 యూనిట్లుగా, ఎగుమతులు 36% తగ్గి 1,21,499 యూనిట్లుగా నమోదయ్యాయి.


M&M ఫైనాన్షియల్: 2022 డిసెంబర్‌లో మొత్తం రుణాల జారీలు గత ఏడాది ఇదే కాలం కంటే 67% పెరిగి రూ. 4,650 కోట్లకు చేరుకున్నాయి. Q3లో (అక్టోబర్‌-డిసెంబర్‌) డిజ్‌బర్స్‌మెంట్స్‌ సుమారు రూ. 14,450 కోట్లుగా ఉన్నాయి, గత సంవత్సరం ఇదే కాలం కంటేకి 80% వృద్ధిని నమోదు చేశాయి.


నజారా టెక్నాలజీస్: దేశంలోని ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు స్వీయ నియంత్రణ సంస్థలు ఉండాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. నైపుణ్యం లేదా అవకాశం ఆధారంగా ఆన్‌లైన్ ఆటలను వర్గీకరించడానికి, నిషేధిత ఫార్మాట్‌లను నిరోధించడానికి, ఆన్‌లైన్ జూదంపై కఠినమైన వైఖరిని తీసుకునేలా ఒక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్యానెల్ చేసిన సిఫార్సు ఆధారంగా ఈ ప్రతిపాదనను ప్రభుత్వం తీసుకువచ్చింది.


సౌత్ ఇండియన్ బ్యాంక్: 2022 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో స్థూల అడ్వాన్స్‌లు ఏడాదికి 18% పెరిగి రూ. 70,168 కోట్లకు చేరుకున్నాయి. డిసెంబర్ 31 నాటికి మొత్తం కరెంట్ ఖాతా - పొదుపు ఖాతా (CASA) రూ. 30,699 కోట్లుగా ఉంది, క్రితం సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇప్పుడు 9% పెరిగింది.


డాబర్ ఇండియా: బాద్షా మసాటాలో (Badshah Masata) 51% వాటా కొనుగోలు సోమవారం పూర్తయింది. దీంతో, డాబర్ ఇండియాకు అనుబంధ సంస్థగా బాద్షా మసాలా మారింది.


ఇండియన్ బ్యాంక్: మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు (MCLR) సహా అన్ని రకాల రుణ రేట్లను 25 బేసిస్ పాయింట్లు లేదా 0.25% వరకు పెంచింది. కొత్త రేట్లు జనవరి 3, 2023 నుంచి అమల్లోకి వచ్చాయి.


లిఖిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్: డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో వివిధ చమురు & గ్యాస్ పంపిణీ సంస్థల నుంచి ఈ కంపెనీ రూ. 120 కోట్ల విలువైన ఆర్డర్‌లను పొందింది.


PSP ప్రాజెక్ట్స్‌: గుజరాత్‌లోని సూరత్‌లో అత్యాధునిక హై రైజ్ ఆఫీస్ బిల్డింగ్ నిర్మాణం కోసం, రూ. 1,364.47 కోట్ల విలువైన ప్రభుత్వ ప్రాజెక్ట్‌లో ఈ కంపెనీ అత్యల్ప బిడ్డర్‌గా నిలిచింది. అంటే, ఆ కాంట్రాక్ట్‌ దాదాపుగా PSP ప్రాజెక్ట్స్‌కు ఖరారైనట్లే.


జొమాటో: కంపెనీ సహ వ్యవస్థాపకుడు & చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గుంజన్ పాటిదార్ సోమవారం (02 జనవరి 2023) రాజీనామా చేశారు. జొమాటో తొలి కొద్ది మంది ఉద్యోగుల్లో పాటిదార్ ఒకరు. కంపెనీ కోసం కోర్ టెక్నాలజీ సిస్టమ్స్‌ను ఆయన ఏర్పాటు చేశారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.