Stock Market Down: రష్యా, ఉక్రెయిన్ యుద్ధభయాలు మార్కెట్లను కమ్మేశాయి. ఇప్పటికే అంతర్జాతీయంగా ముడి చమురు, బంగారం ధరలు కొండెక్కాయి. పరిస్థితి మరింత విషమించేలా కనిపిస్తుండటంతో మదుపర్లు ఆందోళనకు గురవుతున్నారు. అంతర్జాతీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతుండటం వారి సెంటిమెంటును దెబ్బతీసింది. ఆర్థిక సంక్షోభ భయాలు వెంటాడుతుండటంతో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అమ్మకాల బాట పట్టారు. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1000కి పైగా నష్టపోగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కీలకమైన 17,000 స్థాయికి దిగువన ట్రేడ్‌ అవుతోంది.


BSE Sensex


క్రితం సెషన్లో 57,683 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 56,438 వద్ద నష్టాల్లో మొదలైంది. 56,883 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసిన సూచీ వేగంగా పతనమైంది. 56,394 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. నిన్నటి ముగింపుతో పోలిస్తే 1289 పాయింట్లు పతనమైంది. ప్రస్తుతానికి 860 పాయింట్ల నష్టంతో 56,827 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty


సోమవారం 17,206 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 16,847 వద్ద మొదలైంది. 16,977 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. వెంటనే అమ్మకాల సెగ మొదలవ్వడంతో 16,843 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. నిన్నటి ముగింపుతో పోలిస్తే 363 పాయింట్లు పతనమైంది. ప్రస్తుతం 250 పాయింట్ల నష్టంతో 16,957 వద్ద ట్రేడ్ అవుతోంది.


Bank Nifty


నిఫ్టీ బ్యాంకు 36,833 వద్ద మొదలైంది. 37,271 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. వెంటనే నష్టాల్లోకి జారుకొని 36,818 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. ప్రస్తుతం 519 పాయింట్ల నష్టంతో 37,165 వద్ద కొనసాగుతోంది.


Gainers and Lossers


నిఫ్టీలో 2 కంపెనీలు మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి. 48 కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. ఓఎన్‌జీసీ, హిందాల్కో షేర్లు అతి స్వల్ప లాభాల్లో ఉన్నాయి. టీసీఎస్‌, బీపీసీఎల్‌, యూపీఎల్‌, టాటా స్టీల్‌, అదానీ పోర్ట్స్‌ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అన్ని రంగాల సూచీలూ నష్టాల్లో ఉన్నాయి. పవర్‌, ఐటీ, మెటల్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, రియాల్టీ, పీఎస్‌యూ బ్యాంక్‌ సూచీలు 1-2 శాతం పతనమయ్యాయి.