Pig Butchering Scam: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలనే ఆసక్తి ప్రజల్లో పెరుగుతున్న కొద్దీ కొత్త తరహా మోసాలు కూడా మొదలయ్యాయి. ఇప్పుడు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి ప్రజలను బురిడీ కొట్టించే కేటుగాళ్లు చెలరేగిపోతున్నారు. ఇటీవల, "పిగ్ బుచరింగ్" పేరిట కొత్త స్కామ్ బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన కేసులు కూడా వేగంగా పెరుగుతున్నాయి.
పిగ్ బుచరింగ్ స్కామ్ అంటే ఏంటి?
ఈ స్కామ్ అర్ధం దీని పేరులోనే ఉంది. పిగ్ బుచరింగ్ అంటే "పందిని ముక్కలుగా నరకడం" అని అర్థం. మాంసం కోసం పందులను వధించే ముందు వాటిని బాగా మేపి, కొవ్వు పట్టేలా చేస్తారు. ఈ మోసంలో స్కామర్లు కూడా ఇలాంటిదే చేస్తారు. తమ ద్వారా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే భారీగా సంపాదించొచ్చని స్కామర్ గ్యారెంటీ ఇస్తాడు. ప్రారంభంలో ఆకర్షణీయమైన రాబడిని కూడా అందిస్తాడు. దీనివల్ల పెట్టుబడిదారుడిలో ఆశ పెరుగుతుంది, అత్యాశగా మారుతుంది. అప్పుడు, ముందువెనుక ఆలోచించకుండా తన పెట్టుబడిని పెంచుకుంటూ పోతాడు, స్కామర్ విసిరిన గేలానికి చిక్కుతాడు. సదరు స్కామర్ ఆ డబ్బుతో అదృశ్యం అవుతాడు.
డార్క్ వెబ్‌లో నంబర్లు విక్రయం
పిగ్ బుచరింగ్ స్కామ్‌లో పని చేస్తున్న వ్యక్తులు సాధారణ నేరగాళ్లు కాదు. స్టాక్ మార్కెట్ మీద, టెక్నాలజీ మీద గట్టి పట్టున్న వ్యక్తులు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కోసం, సంబంధించిన గుర్తుతెలీని నంబర్ నుంచి మిమ్మల్ని కొత్త వాట్సాప్ గ్రూప్‌లోకి వాళ్లు యాడ్ చేస్తారు. మనలో చాలామందికి ఇది ఇప్పటికే అనుభవంలోకి వచ్చి ఉంటుంది. ఎవరో ముక్కు, మొఖం తెలీని వ్యక్తికి మీ ఫోన్ నంబర్ ఎలా తెలుసనే సందేహం మీకు వచ్చిందా?. వాస్తవానికి, డార్క్ వెబ్‌లో భారీ డేటాబేస్ అమ్మకానికి ఉంది. అందులో, మీ ఫోన్ నంబర్ సహా కోట్లాది మంది ప్రజల సమాచారం అందుబాటులో ఉంది.
పిగ్ బుచరింగ్ స్కామర్‌లు డార్క్ వెబ్ నుంచి డేటా కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత, వాట్సాప్ (WhatsApp) లేదా టెలిగ్రామ్‌లో (Telegram) ఒక గ్రూప్‌ను సృష్టించి, మీ నంబర్ కూడా అందులో యాడ్ చేస్తారు. స్టాక్ మార్కెట్ ఎక్స్‌పర్ట్ లేదా స్టాక్ గురు అని చెప్పుకునే వ్యక్తి కూడా ఆ గ్రూప్‌లో ఉంటాడు. స్టాక్ మార్కెట్ లావాదేవీలతో తన తల పండిపోయిందని, తాను పెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల్లో పని చేసినట్లు చెబుతాడు. ఆ గురువే గ్రూప్ సభ్యులకు టిప్స్ ఇస్తాడు. మార్కెట్ గురించి బాగా తెలిసి వ్యక్తులు కూడా ఆశ్చర్యపోయేలా & మోసపోయేలా ఆ చిట్కాలు పని చేస్తాయి.
కొత్త వాళ్లు ట్రేడింగ్ నేర్చుకునేందుకు స్టడీ మెటీరియల్‌ను కూడా గ్రూప్‌లో పోస్ట్ చేస్తాడు. కొన్నిసార్లు ఇది ఫ్రీగా ఇస్తాడు లేదా నామమాత్రపు సబ్‌స్క్రిప్షన్ ఛార్జ్ అడుగుతాడు. దీనివల్ల, అన్నీ నిజాయితీగా జరుగుతున్నాయని గ్రూప్ సభ్యులు భ్రమ పడతారు. ఇప్పుడు, స్కామర్ చెప్పిన చిట్కాల నుంచి ప్రయోజనం పొందినట్లు చెప్పుకునే వ్యక్తులు గ్రూప్‌లో యాక్టివ్‌గా మారతారు. తాము భారీ లాభాలు ఆర్జించినట్లు చూపించే స్క్రీన్‌షాట్‌లను పోస్ట్ చేస్తారు. ఈ తరహా మోసం కోసం పెద్ద బ్రోకరేజ్ కంపెనీలను పోలి ఉండే నకిలీ వెబ్‌సైట్‌లు, యాప్‌లను స్కామర్ ఉపయోగిస్తాడు. ఆ సైట్ లేదా యాప్‌లో వాస్తవ ట్రేడ్స్ తరహాలోనే అన్నీ జరుగుతాయి. మీరు పెట్టుబడి పెడితే, ప్రారంభంలో లాభాలను మాత్రమే వస్తాయి. లాభాలు కళ్లజూసిన గ్రూప్ సభ్యులు త్వరగా బుట్టలో పడతారు. ఆ తర్వాత పెట్టుబడిని పెంచుకుంటూ వెళ్లి, చివరకు డబ్బు మొత్తం పోగొట్టుకుంటారు.
జీరోధ (Zerodha) సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ కూడా ఈ స్కామ్ గురించి ఇటీవల ప్రజలను హెచ్చరించారు. పిగ్ బుచరింగ్ మాత్రమే కాదు, ఈ తరహా స్కామ్‌ల నుంచి మీ డబ్బును రక్షించుకోవడానికి అప్రమత్తత అవసరం. అత్యాశకు పోయి ఊహించలేనంత రాబడికి బలి కావద్దు. వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూప్‌ల్లో కనిపించే చిట్కాలకు దూరంగా ఉండండి. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దు.
మరో ఆసక్తికర కథనం: బ్యాంకు అకౌంట్, క్రెడిట్ కార్డు ఉన్నవారి బీపీ పెంచే న్యూస్ - ఇలా డిపాజిట్ చేస్తే ఐటీ నోటీసు ఖాయం!