Assets of Kangana Ranaut: హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరపున ఎన్నికల బరిలోకి దిగనున్నారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ఇప్పటికే జోరుగా ప్రచారం చేస్తున్నారు. జూన్ 1వ తేదీన హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే కంగనా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్‌తో పాటు దాఖలు చేసిన అఫిడవిట్‌లో (Kangana Ranaut’s Assets) ఆమె ఆస్తుల వివరాలు వెల్లడించారు. ఈ అఫిడవిట్ ఆధారంగా చూస్తే కంగనా రనౌత్ మొత్తం ఆస్తుల విలువ రూ.91.6 కోట్లు. దీంతో పాటు రూ.4.9 కోట్ల విలువ చేసే 50 LIC పాలసీలున్నాయి. ఈ పాలసీలన్నింటినీ ఆమె 2008లో తీసుకున్నారు. ఇక కంగనాపై 8 క్రిమినల్ కేసులున్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అందులో నాలుగు పరువు నష్టం దావాలు కాగా, మత విశ్వాసాలను కించపరిచే విధంగా మాట్లాడినందుకు రెండు కేసులు, మత విద్వేషాలు రెచ్చగొట్టినందుకు ఓ కేసు, కాపీరైట్ కేసు నమోదయ్యాయి. ఇక ఆస్తుల విషయానికొస్తే చరాస్తుల విలువ రూ.28.73 కోట్లుగా ఉంది. రూ.5.48 కోట్ల విలువైన మూడు హైఎండ్ కార్స్‌తో పాటు రూ.53 వేల విలువ చేసే ఓ వెస్పా స్కూటర్ కూడా ఉంది. 6.7 కిలోల బంగారం, 60 కిలోల వెండి, రూ.8.5 కోట్ల విలువ చేసే 14 క్యారట్ డైమండ్స్ ఉన్నట్టు అఫిడవిట్‌లో వెల్లడించారు కంగనా. ఆమె పేరిట రెండు కంపెనీలున్నాయి. ఒకటి మణికర్ణిక ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కాగా మరోటి మణికర్ణిక స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ రెండు కంపెనీల్లో రూ.1.2లక్షల విలువైన షేర్స్ ఉన్నాయి.
మణికర్ణిక ఫిల్మ్స్ కోసం కంగనా రూ.40 లక్షల లోన్ తీసుకున్నారు. ఆమె సోదరుడు అక్షత్ రనౌత్ పేరిట మరో రూ.70.98 లక్షల లోన్ ఉంది. మణికర్ణిక స్పేస్ డైరెక్టర్ అయిన ఆమె తండ్రి రూ.28.97 కోట్ల లోన్ తీసుకున్నారు. ప్రస్తుతానికి Manikarnika Films బ్యానర్‌పై Emergency సినిమాని ప్రమోట్ చేస్తున్నారు కంగనా రనౌత్. ఇక స్థిరాస్తుల విలువ రూ.62.9కోట్లుగా ఉంది. గత రెండేళ్లలో ఛండీగఢ్‌లో ఆమె రూ.2.46 కోట్ల విలువ చేసే నాలుగు కమర్షియల్ ప్రాపర్టీస్ కొనుగోలు చేశారు. వీటితో పాటు కులు, ముంబయిలో రూ.28.95కోట్ల విలువైన కమర్షియల్ భవనాలున్నాయి. మహారాష్ట్రలో ఓ ఫ్లాట్‌తో పాటు హిమాచల్ ప్రదేశ్‌లో ఓ ఇల్లు ఉన్నాయి. ఈ రెండింటి విలువ రూ.31.5 కోట్లు. తనను తాను యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా అఫిడవిట్‌లో పేర్కొన్నారు కంగనా. చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలో అడుగు పెట్టారు. ఛండీగఢ్‌లోని DAV మోడల్ స్కూల్‌లో 12వ తరగతి వరకు చదువుకున్నారు. 2003లో 12th class పాసైన ఆమె ఆ తరవాత చదువు ఆపేశారు. మండి నియోజకవర్గం నుంచి ఈ సారి బరిలోకి దిగనున్న కంగనాకి కాంగ్రెస్ తరపున విక్రమాదిత్య సింగ్ ప్రత్యర్థిగా ఉన్నారు. హిమాచల్ మాజీ ముఖ్యమంత్రి వీరభధ్ర సింగ్ కొడుకైన విక్రమాదిత్య సింగ్‌కి స్థానకంగా కాస్త క్యాడర్ ఉంది. అందుకే..వీళ్లిద్దరి మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.
Also Read: Kerala News: వేలికి బదులుగా నాలుకకు సర్జరీ, ప్రభుత్వాసుపత్రిలో వైద్యుడి నిర్లక్ష్యం