Stock Market Closing On 27 September 2024: వారంలోని చివరి ట్రేడింగ్ సెషన్‌లో స్టాక్‌ మార్కెట్లు నిరాశపరిచాయి. BSE సెన్సెక్స్‌ & NSE నిఫ్టీ రెండూ రెడ్‌ జోన్‌లో క్లోజ్‌ అయ్యాయి. ఈ రోజు (శుక్రవారం, 27 సెప్టెంబర్ 2024‌) ఉదయం ట్రేడింగ్ సెషన్‌లో సెన్సెక్స్ & నిఫ్టీ ఆల్ టైమ్ హైని తాకాయి. ఆ తర్వాత ప్రాఫిట్ బుకింగ్‌ కారణంగా మార్కెట్ మెల్లగా కిందకు జారిపోయింది. బ్యాంకింగ్ & ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెక్టార్‌ స్టాక్స్‌లో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా మార్కెట్‌లో క్షీణత వచ్చింది. రిలయన్స్‌, టైటన్‌, సన్‌ ఫార్మా వంటి కొన్ని షేర్లు రాణించి, మార్కెట్‌లో మరింత పతనాన్ని అడ్డుకున్నాయి.


ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 264.27 పాయింట్లు లేదా 0.31% నష్టంతో 85,571.85 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 40.90 పాయింట్లు లేదా 0.16% పతనంతో 26,175.15 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ ఉదయం సెన్సెక్స్‌ 85,893.84 దగ్గర, నిఫ్టీ 26,248.25 దగ్గర ఓపెన్‌ అయ్యాయి.


పెరిగిన & పడిపోయిన షేర్లు 
సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లోని 15 షేర్లు లాభాలతో ముగియగా, 15 షేర్లు నష్టాలతో సరిపెట్టుకున్నాయి. నిఫ్టీ 50 ప్యాక్‌లో 29 స్టాక్స్ ప్రాఫిట్స్‌ కళ్లజూడగా, 21 లాస్‌ల బారినపడ్డాయి. టాప్‌ గెయినర్స్‌లో... సన్ ఫార్మా 2.67 శాతం, రిలయన్స్ 1.72 శాతం, టైటన్ 1.50 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.31 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 1.10 శాతం, ఏషియన్ పెయింట్స్ 0.90 శాతం, ఎన్‌టీపీసీ 0.73 శాతం, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 0.66 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 0.63 శాతం, టాటా స్టీల్ 0.54 శాతం, మారుతి సుజుకి 0.49 శాతం పెరిగాయి. మరోవైపు... పవర్ గ్రిడ్ 3.03 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.83 శాతం, భారతి ఎయిర్‌టెల్ 1.74 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1.65 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ 1.55 శాతం పతనంతో క్లోజ్‌ అయ్యాయి.


సెక్టార్ల వారీగా...
ఆటో, ఐటీ, ఫార్మా, మెటల్స్, ఎనర్జీ, కమోడిటీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్ కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లు లాభపడ్డాయి. బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, రియల్‌ ఎస్టేట్‌ షేర్లు బోర్లాపడ్డాయి. మిడ్‌ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో కూడా ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది.  


కొత్త గరిష్టానికి మార్కెట్ క్యాప్
ఈ రోజు ట్రేడింగ్‌లో సెన్సెక్స్, నిఫ్టీ నేలచూపులు చూసినప్పటికీ, ఇన్వెస్టర్ల సంపద మాత్రం భారీగా పెరిగింది. గత ట్రేడింగ్ సెషన్‌లో రూ.477.17 లక్షల కోట్ల వద్ద ముగిసిన బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ ఈ రోజు రూ.477.97 లక్షల కోట్ల ఆల్‌ టైమ్‌ హై లెవల్‌ (Market Capitalization Of Indian Stock Market) వద్ద ముగిసింది. నేటి ట్రేడ్‌లో మార్కెట్ క్యాప్‌లో రూ.80000 కోట్ల జంప్ కనిపించింది. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: బంగారంపై భారీ లాభాలు పొందొచ్చు!, ఎలా పెట్టుబడి పెట్టాలో తెలుసా?