Stock Market Closing On 26 September 2024: ఈ రోజు (గురువారం, 26 సెప్టెంబర్ 2024‌) ట్రేడింగ్ సెషన్ భారత స్టాక్ మార్కెట్‌లో మళ్లీ చరిత్ర సృష్టించింది. షేర్ల కోసం ఇన్వెస్టర్లు ఎగబడడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సరికొత్త రికార్డుల వద్ద ముగిశాయి. మెటల్స్, ఆటో సెక్టార్లు డబుల్‌ ఇంజిన్స్‌లా మారి మార్కెట్‌ను సరికొత్త ఎత్తయిన ప్రాంతాలకు చేర్చాయి. 


ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 666 పాయింట్లు లేదా 0.78% జంప్‌తో 85,836 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 212 పాయింట్లు లేదా 0.81% లాభంతో 26,216 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ ఉదయం సెన్సెక్స్‌ 85,167.56 దగ్గర, నిఫ్టీ 26,005.40 దగ్గర ఓపెన్‌ అయ్యాయి.


పెరిగిన & పడిపోయిన షేర్లు 
సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లోని 28 షేర్లు లాభాలతో ముగియగా, 2 షేర్లు నష్టాలతో రోజును ముగించాయి. నిఫ్టీ 50 ప్యాక్‌లో 44 షేర్లు ప్రాఫిట్స్‌ ఆర్జించగా, 6 స్టాక్స్‌ లాస్‌లు తలకెత్తుకున్నాయి. నేటి ట్రేడింగ్‌లో మారుతి సుజుకి 4.76 శాతం, టాటా మోటార్స్ 3.08 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 2.58 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 2.53 శాతం, టాటా స్టీల్ 2.48 శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 2.11 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 2.1.9 శాతం చొప్పున పెరిగాయి. మరోవైపు... సిప్లా 1.30 శాతం, ఓఎన్‌జీసీ 1.17 శాతం, లార్సెన్ అండ్‌ టూబ్రో (L&T) 0.84 శాతం, హీరో మోటోకార్ప్ 0.61 శాతం, ఎన్‌టీపీసీ 0.34 శాతం, దివీస్ ల్యాబ్ 0.28 శాతం చొప్పున నష్టపోయాయి. 


కొత్త గరిష్టానికి మార్కెట్ క్యాప్
ఈ సంవత్సరం, దీపావళి కంటే ముందే స్టాక్‌ మార్కెట్‌లో వెలుగులు పూస్తున్నాయి. కొనుగోళ్ల పరంపర కారణంగా మార్కెట్ క్యాప్ కొత్త చారిత్రక గరిష్ట స్థాయికి చేరుకుంది. బీఎస్‌ఇలో లిస్టయిన స్టాక్స్ మార్కెట్ క్యాప్ గత ట్రేడింగ్ సెషన్‌లో రూ.475.25 లక్షల కోట్లుగా ఉండగా, ఈ రోజు రూ.477.04 లక్షల కోట్ల వద్ద ముగిసింది. నేటి సెషన్‌లో రూ.1.79 లక్షల కోట్లు పెరిగింది.


సెక్టార్ల వారీగా...
నేటి ట్రేడింగ్‌లో... ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మెటల్స్, ఐటీ, ఎనర్జీ, హెల్త్‌కేర్, ఆయిల్ & గ్యాస్, బ్యాంకింగ్ స్టాక్స్‌ లాభాలతో ముగిశాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ స్టాక్స్‌ మాత్రం పడిపోయాయి. మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లు ఈ రోజు కూడా తడబడ్డాయి. అయితే, నిఫ్టీ మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌లో కొనుగోళ్లు పునఃప్రారంభం రావడంతో చివరకు హైయ్యర్‌ సైడ్‌లో క్లోజ్‌ అయింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ మాత్రం పతనంతో ముగిసింది.  


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ఉద్యోగంలో చేరి 6 నెలలు కాకున్నా రూ.1 లక్ష పీఎఫ్‌ విత్‌డ్రా - కొత్త రూల్‌ వచ్చిందిగా!