Reliance Retail Ventures: ముకేష్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (RIL) హెల్త్‌కేర్ రంగంలో పట్టు పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది. అయితే.. ఈ సెక్టార్‌లో కొత్త కంపెనీని ఏర్పాటు చేయడం కంటే, ఇప్పటికే పాతుకుపోయిన సంస్థను చేజిక్కించుకోవాలని చూస్తోంది. దీనికోసం రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌ రంగంలోకి దిగి ప్రయత్నాలు ప్రారంభించిందని తెలుస్తోంది.


రూ.3,000 కోట్ల పెట్టుబడి!
డయాగ్నస్టిక్‌ హెల్త్‌కేర్‌ (Diagnostic Healthcare) సెక్టార్‌లో వ్యాపారాన్ని విస్తరించేందుకు RRVL సిద్ధమవుతోందని హిందు బిజినెస్ లైన్ రిపోర్ట్‌ చేసింది. దేశవ్యాప్తంగా డయాగ్నస్టిక్‌ సర్వీసెస్ సెంటర్లు ఉండి, మంచి వ్యాపారం చేస్తున్న కంపెనీ సెలెక్ట్‌ చేసేందుకు రిలయన్స్‌ రిటైల్‌ వేట మొదలు పెట్టిందట. అనువైన సంస్థ కనిపించగానే అందులో మెజారిటీ వాటా కొనుగోలు చేస్తుందట. ఇందుకోసం 1,000 కోట్ల రూపాయల నుంచి 3,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టేందుకు RRVL సిద్ధంగా ఉన్నట్లు హిందు బిజినెస్ లైన్ నివేదించింది. 


ఆరోగ్య సంరక్షణ రంగం రిలయన్స్ రిటైల్‌కు కొత్త కాదు. ఈ కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఆన్‌లైన్ ఫార్మసీ నెట్‌మెడ్స్ (Netmeds) ఉంది. థైరోకేర్, హెల్తీయన్స్ వంటి ఇతర కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని పాథాలజీ సేవలను నెట్‌మెడ్స్ అందిస్తోంది.


నాలుగేళ్ల క్రితం, 2020లో, నెట్‌మెడ్స్‌లో మెజారిటీ వాటాను రూ.620 కోట్లకు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ కొనుగోలు చేసింది. టై-అప్స్‌తో పని చేసే నెట్‌మెడ్స్‌తోనే సరిపెట్టుకోకుండా, భారతదేశవ్యాప్తంగా ఫిజికల్ లాబొరేటరీల నెట్‌వర్క్‌ ఏర్పాటు చేయాలన్నది రిలయన్స్‌ రిటైల్‌ ప్లాన్‌. సొంతంగా డయాగ్నస్టిక్ కంపెనీని తీసుకువచ్చి అన్ని రకాల రోగ నిర్ధరణ సేవలు అందించాలని, క్రమంగా దానిని విస్తరించాలని స్కెచ్‌ గీసింది.


రోగ నిర్ధరణ పరీక్షల రంగంలో వృద్ధి     
ప్రస్తుతం, భారత్‌లోని డయాగ్నస్టిక్ హెల్త్‌కేర్ సెక్టార్‌ విలువ 150 బిలియన్ డాలర్లుగా అంచనా. ఇది ఏటా పెరుగుతుందని మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. కరోనా మహమ్మారి తర్వాత ఆరోగ్యంపై పెరిగిన మమకారం ఆరోగ్య పరీక్షల్లో వృద్ధికి కారణంగా మారిందని వెల్లడించారు. 


2024-25 ఆర్థిక సంవత్సరంలో డయాగ్నస్టిక్ కంపెనీల ఆదాయం 10-11% పెరగొచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్‌ (CRISIL) అంచనా వేసింది. ఈ పరిశ్రమలో వృద్ధి అవకాశాలు పెద్ద కంపెనీలను ఆకర్షిస్తున్నాయి. 


ఈ రోజు (బుధవారం, 15 మే 2024) ఉదయం 11.30 గంటల సమయానికి, BSEలో, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ దాదాపు ఫ్లాట్‌గా రూ.2,847.40 వద్ద కదులుతోంది. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: 73,200 దగ్గర సెన్సెక్స్‌ ఆపసోపాలు - బల ప్రదర్శనలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌