Stock Market News Today in Telugu: గ్లోబల్ మార్కెట్ల మూడ్ బాగుండడంతో భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (బుధవారం, 15 మే 2024) కూడా సానుకూల ధోరణితో ప్రారంభమయ్యాయి. 73,200 స్థాయిని దాటేందుకు సెన్సెక్స్ ఆపసోపాలు పడుతోంది. సిప్లా, భారతి ఎయిర్‌టెల్, హిందాల్కో, BPCL, కోల్ ఇండియా, టాటా స్టీల్, ONGC, NTPC, SBI షేర్లు ఈ రోజు హుషారుగా ఉన్నాయి.
ఈ రోజు మన మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
గత సెషన్‌లో (సోమవారం) 73,104 దగ్గర క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు 95.62 పాయింట్లు లేదా 0.13 శాతం పెరిగి 73,200.23 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్ అయింది. సోమవారం 22,217 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 37.75 పాయింట్లు లేదా 0.17 శాతం లాభంతో 22,255.60 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది.
విస్తృత మార్కెట్లలో... BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ & స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఈ రోజు కూడా బల ప్రదర్శన చేస్తున్నాయి, రెండు సూచీలు 1 శాతం చొప్పున పెరిగాయి.
మార్కెట్ ఓపెనింగ్ టైమ్‌లో, సెన్సెక్స్ 30 ప్యాక్‌లో 22 షేర్లు లాభపడగా, 08 షేర్లు క్షీణించాయి. సెన్సెక్స్ టాప్ గెయినర్స్‌లో... భారతి ఎయిర్‌టెల్ అత్యధికంగా ఒకటిన్నర శాతం పెరిగింది. ఎన్‌టీపీసీ, టాటా స్టీల్, స్టేట్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా మోటార్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు... హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అత్యధికంగా 0.83 శాతం నష్టపోయింది. M&M, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఏసియన్ పెయింట్స్, సన్ ఫార్మా, హిందుస్థాన్ యూనిలీవర్ కూడా నష్టాలను మూటగట్టుకున్నాయి.
నిఫ్టీ 50 ప్యాక్‌లో 36 స్టాక్స్ లాభపడగా, 14 నష్టాల్లో ఉన్నాయి. సిప్లా షేర్లు 3 శాతానికి పైగా పెరిగాయి. కోల్ ఇండియా 2.25 శాతం జూమ్ అయింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్, హిందాల్కో, ఎన్‌టీపీసీ షేర్లు కూడా లాభపడ్డాయి.
రంగాల వారీగా చూస్తే.. నిఫ్టీ పీఎస్‌యు బ్యాంక్ ఇండెక్స్ 1 శాతానికి పైగా పెరిగింది. రియాల్టీ, మీడియా, మెటల్ సూచీలు కూడా జోరు చూపిస్తున్నాయి. మరోవైపు.. ప్రైవేట్ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలపై ఒత్తిడి కనిపిస్తోంది.
ఈ రోజు ఉదయం 10.00 గంటల సమయానికి, BSE సెన్సెక్స్ 32.93 పాయింట్లు లేదా 0.04% తగ్గి 73,071.68 దగ్గర; NSE నిఫ్టీ 11.95 పాయింట్లు లేదా 0.05% పెరిగి 22,229.80 వద్ద ట్రేడవుతున్నాయి.
గ్లోబల్ మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో, ఈ ఉదయం, నికాయ్ & ASX200 ఇండెక్స్ తలో 0.5 శాతం పెరిగాయి. షాంఘై కాంపోజిట్ 0.4 శాతం పడిపోయింది. దక్షిణ కొరియా, హాంగ్ కాంగ్ మార్కెట్లకు ఈ రోజు సెలవు.
అమెరికన్ మార్కెట్లలో, నిన్న, నాస్‌డాక్ కాంపోజిట్ 0.75 శాతం లాభపడి 16,511.18 వద్ద రికార్డు స్థాయిలో క్లోజ్ అయింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.32 శాతం పెరిగింది, S&P 500 0.48 శాతం ర్యాలీ చేసింది.
అమెరికాలో ద్రవ్యోల్బణం మార్కెట్ అంచనాలను మించడంతో 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ 4.441% వద్దకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గాయి, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు $83 దిగువకు చేరింది. గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ రేటు పుంజుకుంది, ఔన్సుకు $2,363 డాలర్లకు పెరిగింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: టాక్స్‌పేయర్లకు గుడ్‌న్యూస్ - 'యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్'లో కొత్త ఫెసిలిటీ