Rekha Jhunjhunwala Portfolio: దేశంలోని ప్రముఖ పెట్టుబడిదార్లలో ఒకరైన రేఖ ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ఫోలియో, ఆమె తీసుకునే నిర్ణయాల మీద స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్లు ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు. అమె పెట్టుబడులు పెట్టిన చాలా కంపెనీలు కొంతకాలం తర్వాత మల్టీబ్యాగర్స్‌గా మారాయి. అందుకే, రేఖ ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ఫోలియోను చాలా మంది కాపీ కొడుతుంటారు. దీనిని 'జిరాక్స్‌ స్ట్రాటెజీ'గా పిలుస్తారు.


ఇప్పుడు, రేఖ ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ఫోలియోలో కొన్ని మార్పులు వచ్చాయి. టాటా గ్రూప్‌నకు చెందిన టాటా కమ్యూనికేషన్స్‌ సహా మరో 4 కంపెనీల షేర్లను ఆమె విక్రయించారు. 2024 మార్చి త్రైమాసికంలో ఆ కంపెనీల్లో వాటాను తగ్గించుకున్నారు.


వాటా తగ్గించుకున్న 5 కంపెనీలు
ట్రెండ్‌లైన్ డేటా ప్రకారం, 2023 డిసెంబర్ త్రైమాసికం చివరి నాటికి టాటా కమ్యూనికేషన్స్‌లో రేఖ ఝున్‌ఝున్‌వాలాకు 1.8 శాతం వాటా ఉంది. 2024 మార్చి త్రైమాసికం ముగిసే సమయానికి, ఆ స్టేక్‌ దాదాపు 1.6 శాతానికి తగ్గింది. రాఘవ్ ప్రొడక్టివిటీ ఎన్‌హాన్సర్స్, కెనరా బ్యాంక్, ఫోర్టిస్ హెల్త్‌కేర్, ఎన్‌సీసీలోనూ షేర్లు తగ్గించుకున్నారు. రేఖ ఝున్‌ఝున్‌వాలా భర్త, దివంగత రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఒక అనుభవజ్ఞుడైన పెట్టుబడిదారు. స్టాక్‌ మార్కెట్‌లో ఆయన్ను బిగ్‌ బుల్‌ అని పిలుస్తారు.


రాఘవ్ ప్రొడక్టివిటీ షేర్లు పతనం
ట్రెండ్‌లైన్ డేటా ప్రకారం, రాఘవ్ ప్రొడక్టివిటీలో రేఖా ఝున్‌ఝున్‌వాలా వాటా ఇప్పుడు 0.1 శాతానికి తగ్గింది. కెనరా బ్యాంక్, ఫోర్టిస్ హెల్త్‌కేర్‌, NCCలో 0.6 శాతం వరకు స్టేక్‌ విక్రయించారు.సిలికా ర్యామింగ్ మాస్‌ను తయారు చేసే రాఘవ్ ప్రొడక్టివిటీ కంపెనీ షేర్లు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 15 శాతం పడిపోయాయి. చాలా మంది ఇన్వెస్టర్లు ఈ స్టాక్‌కు దూరంగా జరగడం ప్రారంభించారు. గత ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కెనరా బ్యాంక్ మంచి రాబడి ఇచ్చింది. గత 12 నెలల్లో 100 శాతం, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 38 శాతం పెరిగింది. రేఖా ఝున్‌ఝున్‌వాలాకు ఎన్‌సీసీలో 12.5 శాతం, ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌లో 4.1 శాతం నియంత్రణ ఉంది.


రేఖ ఝున్‌ఝున్‌వాలా సంపద విలువ
2024 మార్చి చివరి నాటికి ఉన్న సమాచారం ప్రకారం, రేఖ ఝున్‌ఝున్‌వాలాకు దాదాపు 26 కంపెనీల్లో షేర్లు ఉన్నాయి. ఈ లెక్కను బట్టి ఆమె నికర విలువ దాదాపు రూ.50,230 కోట్లు. టాటా మోటార్స్, ఇండియన్ హోటల్స్, టైటన్, నజారా టెక్నాలజీస్‌, డెల్టా కార్ప్ వంటి పెద్ద కంపెనీల్లో రేఖకు షేర్లు ఉన్నాయి. ఈ షేర్ల కదలికలను ఆధారంగా పోర్ట్‌ఫోలియో విలువ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: కొత్త ఫండ్‌ ఆఫర్లు వస్తున్నాయ్‌, పెట్టుబడిదార్లకు భలే అవకాశం!