Stock Market Update: స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతున్న చాలా మందికి మార్కెట్‌ గురించి పూర్తిగా తెలీదు. కొన్ని విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. భారతదేశ సంపదలో మూడింట ఒక వంతు స్టాక్ మార్కెట్ నుంచే ఉత్పత్తి అవుతోంది. అంటే, మిగిలిన అన్ని రంగాలు ఒక ఎత్తు, స్టాక్‌ మార్కెట్‌ ఒక్కటీ ఒక ఎత్తు. ఇండియా బండిని వృద్ధి పథం వైపు నడిపించడంలో షేర్‌ మార్కెట్లు గేర్‌లా పని చేస్తున్నాయి.


ప్రస్తుతం దేశంలో దాదాపు 8.5 కోట్ల మంది ఇన్వెస్టర్లు ఉన్నారని చాలా మందికి తెలుసు. అయితే, వీరిలో 2 కోట్ల మంది మహిళలేనన్నది చాలా తక్కువ మందికి తెలుసు. 5 కోట్లకు పైగా కుటుంబాలు నేరుగా స్టాక్ మార్కెట్ల ద్వారా పెట్టుబడులు రన్‌ చేస్తున్నాయి.


100 ట్రిలియన్ డాలర్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) MD & CEO ఆశిష్ కుమార్ చౌహాన్ చెప్పిన ప్రకారం, భారతదేశంలో సంపదను సృష్టిస్తున్న ప్రతి ముగ్గురిలో ఒకరు స్టాక్ మార్కెట్‌ ఇన్వెస్టర్‌. మరో 50 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ 100 ట్రిలియన్ డాలర్లకు చేరుకోగలదని ఆశిష్ కుమార్ చౌహాన్ చెప్పారు.


$4.34 ట్రిలియన్ల NSE మార్కెట్ క్యాప్
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే భారతదేశం 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని చాలా మంది అధికార్లు & మంత్రులు అంచనా వేశారు. అయితే, 2023 చివరి నాటికే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మార్కెట్ విలువ 4.34 ట్రిలియన్ డాలర్లకు చేరింది. UBS రిపోర్ట్ ప్రకారం, భారతదేశం 2022లో 15.4 ట్రిలియన్‌ డాలర్ల సంపదను కలిగి ఉంది.


మన జనాభా మన గొప్ప బలం
బాంబే చార్టర్డ్ అకౌంటెంట్స్ సొసైటీ (BACS) కార్యక్రమంలో మాట్లాడిన చౌహాన్, ప్రపంచం 250 ట్రిలియన్ డాలర్ల సంపదను సృష్టిస్తే, అందులో 30 శాతం భారతదేశం నుంచి ఉంటుందని చెప్పారు. మొత్తం ప్రపంచ జనాభాలో మనది 18 శాతం వాటా & యువ జనాభాలో 20-22 శాతం వాటా.


ఇండియన్‌ క్యాపిటల్ మార్కెట్లు పెట్టుబడిదార్లకు భారీ సంపదను సమకూరుస్తున్నాయని చౌహాన్ అన్నారు. స్టాక్ మార్కెట్లపై ప్రజలకు నమ్మకం బలపడిందని, అందుకే దేశంలో ఇన్వెస్టర్ల సంఖ్య 8.5 కోట్లకు చేరిందని చెప్పారు. అంతేకాదు, 2 కోట్ల మందికి పైగా మహిళలు కూడా మార్కెట్‌లో పాల్గొంటున్నారని, తమ డబ్బును స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిగా పెడుతున్నారని వివరించారు. దేశంలోని 5 కోట్లకు పైగా కుటుంబాలు స్టాక్ మార్కెట్ల ద్వారా పెట్టుబడులు పెడుతున్నాయని, ఈ సంఖ్య భారతదేశంలోని మొత్తం కుటుంబాల్లో దాదాపు 17 శాతమని వెల్లడించారు.


గత 10 సంవత్సరాల్లో, స్టాక్ మార్కెట్ ప్రజల జీవనశైలిని మార్చిందని చౌహాన్‌ చెప్పారు. బిట్‌కాయిన్‌ వంటి క్రిప్టో అసెట్స్‌ మీదా తన వైఖరిని చౌహాన్‌ వెల్లడించారు. కంపెనీ లాభాల్లో వాటాను స్టాక్ మార్కెట్ అందజేస్తుండగా, బిట్‌కాయిన్‌ వెంట పడడం మూర్ఖత్వమని స్పష్టం చేశారు. 


దేశంలోని అన్ని ప్రాంతాల్లో పెట్టుబడిదార్లు
2023 సెప్టెంబర్ నాటికి, NSE పెట్టుబడిదార్ల సంఖ్య 7 కోట్ల నుంచి 8 కోట్లకు పెరిగింది. 2023 చివరి నాటికి ఈ సంఖ్య 8.5 కోట్లకు చేరుకుంది. ఈ పెట్టుబడిదార్లు దేశంలోని 99.8 శాతం ప్రాంతాల్లో విస్తరించి ఉన్నారు. 90 లక్షల మంది పెట్టుబడిదార్లతో ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. 2023 క్యాలెండర్ ఇయర్‌లో కనీసం ఒక్కసారైనా ఈక్విటీ డెరివేటివ్స్‌లో ట్రేడ్‌ చేసినవారి సంఖ్య ఏడాది ప్రాతిపదికన (YoY) 31 శాతం పెరిగి 83.6 లక్షలకు చేరుకుంది. క్యాష్‌ సెగ్మెంట్‌లో ఈ సంఖ్య వార్షిక ప్రాతిపదికన 0.4 శాతం తగ్గి 2.67 కోట్లకు చేరుకుంది.


మరో ఆసక్తికర కథనం: సంపద సూత్రాలు చెప్పిన వ్యక్తికి వేల కోట్ల అప్పు - 'రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌' రచయిత పరిస్థితి ఇది