Writer Robert Kiyosaki: 'రిచ్ డాడ్, పూర్ డాడ్' పుస్తకం గురించి పరిచయం అక్కర్లేదు. డబ్బు సంపాదించడం, దానిని సంపదగా మార్చడం ఎలాగో చెప్పే పుస్తకం అది. ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రధాన భాషల్లోకి తుర్జుమా అయింది, ప్రతి చోటా సెన్సేషన్‌ సృష్టించింది. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన బుక్స్‌లో 'రిచ్ డాడ్, పూర్ డాడ్' (Rich Dad Poor Dad Book) ఒకటి.


'రిచ్ డాడ్, పూర్ డాడ్' బుక్‌ రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki). ఇటీవల, తన గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడతను. తనకు ఒక బిలియన్ డాలర్లకు పైగా అప్పు ఉందని చెప్పి ప్రపంచానికి షాక్‌ ఇచ్చాడు.


రూ.10 వేల కోట్ల రుణం ‍‌(Robert Kiyosaki Debt)
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో, కియోసాకి తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తనకు 1.2 బిలియన్ డాలర్ల అప్పు ఉందని చెప్పాడు. ఇండియన్‌ కరెన్సీలో ఈ రుణం మొత్తం రూ.10 వేల కోట్లు. కియోసాకి, తన అప్పు గురించి తరచూ బహిరంగంగా మాట్లాడుతుంటాడు. నిజానికి, రుణం విషయంలో అందరికీ ఉన్న అభిప్రాయం వేరు - కియోసాకి అభిప్రాయం వేరు.


అప్పు ద్వారా అపార సంపద సృష్టి 
సంపదను దృష్టించడంలో రుణాలు సాయపడతాయని పర్సనల్‌ ఫైనాన్సర్లు చెబుతుంటారు. కియోసాకి కూడా ఇదే నమ్మాడు. తనకు 1.2 బిలియన్ డాలర్ల అప్పు ఉందని, తాను దివాళా తీస్తే బ్యాంకులు దివాళా తీస్తాయని, కాబట్టి ఇది తన సమస్య కాదని కియోసాకి చెప్పుకొచ్చాడు. 


తన సంపాదనను నగదు రూపంలో పొదుపు చేయకుండా బంగారం, వెండిగా మార్చుకుంటానని కియోసాకి చెప్పాడు. అంతేకాదు, బ్యాంక్‌ల నుంచి తీసుకున్న రుణాన్ని ఆస్తులు కొనుగోలు చేయడానికి ఉపయోగించాడు. ఈ వ్యూహం వల్ల అప్పులు కుప్పలుగా పేరుకుపోయింది. 


టన్నుల కొద్దీ బంగారం, వెండి
2022లో జరిగిన ఒక సమావేశంలో అతను చెప్పిన మాటలు ఇవి - "నా దగ్గర రాగి లేదు. చాలా వెండి ఉంది. నాకు అర్జెంటీనాలో ఒక వెండి గని ఉంది. దానిని కెనడియన్ మైనింగ్ కంపెనీ యమన గోల్డ్ నా నుంచి కొనుగోలు చేసింది. ఇప్పుడు నా దగ్గర టన్నుల కొద్దీ బంగారం, వెండి ఉంది".


పర్సనల్‌ ఫైనాన్స్ రంగంలో, రుణాన్ని రెండు రకాలుగా విభజించారు. 1. మంచి రుణం, 2. చెడ్డ రుణం. తనకున్న అప్పును మంచి రుణంగా 'రిచ్ డాడ్, పూర్ డాడ్' రచయిత భావిస్తున్నాడు. రుణం తీసుకుని చెల్లించే వడ్డీ కన్నా ఎక్కువ ఆదాయం వచ్చేలా ఆ డబ్బును పెట్టుబడి పెడితే, దానిని మంచి అప్పు అంటారు. రియల్ ఎస్టేట్ వంటి ఆస్తులను సృష్టించేందుకు రుణం తీసుకుని పెట్టుబడి పెట్టానని కియోసాకి చెప్పాడు. రుణాలు తీసుకొని రియల్ ఎస్టేట్ వంటి పెట్టుబడులను సృష్టించి సంపద పెంచుకోవాలని ప్రజలకు కూడా సలహా ఇచ్చాడు.


కియోసాకి ఆస్తిపాస్తుల విలువ (Robert Kiyosaki Net Worth)
రాబర్ట్ కియోసాకి రాసిన సుప్రసిద్ధ పుస్తకం 'రిచ్ డాడ్, పూర్ డాడ్' 1997లో విడుదలైంది. ఇప్పటి వరకు 4 కోట్ల కాపీలకు పైగా అమ్ముడైంది. ఆ బుక్‌లో.. సంపద సృష్టించడానికి ఉన్న ఏకైక మార్గం డబ్బు సంపాదించడం అనే భావనను కియోసాకి తిరస్కరించాడు. సొంత వెంచర్‌ ప్రారంభించాలని, సంపదను సృష్టించడానికి రిస్క్‌ తీసుకోవాలని సూచించాడు. ప్రస్తుతం, రాబర్ట్‌ కియోసాకి నికర విలువ సుమారు $100 మిలియన్లు.


మరో ఆసక్తికర కథనం: వరుసగా ఏడో వారంలోనూ పెరిగిన ఫారెక్స్‌ రిజర్వ్స్‌, రికార్డ్‌ స్థాయికి చేరువ