Kisan Credit Card Details: బ్యాంక్ క్రెడిట్ కార్డులతో పోలిస్తే, కిసాన్ క్రెడిట్ కార్డులు (KCC) చాలా భిన్నవైనవి. రైతుల కోసం మాత్రమే ప్రత్యేకించిన రుణ పథకం ఇది. వ్యవసాయ రంగం & రైతులకు అవసరమైన షార్ట్ టర్మ్ లోన్ల కోసం, 1998లో, నాబార్డ్ (NABARD) ఈ క్రెడిట్ కార్డ్‌లను ప్రవేశపెట్టింది. వీటిని ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంక్‌లు, కోపరేటివ్ బ్యాంక్‌లు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లు మంజూరు చేస్తాయి.
ఇప్పుడు, కేసీసీలను ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు (Pradhan Mantri Kisan Samman Nidhi Yojana) లింక్ చేశారు. కాబట్టి ఆ కార్డ్‌లను PM కిసాన్ క్రెడిట్ కార్డ్‌లు అని కూడా పిలుస్తున్నారు.
కేసీసీల్లో కొంత రుణ పరిమితి (KCC Credit Limit) ఉంటుంది. ఆ మొత్తంతో వ్యవసాయ పరికరాలు కొనడం, ఇతర ఖర్చుల కోసం ఉపయోగించడం చేయవచ్చు. అంతేకాదు, కిసాన్ క్రెడిట్ కార్డ్‌తో కేవలం పావలా వడ్డీకే (4%) రైతులకు రూ.3 లక్షల వరకు అప్పు దొరుకుతుంది.
కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేసుకోవడం చాలా సులభం. వ్యవసాయం చేసే రైతులు దీని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పంటలు పండించే రైతులతో పాటు మత్స్య పెంపకం, పశు పోషణ రంగాల్లో ఉన్న రైతులకు కూడా కేసీసీలను మంజూరు చేస్తారు, వారి పెట్టుబడి అవసరాలు తీరేలా చూస్తారు.
కిసాన్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు (Benefits of Kisan Credit Card)
- వ్యవసాయం, అనుబంధ పనులు, పంట కోత తర్వాత ఖర్చుల కోసం రైతులకు రుణం దొరుకుతుంది
- పాడి జంతువులు, పంపు సెట్లు వంటి వ్యవసాయ అవసరాలకు పెట్టుబడి లభిస్తుంది
- రైతులు రూ.3 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు
- వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం కూడా రుణాలు పొందొచ్చు.
- కార్డుదారు శాశ్వత వైకల్యం లేదా మరణానికి గురైతే, రూ.50 వేల వరకు బీమా కవరేజీ ఉంటుంది. ఇతర ప్రమాదాల విషయంలో రూ.25,000 ఇస్తారు.
- కిసాన్ క్రెడిట్ కార్డ్‌తో పాటు అర్హులైన రైతులకు స్మార్ట్ కార్డ్, డెబిట్ కార్డ్, సేవింగ్స్ అకౌంట్ కూడా లభిస్తుంది
- రుణాన్ని తిరిగి చెల్లించే ఆప్షన్లు రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటాయి
- అన్ని వ్యవసాయ & అనుబంధ అవసరాల కోసం ఒకే క్రెడిట్ ఫెసిలిటీ లేదా టర్మ్ లోన్ దొరుకుతుంది
- ఎరువులు, విత్తనాలు వంటివి కొన్నప్పుడు నగదు రాయితీ
- 3 సంవత్సరాల వరకు క్రెడిట్ దొరుకుతుంది, పంట చేతికి వచ్చాక తిరిగి చెల్లించవచ్చు
- రూ.1.60 లక్షల వరకు రుణానికి ఎలాంటి షూరిటీ అవసరం లేదు.
కిసాన్ క్రెడిట్ కార్డ్‌లపై వడ్డీ & ఇతర ఛార్జీలు (Interest and Other Charges on Kisan Credit Cards)
కిసాన్ క్రెడిట్ కార్డ్‌లను చాలా బ్యాంక్‌లు జారీ చేస్తాయి.
కిసాన్ క్రెడిట్ కార్డ్‌లను చాలా బ్యాంక్‌లు మంజూరు చేస్తాయి కాబట్టి... KCC క్రెడిట్ లిమిట్, వడ్డీ రేటు ఒక్కో బ్యాంక్‌కు ఒక్కోలా ఉంటుంది. అయితే, సగటున KCC వడ్డీ రేట్లు 2 శాతం నుంచి 4 శాతం వరకు ( KCC interest rate) ఉంటాయి. KCC ద్వారా చేసే కొనుగోళ్లు, తిరిగి చెల్లింపుల (క్రెడిట్ హిస్టరీ) ఆధారంగా, రైతులకు కేంద్ర ప్రభుత్వం చాలా ప్రోత్సాహకాలు కూడా అందిస్తుంది.
KCC ఛార్జీల విషయానికి వస్తే... ప్రాసెసింగ్ ఖర్చులు, బీమా ప్రీమియం, ఇతర ఛార్జీలు అన్నీ కిసాన్ క్రెడిట్ కార్డ్ జారీ చేసే బ్యాంక్ నిర్ణయిస్తుంది.
మరో ఆసక్తికర కథనం: బ్యాంక్ లోన్లలో సగం వాటా ఇళ్లదే, ఆ తర్వాత జనం తీసుకున్న అప్పులు ఇవి