Bank Loans in 2023: కాలం మారుతున్న కొద్దీ ప్రజల ఆర్థిక అవసరాలు వేగంగా పెరుగుతున్నాయి. ప్రజలు, డబ్బుల కోసం బ్యాంక్‌ లోన్స్‌ తీసుకోవడం పెరిగింది. 2023లో వడ్డీ రేట్ల మోత మోగినన్నప్పటికీ జనం వెనుకడుగు వేయలేదు. బ్యాంక్‌ రిటైల్ లోన్లు 2022 కంటే 2023లో 18% పెరిగాయి. వీటిలో, అసురక్షిత రుణాలదే (unsecured loans) అతి పెద్ద పోర్షన్‌. 


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజా డేటా ప్రకారం... వ్యక్తిగత రుణాలు & క్రెడిట్ కార్డ్ వ్యయాలు 2022 కంటే 2023లో వరుసగా 22% & 28% పెరిగాయి.


బ్యాంక్‌ బజార్‌ రిపోర్ట్‌ ప్రకారం, ఇప్పుడు, మన దేశంలో 9.4 కోట్ల క్రెడిట్ కార్డ్‌లు ఉన్నాయి. వీటి సగటు లావాదేవీ విలువ రూ. 5,577. 


2023 నవంబర్‌ వరకు, బ్యాంక్‌లు సగటున రూ. 1.71 లక్షల విలువైన పర్సనల్‌ లోన్స్‌ ఇచ్చాయి.


గత ఏడాది, దేశంలోని అన్ని బ్యాంక్‌లు ఇచ్చిన మొత్తం అప్పుల్లో, కేవలం 4 విభాగాలకే 92% లోన్స్‌ వెళ్లాయి. ఆ 4 సెగ్మెంట్లు... హౌసింగ్‌ లోన్‌ ‍‌(Housing Loan), పర్సనల్‌ లోన్‌ (Personal loan), వెహికల్‌ లోన్‌/ఆటో లోన్‌ (Vehicle Loan/Auto Loan), క్రెడిట్‌ కార్డ్‌ డెట్‌ (Credit Card Debt). ఈ నాలుగు సెగ్మెంట్లలో బ్యాంక్‌లు భారీ వడ్డీలు వసూలు చేసినప్పటికీ, 2022తో పోలిస్తే 2023లో లోన్‌ డిమాండ్‌ 18% పెరిగింది. గత ఏడాది, ఈ 4 విభాగాలకు ఇచ్చిన మొత్తం రుణం రూ. 41.97 లక్షల కోట్లు.


2023లో, నవంబర్‌ వరకు, బ్యాంక్‌లు ఇచ్చిన లోన్లు:


హోమ్‌ లోన్లు ---- 2022లో 18,73,413 కోట్లు ---- 2023లో 21,44,376 కోట్లు
పర్సనల్‌ లోన్లు ---- 2022లో 10,29,723 కోట్లు ---- 2023లో 12,59,170 కోట్లు
ఆటో లోన్లు ---- 2022లో 4,60,871 కోట్లు ---- 2023లో 5,53,154 కోట్లు
క్రెడిట్‌ కార్డ్‌ డెట్‌  ---- 2022లో 1,88,033 కోట్లు ---- 2023లో 2,40,656 కోట్లు
FDపై లోన్లు ---- 2022లో 97,857 కోట్లు ---- 2023లో 1,13,973 కోట్లు
ఎడ్యుకేషన్‌ లోన్లు ---- 2022లో 91,790 కోట్లు ---- 2023లో 1,10,715 కోట్లు
గోల్డ్‌ లోన్లు ---- 2022లో 85,288 కోట్లు ---- 2023లో 1,00,004 కోట్లు
కన్జ్యూమర్‌ డ్యూరబుల్‌ లోన్లు ---- 2022లో 20,624 కోట్లు ---- 2023లో 22,205 కోట్లు
సెక్యూరిటీలపై లోన్లు ---- 2022లో 8,273 కోట్లు ---- 2023లో 7,872 కోట్లు


ఆశ్చర్యకరంగా, గత సంవత్సరం హోమ్‌ లోన్‌లు, పర్సనల్‌ లోన్ల కోసం ఎగబడ్డ జనం... కన్జ్యూమర్‌ డ్యూరబుల్‌ లోన్ల (గృహోపకరణాల కోసం తీసుకునే అప్పులు) విషయంలో మొహం చాటేశారు. 2023లో, కన్జ్యూమర్‌ డ్యూరబుల్‌ లోన్లు భారీగా తగ్గాయి, 2022లోని 41.4% వృద్ధితో పోలిస్తే గతేడాది కేవలం 7.7% మాత్రమే పెరిగాయి. 


2022లో నెమ్మదించిన విద్యా రుణ (Education loan) విభాగం, 2023లో తిరిగి ట్రాక్‌లోకి వచ్చింది.


హోమ్‌ లోన్ల వాటా 47% - పర్సనల్‌ లోన్ల వాటా 20%


బ్యాంక్‌బజార్ ఆస్పిరేషన్ ఇండెక్స్ ప్రకారం... 2023లో, ప్రజల మొదటి మూడు లక్ష్యాల్లో సొంతిల్లు ఒకటి. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నా గృహ రుణాలకు డిమాండ్ పెరగడానికి ఇదే కారణం. ఈ విభాగంలో బ్యాంక్‌లన్నీ కలిసి రూ.21.44 లక్షల కోట్లకు పైగా అప్పులు మంజూరు చేశాయి. గత ఏడాది, మొత్తం బ్యాంక్‌ లోన్లలో హోమ్‌ లోన్ల వాటా 47%.


గతేడాది హోమ్‌ లోన్‌ టిక్కెట్ సైజ్‌ కూడా పెరిగింది. 2023లో మంజూరైన సగటు గృహ రుణం రూ.28.19 లక్షలుగా లెక్క తేలింది. మెట్రో నగరాల్లో ఇది సగటున రూ. 33.10 లక్షలు & నాన్-మెట్రోల్లో రూ.22.81 లక్షలుగా ఉంది.


దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది కాబట్టి, 2024లో బ్యాంక్‌ వడ్డీ రేట్లు తగ్గుతాయన్న ఆశలు ఎక్కువగా ఉన్నాయి. వడ్డీ రేట్లు తగ్గితే హౌసింగ్ లోన్లు మరింత భారీగా పెరుగుతాయన్న అంచనా వేస్తున్నారు.


బ్యాంక్‌బజార్ రిపోర్ట్‌ ప్రకారం, పర్సనల్‌ లోన్లు తీసుకునే వాళ్ల సంఖ్య 2023లో 22% పెరిగినా, 2019 నుంచి సగటు రుణ మొత్తం తగ్గుతూ వచ్చింది.  గత ఏడాది, మొత్తం బ్యాంక్‌ లోన్లలో పర్సనల్‌ లోన్ల వాటా 20%.


క్రెడిట్ కార్డుల విషయానికి వస్తే... 2023 అక్టోబర్‌లో క్రెడిట్ కార్డ్‌ల మొత్తం సంఖ్య 9.4 కోట్లను దాటింది. అలాగే, క్రెడిట్ కార్డ్ వ్యయాలు కూడా రికార్డు స్థాయిలో రూ. 1.79 లక్షల కోట్లకు పెరిగాయి. గత సంవత్సరం దీపావళి సందర్భంగా, కార్డ్‌ సగటు వ్యయం రూ.5,052 నుంచి రూ.5,577కి పెరిగింది. ఇది 10.4% పెరుగుదల.


2023లో క్రెడిట్‌ కార్డ్‌ రివార్డులు తగ్గినా... కో-బ్రాండెడ్‌ కార్డులు, కొత్త ఆఫర్లు పెరగడంతో క్రెడిట్‌ కార్డ్‌ స్పెండింగ్స్‌ పెరిగాయి. ముఖ్యంగా, కో-బ్రాండెడ్ క్రెడిట్‌ కార్డులకు డిమాండ్‌ పెరిగింది.


మరో ఆసక్తికర కథనం: స్టమర్లకు షాక్‌ ఇచ్చిన ఐసీఐసీఐ బ్యాంక్‌ - క్రెడిట్‌ కార్డ్‌ బెనిఫిట్స్‌, రివార్డ్‌ పాయింట్లలో కోత