స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. సూచీలన్నీ ఒడుదొడుకుల మధ్య కదలాడాయి. ఆసియా, ఐరోపా మార్కెట్లు స్తబ్దుగా ఉండటం, మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపకపోవడం ఇందుకు దోహదం చేసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 104 పాయింట్లు నష్టపోగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 17,300 పై స్థాయి నిలబెట్టుకొంది. 


BSE Sensex


క్రితం రోజు 57,996 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 58,217 వద్ద మెరుగ్గా ఆరంభమైంది. వెంటనే నష్టాల్లోకి జారుకుంది. 57,635 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత కాస్త పుంజుకొని 58,346 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. ఐరోపా మార్కెట్లు ఓపెనైన తర్వాత మళ్లీ నష్టాల్లోకి వెళ్లింది. చివరికి 104 పాయింట్ల నష్టంతో 57,892 వద్ద ముగిసింది.


NSE Nifty


బుధవారం 17,332 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,396 వద్ద స్వల్ప లాభాల్లో మొదలైంది. మరికాసేపటికే 17,235 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. కొనుగోళ్లు పెరగడంతో ఒక రేంజులో కదలాడింది. 17,442 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 17 పాయింట్ల నష్టంతో 17,304 వద్ద ముగిసింది.


Bank Nifty


బ్యాంకు నిఫ్టీ తీవ్ర ఒడుదొడుకులకు లోనైంది. ఉదయం 38,042 వద్ద మొదలైన సూచీ 37,425 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆపై పుంజుకొని 38,124 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. చివరికి 422 పాయింట్ల నష్టంతో 37,531 వద్ద ముగిసింది.


Gainers and Lossers


నిఫ్టీలో 17 కంపెనీలు లాభపడగా 33 నష్టాల్లో ముగిశాయి. టాటా కన్జూమర్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఓఎన్‌జీసీ, రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ షేర్లు లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సెమ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యూపీఎల్‌ నష్టపోయాయి. బ్యాంక్, పవర్‌ సూచీలు 1-2 శాతం పతనమయ్యాయి. మిగతా రంగాల సూచీలే అదే బాటలో నడిచాయి.