IND vs WI T20: టీమ్‌ఇండియాకు వరుస షాకులు తగులుతున్నాయి! కుర్రాళ్లు బాగా ఆడుతున్నప్పటికీ త్వరగా గాయాల పాలవుతున్నారు. వెస్టిండీస్‌తో తొలి టీ20లో యువ పేసర్‌ దీపక్‌ చాహర్‌, పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ గాయపడ్డారు. వీరిద్దరూ రెండో మ్యాచులో ఆడటం సందిగ్ధంగా మారింది.


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో దీపక్‌ చాహర్‌ను చెన్నై సూపర్‌కింగ్స్‌ రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. అదే ఉత్సాహంలో టీమ్‌ఇండియాకు ఆడుతున్నాడు. అయితే కీరన్‌ పొలార్డ్‌ ఓ పవర్‌ఫుల్‌ పుల్‌షాట్ ఆడినప్పుడు అతడికి గాయమైంది. స్క్వేర్‌లెగ్‌ ప్రాంతంలో ఆపబోయిన బంతి అతడి చేతికి బలంగా తాకింది. నొప్పితో విలవిల్లాడిన అతడు మైదానం వీడాడు. ఫిజియోలు వెంటనే అతడికి నొప్పి నివారణ చికిత్స చేశారు. విండీస్‌ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. చాహర్ పూర్తి కోటా బౌలింగ్ చేయలేదు. అతడి బదులు హర్షల్ పటేల్‌తో ఆఖరి ఓవర్‌ను వేయించారు.


టీమ్‌ఇండియా యువ ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ సైతం పొలార్డ్‌ కొట్టిన బంతిని అందుకోబోయే గాయపడ్డాడు. 17వ ఓవర్లో పొలార్డ్‌ లాంగాఫ్‌ వైపు బలంగా షాట్‌ ఆడాడు. అయ్యర్‌ ముందు పడిన బంతి వేగంగా టర్నై అతడి చేతిని తాకింది. అయినప్పటికీ అతడు బ్యాటింగ్‌కు వచ్చి ఇరగదీశాడు. 18 బంతుల్లోనే 5 బౌండరీలు, 1 సిక్సర్‌ సాయంతో 34 పరుగులు చేశాడు. విన్నింగ్స్‌ షాట్‌ ఆడి అందరినీ ఆనందంలో ముంచెత్తాడు. గాయపడ్డ వీరిద్దరినీ స్కానింగ్‌ కోసం పంపించారు. రిపోర్టుల్లో ఏం తేలిందో ఇంకా తెలియదు. విషయం తెలిస్తేనే వారు అందుబాటులో ఉంటారో లేదో తెలుస్తుంది. ఇంతకు ముందు కేఎల్‌ రాహుల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ గాయపడ్డ సంగతి తెలిసిందే.


అచ్చొచ్చిన ఈడెన్‌లో టీమ్‌ఇండియా అదరగొట్టింది! వెస్టిండీస్‌పై తొలి టీ20లో విజయం అందుకుంది. ప్రత్యర్థి నిర్దేశించిన 158 పరుగుల టార్గెట్‌ను 6 వికెట్ల తేడాతో మరో 7 బంతులు మిగిలుండగానే ఛేదించింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (40; 19 బంతుల్లో 4x4, 3x6) విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇషాన్‌ కిషన్‌ (35; 42 బంతుల్లో 4x4) ఫర్వాలేదనిపించాడు. సూర్యకుమార్‌ (34*; 18 బంతుల్లో 5x4, 1x6), సూర్యకుమార్‌ యాదవ్‌ (24*; 13 బంతుల్లో 2x4, 1x6) మెరుపులు మెరిపించాడు. అంతకు ముందు విండీస్‌లో నికోలస్‌ పూరన్‌ (61; 43 బంతుల్లో 4x4, 5x6) హాఫ్‌ సెంచరీతో అదరగొట్టాడు. కైల్‌ మేయర్స్‌ (31; 24 బంతుల్లో 7x4), కీరన్‌ పొలార్డ్‌ (24*; 19 బంతుల్లో 2x4, 1x6) అతడికి అండగా నిలిచారు.