Stock market updates Telugu: హమ్మయ్యా! గురువారం అతలాకుతలం అయిన భారత స్టాక్ మార్కెట్లు (Indian Stock Markets) నేడు కోలుకున్నాయి. అమెరికా, ఇతర దేశాలు రష్యాపై విధించిన ఆంక్షలు రష్యా చమురు సరఫరాపై ప్రభావం చూపించలేవని తెలిశాక మదుపర్లు కుదుట పడ్డారు. ఆసియా మార్కెట్లు, ఎస్‌జీఎక్స్ నిఫ్టీ (SGX Nifty) మెరుగ్గా ఓపెనవ్వడం వారికిలో విశ్వాసం పెంచింది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ భయాలు (Russia Ukraine War) ఇంకా కొనసాగుతున్నా ఇన్వెస్టర్లు నేడు పెట్టుబడులు పెట్టారు. ముడిచమురు ధరలు (Crude Oil) పెరుగుతున్నా భయపడటం లేదు! మదుపర్ల సంపదగా (Investors) భావించే బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 1328 పాయింట్లు లాభపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,680 పైన ముగిసింది. మదుపర్ల సంపద దాదాపుగా రూ.8 లక్షల కోట్ల వరకు పెరిగింది.
BSE Sensex
క్రితం సెషన్లో 54,529 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 55,321 వద్ద భారీ గ్యాప్ అప్‌తో మొదలైంది. 55,299 వద్ద కనిష్ఠాన్ని తాకినప్పటికీ కొనుగోళ్ల జోరుతో 56,183 వద్ద గరిష్టాన్ని తాకింది. ఒకానొక దశలో 1600 పాయింట్ల వరకు లాభపడ్డ సూచీ చివరికి 1328 పాయింట్ల లాభంతో 55,858 వద్ద ముగిసింది.
NSE Nifty
గురువారం 16,247 వద్ద ముగిసిన ఎన్ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 16,515 వద్ద మొదలైంది. 16,478 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. మదుపర్లు షేర్లను కొనుగోళ్లు చేయడంతో 16,748 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 410 పాయింట్ల లాభంతో 16,658 వద్ద ముగిసింది.
Bank Nifty
బ్యాంకు నిఫ్టీ జోరుమీదుంది. ఉదయం 35,901 వద్ద మెరుగ్గా ఆరంభమైంది. 35,768 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకినప్పటికీ వెంటనే తేరుకొని 36,684 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 1202 పాయింట్ల లాభంతో 36,430 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీలో 47 కంపెనీలు లాభాల్లో, 3 నష్టాల్లో ముగిశాయి. కోల్ ఇండియా, టాటా మోటార్స్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, ఇండస్‌ఇండ్ 5-9 శాతం వరకు లాభపడ్డాయి. బ్రిటానియా, నెస్లే ఇండియా, హిందుస్థాన్ యునిలివర్ స్వల్ప నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లోని అన్ని సూచీలు ఆకుపచ్చ రంగులో కళకళలాడుతున్నాయి. పీఎస్‌యూ బ్యాంక్, పవర్, మెటల్, రియాల్టీ సూచీలు ఏకంగా 4-6 శాతం వరకు ఎగిశాయి.