Infosys Shares: విలువ ప్రాతిపదికన, టీసీఎస్ తర్వాత భారత్‌లో రెండో అతి పెద్ద ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ తన ఉద్యోగులపై అపారమైన కరుణ చూపింది, అద్భుతమైన కానుక అందించింది. మెరుగైన పనితీరు కనబరిచిన ఉద్యోగులకు కోట్ల విలువైన షేర్లను బోనస్‌గా ఇచ్చింది.


స్టాక్‌ ఎక్సేంజ్‌ ఫైలింగ్‌లో కంపెనీ వెల్లడించిన ప్రకారం... టాప్‌ ఫెర్ఫార్మెన్స్ చూపిన తన సిబ్బందికి 06 లక్షల 57 వేల షేర్లను (6.57 లక్షలు) పంపిణీ చేసింది. మే 01న రిజల్యూషన్‌ ద్వారా ఈ షేర్లను ఉద్యోగులకు కేటాయించింది. అప్పటి లెక్క ప్రకారం, ఇన్ఫోసిస్‌ ఒక షేర్ విలువ దాదాపు 1,430 రూపాయలు. ఈ విధంగా చూస్తే... కంపెనీ పంపిణీ చేసిన షేర్ల విలువ దాదాపు 95 కోట్ల రూపాయలు అవుతుంది.


ESOP ప్రోగ్రామ్‌
వాస్తవానికి, ఉద్యోగులకు షేర్లను పంచడం కార్పొరేట్‌ ప్రపంచంలో కొత్తేమీ కాదు. మెరుగైన ప్రతిభ కనబర్చిన సిబ్బందికి ప్రోత్సాహకాల రూపంలో చాలా సంస్థలు ఈక్విటీ షేర్లను పంపిణీ చేస్తాయి. దీనిని ESOP ‍‌(Employee Stock Ownership Plan) ప్రోగ్రామ్‌ అంటారు. కంపెనీలో ఉద్యోగుల యాజమాన్యాన్ని ఇది పెంచుతుంది, జీతం మాత్రమే కాకుండా లాభాల్లోనూ వాటా అందిస్తుంది. తద్వారా, మరింత మెరుగ్గా పని చేసేలా వారిని ప్రోత్సహిస్తుంది. ESOP అమలు చేస్తున్న కంపెనీల లిస్ట్‌లో ఇన్ఫోసిస్ కూడా చేరింది.


2 పథకాల కింద షేర్లు పంపిణీ
ఇన్ఫోసిస్‌, తన ఉద్యోగులకు పంచిన మొత్తం 6.57 లక్షల షేర్లలో... 3 లక్షల 41 వేల 402 షేర్లను 2015 ఇన్సెంటివ్ కాంపెన్సేషన్ ప్లాన్ కింద పంపిణీ చేసింది. మిగిలిన 3 లక్షల 15 వేల 926 షేర్లను ఇన్ఫోసిస్ ఎక్స్‌పాండెడ్ స్టాక్ ఓనర్‌షిప్ ప్రోగ్రామ్ 2019 కింద అందించింది.


ప్రైస్‌ యాక్షన్‌
2024 మార్చి త్రైమాసికంలో ఇన్ఫోసిస్‌ రూ.7,975 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఆ కాలంలో కంపెనీకి రూ.37,923 కోట్ల ఆదాయం వచ్చింది. శుక్రవారం (03 మే 2024) ఈ కంపెనీ షేర్లు స్వల్పంగా బలపడి రూ.1,415.75 వద్ద ముగిశాయి. ఇన్ఫోసిస్ షేర్ల 52 వారాల గరిష్ట స్థాయి రూ.1,733 కంటే ప్రస్తుత ధర 18.30 శాతం తక్కువ. అదే సమయంలో, 52 వారాల కనిష్ట స్థాయి కంటే దాదాపు 15 శాతం ఎక్కువలో ట్రేడ్‌ అవుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు (YTD) ఇన్ఫోసిస్ షేరు ధర దాదాపు 9 శాతం పడిపోయింది, గత 12 నెలల కాలంలో దాదాపు 12 శాతం మేర బలపడింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: రక్షణ రంగంలో మిస్సైళ్ల లాంటి స్టాక్స్‌ - ఏడాదిలో రెట్టింపు పైగా లాభాలు