Stock Market closing bell: బెంచ్ మార్క్ సూచీలు శుక్రవారం నష్టాల్లోనే ముగిశాయి. ఉక్రెయిన్, రష్యా యుద్ధం, ముడి చమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు. ఈ వారమంతా ఈక్విటీ సూచీలు ఒడిదొడుకుల మధ్యే సాగాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 233 పాయింట్లు నష్టపోగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 17,153 వద్ద ముగిసింది. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్, ఐటీ రంగాల సూచీలు నష్టపోయాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 57,595 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 57,801 వద్ద లాభాల్లోనే మొదలైంది. కొనుగోళ్ల మద్దతుతో 57,845 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం 12 గంటలకు హఠాత్తుగా అమ్మకాలు మొదలవ్వడంతో 57,100 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. ఆఖర్లో మళ్లీ కాస్త కోలుకొని 233 పాయింట్ల నష్టంతో 57364 వద్ద ముగిసింది.
NSE Nifty
గురువారం 17,222 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,289 వద్ద ఓపెనైంది. 17,294 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆ తర్వాత విక్రయాలు మొదలవ్వడంతో 17,076 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. ఒకానొకద దశలో 100 పాయింట్ల వరకు పతనమైన సూచీ ఆఖర్లో కోలుకొని 69 పాయింట్ల నష్టంతో 17,153 వద్ద ముగిసింది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ 35,700 వద్ద మొదలైంది. 35,717 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆ తర్వాత 35,203 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. భారీగా చపతనమైన సూచీ చివరికి పుంజుకొని 117 పాయింట్ల నష్టంతో 35,410 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 13 కంపెనీలు లాభపడగా 37 నష్టాల్లో ఉన్నాయి. బజాజ్ ఆటో, అదానీ పోర్ట్స్, ఎస్‌బీఐ, రిలయన్స్, ఏసియన్ పెయింట్స్ లాభాల్లో ముగిశాయి. టైటాన్, మారుతీ, టెక్ మహీంద్రా, ఐఓసీ, ఐచర్ మోటార్స్ నష్టాల్లో ముగిశాయి. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ సెక్టార్లపై సెల్లింగ్ ప్రెజర్ ఉంది. ఆయిల్ అండ్ గ్యాస్, రియాల్టీ, ఫార్మా కంపెనీల షేర్లు కొనుగోలు చేశారు.