AP Assembly: అసెంబ్లీ సమావేశాల చివరి రోజు కూడా సభలో టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. శుక్రవారం ఉభయ సభలు ప్రారంభం కాగానే మండలిలో టీడీపీ సభ్యులు ఆందోళన చేశారు. ప్రశ్నోత్తరాలు మొదలైన కాసేపటికే స్పీకర్‌ పోడియం వద్ద టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. పోడియాన్ని చరుస్తూ శబ్దాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. సభా కార్యకలాపాలు సాగకుండా వారు అడ్డుతగులుతున్నారంటూ మండలి ఛైర్మన్‌ మోషేన్‌ రాజు వారిని సస్పెండ్‌ చేశారు. సస్పెండ్‌ అయిన వారిలో అర్జునుడు, రాజనర్సింహులు, అశోక్‌బాబు, దీపక్‌రెడ్డి, ప్రభాకర్‌, రామ్మోహన్‌, రామారావు, రవీంద్రనాథ్‌ ఉన్నారు.


సభలో టీడీపీ నేతలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సభలోకి తాళిబొట్లు తీసుకుని వచ్చి ప్రదర్శిస్తూ నిరసన తెలియజేశారు. మద్య నిషేదం పేరు చెప్పి జగన్ దాన్ని తుంగలో తొక్కారని, కల్తీ సారా రక్కసితో జంగారెడ్డి గూడెంలో మహిళల తాడు తెంచారని టీడీపీ సభ్యులు ఆరోపించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా తాళి బొట్లు ప్రదర్శించారు. దీంతో మా ఆత్మాభిమానాన్ని వారు అవమానిస్తున్నారంటూ వైఎస్సార్‌ సీపీ మహిళా నేతలు పోతుల సునీత, వరుదు కళ్యాణి తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యడు దీపక్ రెడ్డి చేతిలో నుంచి పోతుల సునీత తాళి బొట్లు లాక్కున్నారు. ఆ సమయంలో సభలో గందరగోళం నెలకొంది. దీంతో మండలి ఛైర్మన్‌ మోషేన్‌ రాజు సభని కాసేపు వాయిదా వేశారు. అనంతరం మళ్లీ ప్రారంభించారు.


అంతకుముందు, అసెంబ్లీ బయట కూడా టీడీపీ నేతలు నిరసన తెలియజేశారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ శాసన సభాపక్షం నిరసనకు దిగింది. మహిళల తాళిబొట్లు తెంచారంటూ తాళిబొట్లు చేతపట్టుకుని నిరసన ర్యాలీ నిర్వహించింది. 42 మంది మరణాలపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ సెక్రెటేరియట్‌ ఫైర్ స్టేషన్‌ నుంచి అసెంబ్లీకి నిరసన ర్యాలీ నిర్వహించారు. మృతుల ఫోటోలకు నివాళులర్పిస్తూ నల్ల కండువాలతో టీడీపీ నేతలు నిరసన చేశారు. 


కల్తీ నాటుసారా మృతుల పాపం జగన్ రెడ్డిదేనని ప్లకార్డులతో ప్రదర్శించారు. కల్తీ సారా మరణాలు జగన్ రెడ్డి హత్యలే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మద్యపాన నిషేధం అని మహిళల మెడల్లో పుస్తెల తాళ్లు తెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ సారా వల్ల మరణించిన బాధిత కుటుంబాల వారికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.