Stock Market Crash: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తోంది. అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్లన్నీ (Stock markets) పతనం దిశగా సాగుతున్నాయి. భారత స్టాక్‌ మార్కెట్లలో (Indian Stock markets) గురువారం రక్తకన్నీరు వరదలై పారింది! మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex), ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) ఏకంగా 5 శాతం వరకు పతనమయ్యాయి. మార్కెట్లు మొదలైన అరగంటలోనే బీఎస్‌ఈ మార్కెట్‌ విలువ రూ.10 లక్షల కోట్ల మేర ఆవిరైంది. రూ.256 లక్షల కోట్ల నుంచి రూ.246 లక్షల కోట్లకు తగ్గింది.


బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ (Crude Oil) ఏడేళ్లలో తొలిసారిగా బ్యారెల్‌కు 10౩ డాలర్లకు చేరుకుంది. ఇండియా విక్స్‌ 30 శాతానికి పెరిగింది. మార్కెట్లు ఇప్పటికే జీవనకాల గరిష్ఠాల నుంచి పది శాతం వరకు పతనమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 2800 పాయింట్ల నష్టపోగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 16,300 దిగువన ముగిసింది.


BSE Sensex 2800 డౌన్‌


క్రితంరోజు 57,232 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 55,418 వద్ద భారీ గ్యాప్‌డౌన్‌తో ఆరంభమైంది. దాదాపుగా 1800 పాయింట్ల నష్టంతో మొదలైంది. 55,996 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకిన సూచీ చూస్తుండగానే 54,383 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. నిన్నటి ముగింపుతో పోలిస్తే సూచీ ఏకంగా 2850 పాయింట్లు పతనమైంది. చివరికి 2,702 పాయింట్ల నష్టంతో 54,529 వద్ద ముగిసింది.


NSE Nifty 850 డౌన్‌


బుధవారం 17,063 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 16,548 పాయింట్ల వద్ద మొదలైంది. దాదాపుగా 515 పాయింట్ల నష్టంతో ఆరంభమైంది. 16,705 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకున్న సూచీ 16,203 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే 860 పాయింట్ల వరకు పతనమైంది. మొత్తంగా 815 పాయింట్ల నష్టంతో 16,247 వద్ద ముగిసింది.


Bank Nifty 2160 డౌన్‌


బ్యాంకు నిఫ్టీ ఉదయం 36,085 వద్ద మొదలైంది. 36,709 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. అన్ని బ్యాంకుల షేర్లు పతనమవ్వడంతో 34,991 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి పతనమైంది. మొత్తంగా 2163 పాయింట్ల నష్టంతో 35,228 వద్ద ముగిసింది.


Gainers and Lossers


నిఫ్టీలో 50కి 50 కంపెనీల షేర్లు నష్టపోయాయి. టాటా మోటార్స్‌ షేరు ఏకంగా 11 శాతం పతనమైంది. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యూపీఎల్‌ 8 శాతానికి పైగా నష్టపోయాయి. గ్రాసిమ్‌, జేస్‌డబ్ల్యూ 7 శాతానికి పైగా పతనమయ్యాయి. మార్కెట్లో అన్ని రంగాల సూచీలూ ఎరుపు రంగులోనే ఉన్నాయి. అన్నిటికి అన్నీ 4-5 శాతం మధ్య ఎరుపెక్కాయి.