Sensex Rejig June 2024: అదానీ గ్రూప్ చరిత్రలో మరో కీలక ఘట్టం నమోదైంది. అదానీ గ్రూప్‌ ATM అని ముద్దుగా పిలుచుకునే కంపెనీ అదానీ పోర్ట్స్ & సెజ్‌ (Adani Ports & SEZ) ఒక అరుదైన లక్ష్యాన్ని చేరింది. భారతదేశ స్టాక్ మార్కెట్‌లోని ప్రముఖ సూచీల్లో ఒకటైన BSE సెన్సెక్స్‌లో ఈ కంపెనీకి ఎంట్రీ పాస్‌ దొరికింది. సోమవారం (24 జూన్‌ 2024) నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అంటే.. అదానీ పోర్ట్స్ & సెజ్‌ షేర్లు సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లో భాగం అవుతాయి. 


అదానీ గ్రూప్‌ నుంచి సెన్సెక్స్‌లో స్థానం సంపాదించిన తొలి సంస్థ అదానీ పోర్ట్స్‌. అదానీ గ్రూప్‌ ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు (Adani Enterprises Ltd) కూడా ఈ ఫీట్‌ సాధ్యం కాలేదు.


సెన్సెక్స్ ఇండెక్స్ అధికారిక పేరు S&P BSE Sensex. ఇది బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌లో అతి పెద్ద & అత్యంత ప్రధాన ఇండెక్స్. బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌లో నమోదైన 30 అతి పెద్ద కంపెనీల షేర్లు ఈ ఇండెక్స్‌లో చోటు దక్కించుకుంటాయి. BSE సెన్సెక్స్‌లో చేర్చిన స్టాక్స్‌ను ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమీక్షిస్తారు. మార్కెట్‌ విలువల్లో హెచ్చుతగ్గులను బట్టి సెన్సెక్స్‌లో వాటి వెయిటేజీని నిర్ణయిస్తారు. ఈ ప్రాసెస్‌లో కొన్ని షేర్ల వెయిటేజీ పెరుగుతుంది లేదా తగ్గుతుంది. కొన్ని షేర్లు ఇండెక్స్‌లోకి ఎంటర్ అవుతాయి, కొన్ని ఎగ్జిట్‌ అవుతాయి.


BSE సెన్సెక్స్‌లో మార్పుల వల్ల అదానీ పోర్ట్స్‌కు చోటు లభించగా, దేశంలోని అతి పెద్ద IT కంపెనీల్లో ఒకటైన విప్రోకు (Wipro) ఎదురుదెబ్బ తగిలింది. ద్వై-వార్షిక సమీక్ష వల్ల, సెన్సెక్స్‌ నుంచి విప్రో నిష్క్రమిస్తోంది. విప్రో షేర్లు సోమవారం నుంచి BSE సెన్సెక్స్‌లో కనిపించవు.


అదానీ పోర్ట్స్‌కు ప్రయోజనం, విప్రో ఇన్వెస్టర్లకు నష్టం
సెన్సెక్స్‌లో మార్పుల వల్ల అదానీ పోర్ట్స్ చాలా లాభపడుతుంది. బ్రోకరేజ్ సంస్థ నువామా ప్రకారం, ఈ మార్పు వల్ల పెరిగే పెట్టుబడుల నుంచి అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్‌కు ప్రయోజనం చేకూరుస్తుంది. అదానీ పోర్ట్స్‌ స్టాక్‌లోకి 259 మిలియన్‌ డాలర్ల ఇన్‌ఫ్లో వచ్చే అవకాశం ఉందని నువామా అంచనా వేసింది. విప్రో నిష్క్రమణ కారణంగా, ఆ స్టాక్‌ నుంచి 170 మిలియన్‌ డాలర్ల ఔట్‌ ఫ్లో చూడవచ్చని అంచనా.


సంవత్సరంలో దాదాపు రెట్టింపైన అదానీ పోర్ట్స్‌ షేర్లు
అదానీ పోర్ట్స్‌ షేర్లు గత కొన్ని నెలలుగా విపరీతంగా పెరిగాయి. గత ఏడాది కాలంలోనే స్టాక్‌ ప్రైస్‌ దాదాపు 98 శాతం పెరిగింది. ఇదే కాలంలో విప్రో షేర్లు దాదాపు 27 శాతం పెరిగాయి. 


ఈ షేర్ల వెయిటేజీలపై ప్రభావం
సెన్సెక్స్‌లో మార్పుల వల్ల మరికొన్ని స్టాక్స్‌ కూడా లాభపడతాయి. భారతి ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్ర బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్ర, టాటా స్టీల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్ల వెయిటేజీ (ప్రాధాన్యత) పెరుగుతుంది. మరోవైపు... మహీంద్ర అండ్ మహీంద్ర, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మారుతి సుజుకి, ఐటీసీ, లార్సెన్ అండ్ టూబ్రో షేర్ల వెయిటేజీ తగ్గుతుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ఐటీఆర్‌ ఫైల్‌ చేయబోతున్నారా? - AY 2024-25లో ఆదాయ పన్ను రేట్లను ఓసారి చెక్‌ చేయండి