Jail Sentence For Hinduja Family Members: ప్రపంచంలోని ప్రముఖ వ్యాపార కుటుంబాల్లో ఒకటైన హిందుజా కుటుంబంలో నలుగురికి జైలు శిక్ష పడింది. పనివాళ్లను వేధించిన కర్మ ఫలితాన్ని వాళ్లు అనుభవించబోతున్నారు. 


స్విట్జర్లాండ్‌లోని ఒక క్రిమినల్ కోర్టు, శుక్రవారం (21 జూన్‌ 2024) సంపన్న హిందుజా కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులకు నాలుగు నుంచి నాలుగున్న సంవత్సరాల మధ్య జైలు శిక్ష విధించింది. తమ విల్లాలో పని చేసే కార్మికులను వేధించినందుకు, శ్రమ దోపిడీ చేసినందుకు ఈ శిక్ష విధించింది. అయితే.. మానవ అక్రమ రవాణాకు సంబంధించిన ఆరోపణలను కోర్టు కొట్టివేసింది.


జైలు శిక్ష పడింది వీళ్లకే..
భారతీయ సంతతికి చెందిన వ్యాపారవేత్త ప్రకాష్ హిందుజా, అతని భార్య కమల్ హిందుజా, కుమారుడు అజయ్ హిందుజా, కోడలు నమ్రత హిందుజాకు జెనీవాలోని క్రిమినల్‌ న్యాయస్థానం శిక్షను విధించింది. వీళ్లకు జెనీవాలో విలాసవంతమైన లేక్‌ సైడ్‌ విల్లా ఉంది. అక్కడ పని చేసేందుకు నిరక్షరాస్యులైన భారతీయులను అక్రమ రవాణా చేసినట్లు & వారిని హింసించినట్లు హిందుజా కుటుంబంపై ఆరోపణలు వచ్చాయి.


కార్మికుల శ్రమను దోపిడీ చేయడం, అనధికారికంగా ఉపాధి కల్పించడం వంటి నేరాలపై ఆ నలుగురు దోషులని కోర్టు తీర్పునిచ్చింది. తాము ఏం చేస్తున్నామో, ఎక్కడికి వెళుతున్నామో తెలిసే ఆ కార్మికులు భారత్‌ నుంచి స్విట్జర్లాండ్‌ వచ్చారు కాబట్టి, మానవ అక్రమ రవాణా ఆరోపణలను కోర్టు కొట్టివేసింది. వాస్తవానికి ఇది అత్యంత తీవ్రమైన ఆరోపణ. ఒకవేళ, మానవ అక్రమ రవాణా జరిగిందని కోర్టు నమ్మివుంటే, హిందుజా కుటుంబ సభ్యులకు పడే శిక్ష అత్యంత తీవ్రంగా ఉండేది.


ప్రకాష్ హిందుజా కుటుంబ సభ్యులతో పాటు, ఆ కుటుంబం మేనేజర్‌ నజీబ్ జియాజీకి కూడా కోర్టు 18 నెలల జైలు శిక్ష విధించింది. అయితే, ఆ శిక్షను అమలు చేయకుండా నిలిపివేసింది. తీర్పు ఇస్తున్న సమయంలో న్యాయస్థానంలో నజీబ్ జియాజీ మాత్రమే ఉన్నారు, హిందుజా ఫ్యామిలీ మెంబర్లు హాజరు కాలేదు.


జెనీవా కోర్టు తీర్పును ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేస్తామని హిందుజా ఫ్యామిలీ తరపు లాయర్లు ప్రకటించారు. ప్రకాష్‌ హిందుజాకు 2007లోనూ ఇలాంటి కేస్‌లోనే శిక్ష పడింది. అయినప్పటికీ, సరైన అనుమతి పత్రాలు లేకుండానే ఆ కుటుంబం కార్మికులను పనిలో పెట్టుకుంది.


నిరక్ష్యరాస్యులను తీసుకొచ్చి వెట్టి చాకిరీ
స్విస్‌ పౌరసత్వాన్ని పొందిన హిందుజా కుటుంబం, రెండు దశాబ్దాల క్రితం జెనీవాలో స్థిరపడ్డారు. తమ విల్లాలో పని చేసేందుకు నిరక్ష్యరాస్యులైన కార్మికులను భారత్‌ నుంచి స్విట్జర్లాండ్‌కు తీసుకువచ్చింది. స్విస్‌కు రాగానే తమ పాస్‌పోర్ట్‌లు స్వాధీనం చేసుకున్నారు. స్విస్ ఫ్రాంక్‌ల్లో కాకుండా భారతీయ రూపాయలలో జీతం చెల్లించారు. పైగా, ఆ డబ్బు చేతికి ఇవ్వకుండా భారత్‌లోని బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేశారు. విల్లా నుంచి కాలు బయటపెట్టకుండా నిర్బంధించారు. రోజుకు దాదాపు 18 గంటల పాటు పని చేయించుకున్నారు. 


హిందుజా కుటుంబం నుంచి వజ్రాలు, కెంపులు, ప్లాటినం నెక్లెస్, కొన్ని ఆభరణాలు, ఆస్తులను స్విస్‌ అధికార్లు స్వాధీనం చేసుకున్నారు. కోర్టు ఫీజులతో పాటు, న్యాయస్థానం జరిమానాలు విధిస్తే చెల్లించడం కోసం చరాస్తులను ముందుగానే జప్తు చేశారు.


మరో ఆసక్తికర కథనం: గుండె దడ పెంచుతున్న పసిడి - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి