Nifty At Record High: కొన్ని నెలలుగా, భారతీయ స్టాక్ మార్కెట్‌ స్టోరీ బ్రహ్మాండంగా వినిపిస్తోంది. అలుపెరుగని పర్వతారోహకుడిలా, గత కొన్ని రోజులుగా నిఫ్టీ బుల్‌ వెనుతిరిగి చూడడం లేదు. వరుసబెట్టి కొత్త శిఖరాలు ఎక్కుతూ, పాత రికార్డ్‌లను తొక్కుతూ వెళ్తోంది.


ఈ రోజు (బుధవారం, 21 ఫిబ్రవరి 2023) కూడా మరో కొత్త ప్రాంతాన్ని నిఫ్టీ అన్వేషించింది, రికార్డ్‌ స్థాయిలో 22,248.85 స్థాయి వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత నామమాత్రంగా పెరిగి 22,249.40 వద్ద కొత్త జీవిత కాల గరిష్టాన్ని (Nifty at life time high) తాకింది. 


ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... కేవలం నెల రోజుల్లోనే 21,000 స్థాయి నుంచి 22,000 స్థాయిని నిఫ్టీ అందుకుంది. 2023 డిసెంబర్ 08న మొదటిసారిగా 21k మార్క్‌ను టచ్‌ చేసిన నిఫ్టీ బస్‌, ఆ తర్వాత, 2024 జనవరి 15న 22k మైలురాయిని చేరింది. కేవలం 27 ట్రేడింగ్ సెషన్లలోనే 1000 పాయింట్ల భారీ దూరాన్ని దాటింది. మరోవైపు.. 20,000 నుంచి 22,000 వరకు నిఫ్టీ మారథాన్‌ చాలా అద్భుతంగా కొనసాగింది, ఇన్వెస్టర్లు & ట్రేడర్లను ఉర్రూతలూగించింది.


20,000 నుంచి 22,000 వేల వరకు నిఫ్టీ ప్రయాణం ‍‌(Nifty journey from 20,000 to 22,000)


2023 సెప్టెంబర్ 11న నిఫ్టీ తొలిసారిగా 20,000 వేల స్థాయిని తాకింది. 2024 జనవరి 15న 22,000 స్థాయికి ఎదిగింది. కేవలం 4 నెలల్లోనే నిఫ్టీ50 ఇండెక్స్‌ 2000 పాయింట్లను కూడగట్టింది, భారీ టార్గెట్‌ను సునాయాసంగా ఛేదించింది.


2023 డిసెంబర్ 07న, 20,901 వద్ద ముగిసిన నిఫ్టీ.. ఆ తర్వాతి సెషన్‌ డిసెంబర్ 8న, 105 పాయింట్ల హై జంప్‌ చేసింది, 21,000 వేలను అధిగమించడంలో విజయం సాధించింది. 


2024 జనవరి 15న తొలిసారిగా 22,000 రికార్డ్‌ సృష్టించిన నిఫ్టీ, ఆ రోజు 158 పాయింట్లు లేదా 0.72 శాతం బలమైన పెరుగుదలతో 22,053 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించింది. ఆ రోజు మనదేశంలో సంక్రాంతి పండుగ జరుపుకున్నాం.


2023  సెప్టెంబర్ 11న మొదటిసారిగా 20,000 నంబర్‌ కళ్లజూసిన నిఫ్టీ, ఆ రోజు స్టాక్ మార్కెట్‌లో ఉధృతమైన ర్యాలీ కారణంగా 180 పాయింట్లు ఎగబాకింది. 


అంతేకాదు, 19,000 మార్క్‌ నుంచి 20,000 ఫిగర్‌ను తాకడానికి నిఫ్టీకి కేవలం 52 ట్రెండింగ్ సెషన్‌లు మాత్రమే పట్టింది.


నిఫ్టీ50 అంటే ఏంటి? (What is Nifty50?)
నిఫ్టీ50 అనేది నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ (NSE) బెంచ్‌మార్క్ ఇండెక్స్. నిఫ్టీ50 అనేది 50 అతి పెద్ద కంపెనీల కలబోత. మార్కెట్‌ విలువ పరంగా దేశంలోని 50 అతి పెద్ద లిస్టెడ్ కంపెనీల సగటును ఇది ప్రతిబింబిస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థలోని 13 రంగాలను ఈ ఇండెక్స్‌ కవర్ చేస్తుంది. నిఫ్టీ50 ఇండెక్స్‌ను 1996 ఏప్రిల్‌ 22న ప్రారంభించారు. NSEలో నిఫ్టీ50 కాకుండా ఇంకా చాలా స్టాక్ సూచీలు ఉన్నాయి. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: జీ ఎంట్‌ పుస్తకాల్లో రూ.2000 కోట్ల మాయ!, అమాంతం జారిపోయిన షేర్లు