Telangana Residents Released From Dubai Prison: తమ వారిని చూడాలన్న ఆ కుటుంబ సభ్యుల ఏళ్ల నిరీక్షణకు ఎట్టకేలకు తెర పడింది. 18 ఏళ్లుగా దుబాయ్ లో జైలు శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ వాసులు విడుదలై మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు. నేపాల్ కు చెందిన వాచ్ మెన్ బహదూర్ సింగ్ హత్య కేసులో వీరికి తొలుత పదేళ్ల జైలు శిక్ష పడింది. ఆ తర్వాత దుబాయ్ కోర్టు వీరి శిక్షను 25 ఏళ్లకు పెంచింది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కేటీఆర్ నేపాల్ వెళ్లి.. హతుని కుటుంబ సభ్యులకు స్వయంగా రూ.15 లక్షల పరిహారం చెల్లించి క్షమాభిక్ష పత్రం రాయించారు. అయితే, నిబంధనలు మారడంతో వీరి విడుదలకు కోర్టు అంగీకరించలేదు. అయితే, అనారోగ్య కారణాలు చూపుతూ నిందితుల తరఫు న్యాయవాదులు మరోసారి ప్రయత్నించారు. దీనికి అంగీకరించిన దుబాయ్ కోర్టు ఏడేళ్ల ముందే వారిని విడుదల చేసింది. కేటీఆర్ చొరవతో జైలు నుంచి విడుదలైన వీరికి ఆయనే తన సొంత ఖర్చులతో విమాన టికెట్లు అందజేశారు. దీంతో దుబాయ్ నుంచి సిరిసిల్ల, రుద్రంగి, కోనరావుపేట మండలాలకు చెందిన ఐదుగురు హైదారాబాద్ వచ్చారు. 18 ఏళ్ల తర్వాత తమ వారిని చూసిన కుటుంబ సభ్యులు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా తమ వారి విడుదలకు చొరవ చూపిన కేటీఆర్ కు బాధిత కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: school holidays in Telangana: మేడారం జాతర ఎఫెక్ట్, విద్యాసంస్థలకు వరుసగా 5 రోజులు సెలవులు