Rituraj Singh Death: ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో.. ముఖ్యంగా ఎన్నో సీరియల్స్‌లో నటించి ప్రేక్షకులకు దగ్గరయిన రితూరాజ్ సింగ్ హఠాత్తుగా కన్నుమూశారు. ఈ విషయం సినీ పరిశ్రమను షాక్‌కు గురిచేసింది. సీరియల్స్‌తో పాటు పలు సినిమాల్లో కూడా నటించి గుర్తింపు సాధించుకున్నారు రితూరాజ్. 59 ఏళ్ల రితురాజ్.. తాజాగా హార్ట్ ఎటాక్‌తో మరణించారన్న వార్త బాలీవుడ్‌ను కలచివేస్తోంది. తన సహ నటుడు, బెస్ట్ ఫ్రెండ్ అయిన అమిత్ బెహ్ల్.. రితురాజ్ మరణ వార్తను ప్రకటించారు. ప్యాన్‌క్రియాటిక్ వ్యాధికి సంబంధించిన సమస్య కోసం తాజాగా ఆసుపత్రిలో చేరారు రితూరాజ్. అక్కడ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చిందని అమిత్ తెలిపారు.


కడుపునొప్పి ఇబ్బందులతో..


‘‘ఆయన కడుపునొప్పి ఇబ్బందులతో హాస్పిటల్‌లో చేరారు, కొన్నిరోజుల క్రితమే డిశ్చార్జ్ అయ్యారు. అర్థరాత్రి 12.30 సమయంలో ఇంట్లోనే హార్ట్ ఎటాక్‌తో కన్నుమూశారు’’ అని అమిత్ బెహ్ల్ ప్రకటించారు. ప్రస్తుతం రితూరాజ్ ‘అనుపమా’ అనే సీరియల్‌తో బిజీగా ఉన్నారు. ఈ సీరియల్ ఎంతోమంది ప్రేక్షకుల ఆదరణను సంపాదించుకుంది. ఇందులో ఆయన చేస్తున్న యష్పాల్ దిల్లోన్ అనే పాత్రకు కూడా మంచి క్రేజ్ లభించింది. ఇక రితూరాజ్ మరణంపై చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ముందుగా సీనియర్ యాక్టర్ అర్షద్ వార్సీ దీనిపై ట్వీట్ చేశారు.






మిస్ అవుతాం..


‘‘రితురాజ్ మరణం గురించి విని చాలా బాధ కలిగింది. మేము ఒకే బిల్డింగ్‌లో ఉండేవాళ్లం. నా మొదటి సినిమాకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ఒక మంచి స్నేహితుడిని, గొప్ప నటుడిని కోల్పోయాను. నిన్ను మిస్ అవుతాను బ్రదర్’’ అని ట్వీట్ చేశారు అర్షద్ వార్సీ. బాలీవుడ్ దర్శక నిర్మాత అయిన హన్సల్ మెహ్తీ కూడా రితురాజ్ మృతిపై స్పందించారు. ‘‘రితురాజ్! దీనిని నమ్మలేకపోతున్నాను. ‘కే స్ట్రీట్ పాలీ హిల్’ అనే సీరియల్‌లో తనను నేను డైరెక్ట్ చేశాను. ఈ క్రమంలోనే మేము మంచి స్నేహితులం అయ్యాం. తనను కలిసి చాలా రోజులు అయితే మా మధ్య మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. ఒక మంచి నటుడు, మంచి వ్యక్తి. త్వరగా, హఠాత్తుగా వెళ్లిపోయారు’’ అని హన్సల్ మెహ్తా.. రితురాజ్‌తో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.


చివరిగా ఆ సినిమాలో..


బాలీవుడ్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ అయిన వివేక్ అగ్నిహోత్రి సైతం రితురాజ్ మృతి గురించి ట్వీట్ చేశాడు. ‘‘రితురాజ్, ఇలా చేయడం ఎలా సాధ్యమయ్యింది నీకు. ఇంకా ఎంత మిగిలిపోయి ఉంది. ఆర్టిస్టులు ఎప్పటికీ మరణించరు’’ అంటూ ఈ విషయం తనను ఎంతగా షాక్‌కు గురిచేసిందో బయటపెట్టాడు వివేక్. కేవలం సీరియల్స్‌లోనే కాదు పలు సినిమాల్లో కూడా నటించి అప్పుడప్పుడు వెండితెరపై కూడా వెలిగారు రితురాజ్ సింగ్. కేవలం హిందీలో మాత్రమే కాకుండా అజిత్ హీరోగా నటించి ‘తునీవు’ చిత్రంతో తమిళ ప్రేక్షకులను కూడా పలకరించారు ఈ నటుడు. చివరిగా ‘యారియాన్ 2’ సినిమాలో చిన్న పాత్రలో కనిపించి అలరించారు.


Also Read: మరోసారి తల్లయిన అనుష్క శర్మ - అప్పుడే పేరు కూడా పెట్టేశారు, ఏంటో తెలుసా?