Stock market news in Telugu: భారత స్టాక్‌ మార్కెట్లు కొన్ని వారాలుగా ఒక రేంజ్‌ బౌండ్‌లోనే తిరుగుతున్నాయి. పాజిటివ్‌ ట్రిగ్గర్స్‌లా పని చేసే ఎలాంటి సంకేతాలు మన మార్కెట్లకు అందకపోవడమే ఈ స్తబ్ధతకు కారణం. ఇప్పుడు, ఈ పరిస్థితి మారే సూచనలు కనిపిస్తున్నాయి. 


ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIs), మన మార్కెట్‌లోకి పెట్టుబడులను మళ్లీ పెంచుతున్నారు. యుఎస్‌లో, 10-ఏళ్ల బెంచ్‌మార్క్‌ బాండ్ ఈల్డ్స్‌ అక్టోబర్‌లోని 5% నుంచి ఇప్పుడు 4.4%కు పడిపోయాయి. అక్కడ డబ్బులు గిట్టుబాటు కాకపోవడంతో ఫారినర్ల ఫోకస్‌ ఇండియన్‌ ఈక్విటీల పైకి మళ్లుతోంది. విదేశీ పెట్టుబడిదార్లు నవంబర్‌ నెలలో నికరంగా రూ.378 కోట్ల ఇన్‌-ఫ్లోస్‌ తెచ్చారు. అక్టోబర్‌లో రూ. 24,548 కోట్లు, సెప్టెంబర్‌లో రూ. 14,767 కోట్ల విలువైన ఇండియన్‌ ఈక్విటీలను వాళ్లు అమ్మారు.


ఓవరాల్‌గా ఇండియన్‌ మార్కెట్‌ పరిస్థితి బాగుంది
ఈ రెండు నెలల ఔట్‌ఫ్లోస్‌ కంటే ముందు, గత ఆరు నెలల్లో, మార్చి నుంచి ఆగస్టు వరకు FPIలు విపరీతంగా కొనుగోళ్లు చేశారు. ఆ కాలంలో మన మార్కెట్లలోకి రూ. 1.74 లక్షల కోట్లు తెచ్చారు. మొత్తంగా చూస్తే, 2023 క్యాలెండర్ ఇయర్‌లో ట్రెండ్‌ చాలా బాగుంది. ఈ ఏడాదిలో సీమాంతర పెట్టుబడిదార్లు రూ. 96,340 కోట్లు కుమ్మరించారు.


షార్ట్‌ టర్మ్‌లో, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో రిస్క్ అపిటేట్‌ పెరగడం (risk appetite), USలో బాండ్‌ ఈల్డ్స్‌ పడిపోవడం వల్ల FPI పెట్టుబడులు భారత్‌ వైపు మళ్లుతాయని మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ భావిస్తున్నారు.


డేటా ప్రకారం, విదేశీ మదుపుదార్లు ఈ నెలలో ఇప్పటి వరకు (నవంబర్ 24 వరకు) రూ. 378.2 కోట్ల నికర పెట్టుబడి (FPIs net investment) పెట్టారు. ఈ నెలలో నాలుగు రోజుల్లో బయ్యర్స్‌గా ఉన్న ఎఫ్‌పీఐలు, శుక్రవారం (24 నవంబర్‌) 2,625 కోట్ల రూపాయల భారీ కొనుగోళ్లు చేశారు.


FPIలు గత 3 నెలల్లో విక్రయిస్తున్న బ్యాంక్స్‌ స్టాక్స్‌ను ఇకపై కొనుగోలు చేసే అవకాశం ఉంది. మార్కెట్‌లో చప్పబడిన లార్జ్ క్యాప్స్‌లో మళ్లీ ర్యాలీ ఉండొచ్చు. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో, క్యాపిటల్ గూడ్స్ & కన్జంప్షన్‌ వంటి రంగాల్లోకి ప్రభుత్వ పెట్టుబడులు పెరిగే ఛాన్స్‌ ఉంది.


బాండ్‌ మార్కెట్‌లోకి కూడా పెరుగుతున్న పెట్టుబడులు
ఈక్విటీ మార్కెట్‌తో పాటు డెట్‌ మార్కెట్‌ ముఖచిత్రం కూడా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు రూ.12,400 కోట్లను ఆకర్షించిన డెట్‌ మార్కెట్లు, అక్టోబర్‌లోనే రూ. 6,381 కోట్లను స్వీకరించాయి. JP మోర్గాన్, 'గవర్నమెంట్ బాండ్ ఇండెక్స్ ఎమర్జింగ్ మార్కెట్స్‌'లోకి ఇండియన్ గవర్నమెంట్‌ సెక్యూరిటీలను చేర్చడం వల్ల భారతీయ బాండ్ మార్కెట్‌లోకి విదేశీ నిధులు వచ్చాయి. మిగిలిన అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలోని (emerging markets) రుణాలతో పోలిస్తే ఇండియన్‌ డెట్స్‌ ఆకర్షణీయంగా ఉన్నాయి, ఎక్కువ ఈల్డ్స్‌ అందిస్తున్నాయి. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply


 


మరో ఆసక్తికర కథనం: జొమాటో మాత్రమే హీరో, మిగిలిన కంపెనీల ఇన్వెస్టర్లు ఇప్పటికీ ఏడుస్తున్నారు