Prime Minister Modi Prays At Tirumala: తిరుమల శ్రీవారిని ఈ ఉదయం భారత ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. రచన అతిథి గృహం నుంచి భారీ భధ్రత నడుమ శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న ప్రధాని మోదీకి టీటీడీ ఈవో, ఛైర్మన్ ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన మహా ద్వారం నుంచి స్వామి దర్శనానికి వెళ్లారు. ధ్వజస్తంభానికి నమస్కరించి శ్రీవారి ఆలయంలోనికి ప్రవేశించారు.
ఏడు కొండల స్వామి దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో ప్రధానమంత్రి మోదీకి వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు. తీర్ధప్రసాదాలు, స్వామి వారి ఫొటోను అందజేశారు. ప్రధాని పర్యటన కారణంగా కేంద్ర బలగాల నిఘాలో తిరుమల వెళ్లిపోయింది. ప్రధాని రాకకు రెండు గంటల నుంచి భక్త జన సంచారాన్ని నిలిపేశారు.
ఉదయం 8 గంటలకు తిరుమలలోని అతిథి గృహం నుంచి బయలుదేరి శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు మోదీ. ఆలయ వాహన మండపం వద్ద నుంచి నడుచుకుంటూ శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ప్రధానికి టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, టిటిడి ఈవో ఏవి ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు ఇస్తీకపాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. నుదుటిపై తిరునామంతో సాంప్రదాయ వస్త్రాలు ధరించిన ప్రధాని నరేంద్రమోదీ ఆలయ ప్రవేశం చేసిన తర్వాత ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించారు.
ఆ తర్వాత వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంకు చేరుకున్న ప్రధానికి వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు శేష వస్త్రంతో సత్కరించారు. స్వామి వారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన మోదీ నేరుగా తిరుమలలోని అతిథి గృహానికి చేరుకున్నారు.
అతిథి గృహంలోనే కొంత సేపు విశ్రాంతి తీసుకుని అల్పాహారం స్వీకరించిన తర్వాత ప్రధాని రోడ్డు మార్గం గుండా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఢిల్లీకి పయనం అవుతారని సమాచారం. తిరుమలలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన వేళ శ్రీవారి ఆలయంతో పాటు పరిసర ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆలయంలో కేంద్ర బలగాల మోహరించారు. డ్యూటీ పాస్ ఉన్న వారినే అలయంలోకి అనుమతించారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply