Stock Market News In Telugu: నవరాత్రుల మొదటి రోజుతో ప్రారంభమయ్యే పండుగ సీజన్‌, దీపావళి రోజున ముహూరత్‌ ట్రేడింగ్‌తో ముగుస్తుంది. చరిత్రను తిరగేస్తే, ఆ టైమ్‌లో BSE స్టాక్స్‌ కొన్న పెట్టుబడిదార్లను అదృష్టం వరించింది. గత 10 సంవత్సరాల్లో 9 సంవత్సరాలు పాజిటివ్‌ రిటర్న్స్‌ అందుకోవడంతో పాటు, సగటున 2% లాభం సంపాదించారు.


గత పదేళ్ల రికార్డ్‌
ప్రస్తుతం, నవరాత్రుల 1వ రోజు నుంచి ఇండెక్స్ 2% తగ్గిన నేపథ్యంలో, రాబోయే కొన్ని రోజుల్లో సెన్సెక్స్ ఆశ్చర్యపరిచే రీతిలో పెరగొచ్చన్న అంచనాలు ఉన్నాయి. అన్ని ప్రధాన రంగాల సూచీల్లో, BSE IT మాత్రమే గత 10 సంవత్సరాల్లో ప్రతికూల సగటు రాబడిని అందించింది. BSE బ్యాంకెక్స్ సగటున 5% పైగా రిటర్న్స్‌తో టాప్ గెయినర్‌గా ఉంది. 


గత పదేళ్లలో, నవరాత్రులు-దీపావళి మధ్య, బ్యాంక్ స్టాక్స్ 7 సార్లు, ఆటో 8 సార్లు, కన్స్యూమర్ డ్యూరబుల్స్ 10లో 9 సార్లు సానుకూల రాబడిని ఇచ్చాయి.


ఇండివిడ్యువల్‌ స్టాక్స్‌ను చూస్తే.. TVS మోటార్స్, VIP ఇండస్ట్రీస్, పెట్రోనెట్ LNG హీరోలుగా నిలిచాయి. నవరాత్రుల నుంచి దీపావళి వరకు, గత 10 సంవత్సరాల్లో, ఈ మూడు పాజిటివ్‌ రిటర్న్స్‌తో బ్రహ్మాండమైన ట్రాక్ రికార్డ్‌ను మెయిన్‌టైన్‌ చేస్తున్నాయి. గత పదేళ్ల పండుగ సీజన్‌లో, TVS మోటార్స్ ఇచ్చిన సగటు రాబడి 14%. VIP ఇండస్ట్రీస్‌ సగటున 8.6%, పెట్రోనెట్ LNG సగటున 6.6% లాభాలు తెచ్చిపెట్టాయి.


గత మూడేళ్ల రికార్డ్‌
గత మూడేళ్ల రికార్డ్‌ను చూస్తే... - కెర్నెక్స్ మైక్రోసిస్టమ్స్, కోప్రాన్, మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్, PC జ్యువెలర్, శివాలిక్ బైమెటల్ కంట్రోల్స్, ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అదరగొట్టాయి. 


కెర్నెక్స్ మైక్రోసిస్టమ్స్ ---- 2020 పండుగ సీజన్‌లో 47.34%, 2021లో 10.06%, 2022లో 27.70% లాభాలు ఇచ్చింది. 
కోప్రాన్ ---- 2020లో 16.71%  ---- 2021లో 12.73% ---- 2022లో 12.11% గెయిన్స్‌ తెచ్చి పెట్టింది.
మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ ---- 2020లో 12.08% ---- 2021లో 17.55% ----  2022లో 42.95% లాభపడింది.
PC జ్యువెలర్ ---- 2020లో 20.57% ---- 2021లో 13.79% ---- 2022లో 10.12% ర్యాలీ చేసింది. 
శివాలిక్ బైమెటల్ కంట్రోల్స్ ---- 2020లో 30.68% ---- 2021లో 20.12% ---- 2022లో 12.30% రిటర్న్స్‌ ఇచ్చింది. 
ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ---- 2020లో 17.16%---- 2021లో 14.37% ---- 2022లో 10.72% లాభాలు సంపాదించింది.


ఈ ఆదివారం రోజు దీపావళి ముహూరత్‌ ట్రేడింగ్ సెషన్‌ ఉంటుంది. ఫెడ్‌ వడ్డీ రేట్లు గరిష్ట స్థాయికి చేరుకున్నాయన్న అంచనాలతో పెట్టుబడిదార్లు బుల్లిష్ ట్రెండ్‌ అనుసరిస్తున్నారు. దీంతోపాటు, సెప్టెంబర్ త్రైమాసిక ఆదాయాల సీజన్‌ బాగానే ఉంది. ఫిచ్ రేటింగ్స్‌, భారతదేశ మీడ్‌ టర్మ్‌ GDP వృద్ధి అంచనాలను 6.2%కి పెంచడం తీపికబురుగా మారింది. కన్స్యూమర్ డ్యూరబుల్స్, రియాల్టీ, ఆటో సెక్టార్ల మీద పెద్ద పెట్టుబడిదార్లు దృష్టి పెట్టడంతో కన్జమ్షన్‌ అతి పెద్ద థీమ్‌గా మారుతోంది.


నిఫ్టీ గత 3 సెషన్లుగా షార్ట్-కవరింగ్ ర్యాలీ సిగ్నల్స్‌ ఇస్తోంది. ఈ దీపావళి నాటికి 19,700-19,900 స్థాయి వైపు పయనిస్తుందని, ఈ నెలాఖరు నాటికి కొత్త శిఖరాలకు చేరవచ్చని మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ భావిస్తున్నారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.