Women Asian Champions Trophy: ప్రతిష్ఠాత్మకమైన ఆసియా ఛాంపియన్స్‌ ట్రోపీని దక్కించుకున్న భారత మహిళల జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రధాని మోదీ నుంచి సామాన్యుల వరకు టీమిండియా ఉమెన్స్‌ హాకీ టీం ప్రదర్శనకు మంత్రముగ్దులయ్యారు. డిఫెండింగ్‌ ఛాంపియన్ జపాన్‌ను 4-0తో మట్టికరిపించి రెండోసారి మహిళల హాకీ జట్టు  ఆసియా ఛాంపియన్స్‌ ట్రోపీని దక్కించుకుంది. ఈ ఘనత సాధించిన భారత మహిళల జట్టు స‌భ్యుల‌కు హాకీ ఇండియా రివార్డు ప్రక‌టించింది. ఒక్కొక్కరికి రూ.3 ల‌క్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించి మహిళా టీం సభ్యుల సంతోషాన్ని రెట్టింపు చేసింది. విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన‌ కోచింగ్ సిబ్బందికి కూడా త‌లా లక్షాన్నర న‌జరానా ఇవ్వనున్నట్టు హాకీ ఇండియా తెలిపింది.


లక్నోలోని మ‌రంగ్ గొమ్కే జైపాల్ సింగ్ అస్ట్రో ట‌ర్ఫ్ హాకీ స్టేడియంలో జ‌రిగిన ఫైన‌ల్లో స‌వితా పూనియా నేతృత్వంలోని భార‌త జ‌ట్టు.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జపాన్‌ను 4-0తో మట్టికరిపించి విజేతగా నిలిచింది. ఫ్లడ్‌ లైట్ల సమస్య కారణంగా భారత్‌-జపాన్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్ 50 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఆట ఆరంభం నుంచే భారత మహిళల జట్టు దూకుడు కొనసాగించింది. జపాన్‌ను 4-0తో ఓడించి రెండోసారి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. సంగీత కుమారి (17వ నిమిషం), నేహా (46వ నిమిషం), లారెమ్‌సియామి (57వ), వందనా కటారియా (60వ) గోల్స్‌తో భారత్‌కు విజయాన్ని అందించారు. 2016లో సింగపూర్‌లో భారత్ తొలి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకోగా ఇది రెండో టైటిల్‌. జపాన్ 2013, 2021లో రెండుసార్లు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇరు జట్లు బలంగా ఉండడంతో ఈ మ్యాచ్‌ హోరాహోరిగా సాగుతుందని భావించారు. కానీ భారత మహిళల దూకుడు ముందు మ్యాచ్‌ ఏకపక్షంగా మారిపోయింది. తొలి భాగంలో ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగినా తర్వాత మాత్రం భారత్‌ జోరు కొనసాగింది. 


నాలుగో క్వార్టస్‌లో భారత్‌ మహిళలు అద్భుతంగా ఆడారు. నాలుగో క్వార్టర్ ప్రారంభంకాగనే భారత్ వరుసగా మూడు పెనాల్టీ కార్నర్‌లను దక్కించుకుంది. నేహా దీప్ గోల్‌ చేసి భారత ఆధిక్యాన్ని 2-0కు పెంచింది. 57వ నిమిషంలో లాల్‌రెమ్సియామి మరో పెనాల్టీ కార్నర్‌ గోల్‌గా మలిచింది. దీంతో ఆధిక్యం మూడుకు పెరిగింది. చివర్లో వందన కూడా గోల్‌ చేయడంతో 4-0తో భారత మహిళల జట్టు ఆసియా హాకీ ఛాంపియన్స్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. స్టాండ్స్‌లో ఉన్న భారత పురుషుల హాకీ జట్టు మహిళల జట్టును ఆద్యంతం ఉత్సాహ పరిచింది. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో ఆసియా క్రీడల ఛాంపియన్ చైనా 2-1తో దక్షిణ కొరియాను ఓడించి మూడో స్థానాన్ని ఖాయం చేసుకుంది. చైనా నుంచి యి చెన్ (3వ నిమిషం), టియాంటియన్ లువో (47వ) గోల్స్ చేయగా, దక్షిణ కొరియా నుంచి సుజిన్ అన్ (38వ) గోల్‌ చేసింది.