Tata Motors Finance Merger With Tata Capital: మన దేశంలోని పెద్ద ఆటోమొబైల్ కంపెనీల్లో ఒకటైన టాటా మోటార్స్ (Tata Motors), తన ప్యాసింజర్ కార్ల వ్యాపారాన్ని - వాణిజ్య వాహనాల వ్యాపారాన్ని వేరు చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఇప్పుడు, అదే కంపెనీ, తన ఫైనాన్స్ యూనిట్ టాటా మోటార్స్ ఫైనాన్స్‌ను టాటా క్యాపిటల్‌లో విలీనం చేయాలని నిర్ణయించింది. 


100 షేర్లకు బదులు 37 ఈక్విటీ షేర్లు
ఆదాయపరంగా దేశంలోనే అతి పెద్ద ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్. దీని అనుబంధ విభాగం టాటా మోటార్స్ ఫైనాన్స్‌ను, NBFC అయిన టాటా క్యాపిటల్‌లో విలీనం చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. షేర్ స్వాప్ ద్వారా ఈ డీల్ క్లోజ్‌ చేస్తామని వెల్లడించింది. 


ఈ విలీనం వల్ల రెండు కంపెనీలతో పాటు వాటి ఇన్వెస్టర్లు కూడా ప్రయోజనం పొందుతారు. మెర్జర్‌ ప్లాన్‌ ప్రకారం... టాటా మోటార్స్ ఫైనాన్స్‌ వాటాదార్లు, ఈ కంపెనీలో తమకు ఉన్న ప్రతి 100 ఈక్విటీ షేర్లకు బదులు టాటా క్యాపిటల్‌ నుంచి 37 ఈక్విటీ షేర్లు పొందుతారని ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో టాటా మోటార్స్‌ తెలిపింది.


కొత్త కంపెనీలో టాటా మోటార్స్‌కు 4.7 శాతం వాటా
నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు (NCLT) చెందిన 'స్కీమ్ ఆఫ్ అరేంజ్‌మెంట్' కింద టాటా మోటార్స్, టాటా క్యాపిటల్, టాటా మోటార్స్ ఫైనాన్స్ బోర్డులు ఈ విలీనాన్ని ఆమోదించాయి. విలీన ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు ఏడాది సమయం పడుతుందని టాటా మోటార్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఒప్పందం పూర్తయిన తర్వాత ఆవిర్భవించే కొత్త కంపెనీలో టాటా మోటార్స్‌కు 4.7 శాతం వాటా ఉంటుంది. ఈ విలీనం వల్ల టాటా మోటార్స్ ఫైనాన్స్ కస్టమర్లు లేదా రుణదాతలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని కంపెనీ తెలిపింది.


టాటా క్యాపిటల్‌ నుంచి చాలా రకాల లోన్‌ ప్లాన్లు
టాటా క్యాపిటల్, వాహన రుణాలతో పాటు గృహ రుణాలు, విద్యా రుణాలను కూడా అందిస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ రూ. 3,150 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇదే కాలంలో టాటా మోటార్స్ ఫైనాన్స్ నికర లాభం రూ. 52 కోట్లుగా ఉంది. ఈ ఒప్పందానికి రెగ్యులేటరీ ఆమోదం రావలసివుంది.


ఈ రోజు (బుధవారం, 05 జూన్‌ 2024‌) ఉదయం 11.20 గంటల సమయానికి టాటా మోటార్స్ షేరు దాదాపు 2% పుంజుకుని రూ. 921.40 వద్ద ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ఓటింగ్‌ పూర్తికాగానే ధరాఘాతం - పెరిగిన పాల రేట్లు - పెరగనున్న పెట్రోల్‌, మొబైల్‌ బిల్లులు!