Inflation Effect After Elections: ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమైన లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జూన్‌ 01వ తేదీతో ముగిసింది. జూన్‌ 04న ఓట్ల లెక్కింపు జరిగింది, ఎన్‌డీఏ కూటమి 293 సీట్లు గెలుచుకుని ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాన మంత్రి అవుతున్నారు. 


ఎన్నికలు ముగిసిన వెంటనే ధరాఘాతం
జూన్‌ 01న, చివరి విడత పోలింగ్‌ ముగిసిన వెంటనే సాధారణ ప్రజల నెత్తిన ధరల పిడుగులు పడడం ప్రారంభమైంది. జాతీయ రహదారులపై టోల్ రేట్ల పెంపు రూపంలో తొలి ధరాఘాతం తగిలింది. జూన్ నుంచి టోల్ టాక్స్ భారం 5 శాతం వరకు పెరిగింది. టోల్ ట్యాక్స్ పెంచుతూ గతంలోనే నిర్ణయం తీసుకున్నామని, జూన్ నుంచి అమలు చేస్తున్నామని NHAI అధికారి చెప్పారు.


పాల ధరలు పెంచిన పెద్ద కంపెనీలు
దేశంలో రెండు అతి పెద్ద పాల ఉత్పత్తి కంపెనీలు పాల ధరలు పెంచాయి. పాల రేటును లీటరుకు రూ. 2 పెంచుతున్నామని, ఆదివారం అర్థరాత్రి నుంచి ఇది అమల్లోకి వచ్చిందని ఇప్పటికే అమూల్ ప్రకటించగా, జూన్ 03వ తేదీన (సోమవారం) మదర్ డెయిరీ మరో షాకింగ్‌ న్యూస్‌ వెల్లడించింది. పాల ధరను లీటరుకు రూ.2 పెంచినట్లు ఆ సంస్థ కూడా ప్రకటించింది.


అమూల్‌ కొత్త ధరలు
జూన్ 03 నుంచి, దేశవ్యాప్తంగా అమూల్ గోల్డ్ లీటర్‌ ప్యాకెట్‌ రేటు రూ. 64 నుంచి రూ. 66కి పెరిగింది. అమూల్ టీ స్పెషల్ రూ. 62 నుంచి రూ. 64కు, అమూల్ శక్తి లీటర్ ప్యాకెట్‌ రూ. 60 నుంచి రూ. 62కు పెరిగింది. 500 మిల్లీలీటర్ల (అర లీటర్‌) అమూల్ గేదె పాల ప్యాకెట్‌ ధర ఇప్పుడు రూ. 35కు బదులుగా రూ. 37 అయింది, ఒక లీటర్ ప్యాక్ ధర రూ. 70కు బదులు రూ. 72కు చేరింది. అమూల్ పెరుగు ధర కూడా పెరిగింది.


మదర్ డెయిరీ కొత్త ధరలు
మదర్ డెయిరీ కూడా పాల రేటును లీటరుకు రూ. 2 పెంచడంతో... బల్క్ వెండెడ్ పాల ధరలు రూ. 52 నుంచి రూ. 54కు; టోన్డ్ మిల్క్ రూ. 54 నుంచి రూ.56కు; ఆవు పాలు రూ. 56 నుంచి రూ. 58కు; ఫుల్ క్రీమ్ మిల్క్ రూ. 66 నుంచి రూ.68కు; గేదె పాలు లీటర్‌కు రూ. 70 నుంచి రూ. 72కు; డబుల్ టోన్డ్ పాలు రూ. 48 నుంచి రూ. 50కు పెరిగాయి.


చమురు ధరలు పెరుగుతాయని అంచనా
OPEC+ దేశాలు ముడి చమురు సరఫరాను తగ్గించాలని నిర్ణయించినందున గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీని ప్రభావం సరఫరాపై కనిపిస్తుంది, ముడి చమురు దిగుమతి బిల్లు పెరుగుతుంది. సహజంగానే, ఆ ప్రభావం మన దేశంలో చమురు ధరలపై ఉండొచ్చు, ఇక్కడ ధరలు పెరగవచ్చు.


టారిఫ్‌ పెంచే ప్లాన్‌లో టెలికాం కంపెనీలు!
మన దేశంలో ప్రధాన టెలికాం కంపెనీలు రిలయన్స్‌ జియో ‍‌(Reliance Jio), భారతి ఎయిర్‌టెల్‌ (Bharati Airtel) తమ టారిఫ్‌లు పెంచే యోచనలో ఉన్నాయని సమాచారం. వాస్తవానికి, మన దేశంలో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందే ఇవి రేట్లు పెంచాల్సి ఉంది. ఎన్నికల నేపథ్యంలో, ప్రజా వ్యతిరేకత రాకుండా టారిఫ్‌ పెంపును కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంది. ఇప్పుడు ఎన్నికలు పూర్తయ్యాయి కాబట్టి, ఈ కంపెనీలు ఏ నిమిషంలోనైనా ప్రకటన చేయవచ్చు. 15 నుంచి 17 శాతం వరకు టారిఫ్‌లు పెంచే అవకాశం ఉంది. అయితే, టెలికాం కంపెనీలు దీనిపై ఇంకా అధికారిక ప్రకటనలు విడుదల చేయలేదు. 


మరో ఆసక్తిర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి