Zomato CEO Deepinder Goyal Land Deal: మన దేశంలో స్థిరాస్తి వ్యాపారానికి అతి పెద్ద మార్కెట్ ముంబై. అయితే, ఇప్పుడు దేశ రాజధాని దిల్లీ వార్తల్లోకి వచ్చింది. దిల్లీలో భారీ ల్యాండ్ డీల్ జరిగింది. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ ఈ డీల్‌ను క్రాక్ చేశారు. గోద్రెజ్ ప్రాపర్టీస్, ఎక్స్‌పీరియన్ డెవలపర్స్, డీఎల్‌ఎఫ్ హోమ్స్ డెవలపర్స్, ప్రెస్టీజ్ గ్రూప్ కూడా దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో భారీ భూ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
314 ఎకరాల కోసం 29 ల్యాండ్ అగ్రిమెంట్లు
స్థిరాస్తి కన్సెల్టెన్సీ సంస్థ అన్‌రాక్ రిపోర్ట్ ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరంలో (FY24) దిల్లీ-ఎన్‌సీఆర్‌లో దాదాపు 314 ఎకరాల 29 భూ ఒప్పందాలు జరిగాయి. వీటిలో అతి పెద్ద డీల్ జొమాటో సీఈవో దీపిందర్ గోయల్‌ది. డేరా మండి ప్రాంతంలో దాదాపు 5 ఎకరాల భూమిని దాదాపు రూ. 79 కోట్లకు గోయల్ కొనుగోలు చేశారు. దీపిందర్ గోయల్ భూమిని కొనడం ఇదే కొత్త కాదు, గతంలోనూ ఖరీదైన డీల్స్‌తో వార్తల్లోకి ఎక్కారు. అంతేకాదు, తన లగ్జరీ లైఫ్‌తోనూ జొమాటో ఫౌండర్ తరచూ న్యూస్ హెడ్‌లైన్స్‌లో కనిపిస్తుంటారు.
అన్‌రాక్ డేటా ప్రకారం, FY24లో, ఒక్క గురుగావ్‌లోనే 208.22 ఎకరాల భూమి కోసం 22 డీల్స్ కుదిరాయి. వీటిలో విద్య, నివాస ప్రయోజనాల కోసం ఒక్కో ల్యాండ్ సేల్ జరిగింది. మిగిలిన 20 విక్రయాలు రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ డెవలప్‌మెంట్‌కు సంబంధించినవి. ఫరీదాబాద్‌లో 15 ఎకరాల భూమికి ఒప్పందం కూడా జరిగింది.
గురుగావ్, నోయిడా, ఘజియాబాద్‌లో బిగ్ డీల్స్
FY24లో, గురుగావ్‌లోని 8.35 ఎకరాల భూమిని 132 కోట్ల రూపాయలకు గంగ రియాల్టీ (Ganga Realty) కొనుగోలు చేసింది. దిల్లీ గోల్ఫ్ కోర్స్ రోడ్‌లోని 4 ఎకరాల భూమికి 400 కోట్ల రూపాయలకు ఎక్స్‌పీరియన్ డెవలపర్స్ (Experion Developers) చేజిక్కించుకుంది. ఇదే సంస్థ నోయిడాలోని సెక్టార్ 145లోని 5 ఎకరాల భూమిని రూ. 250 కోట్లకు కైవసం చేసుకుంది. గోద్రెజ్ ప్రాపర్టీస్ (Godrej Properties) కూడా గురుగావ్, నోయిడాలో భూమిని కొనుగోలు చేసింది. డీఎల్‌ఎఫ్ హోమ్స్ డెవలపర్స్ (DLF Homes Developers) గురుగావ్‌లో ఒక ల్యాండ్ పార్శిల్ దక్కించుకుంటే, ప్రెస్టీజ్ గ్రూప్ (Prestige Group) ఘజియాబాద్‌లో భూమిని కొనుగోలు చేసింది.
ఖరీదైన ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్
ఇప్పుడు, ఖరీదైన ఇళ్లకు గిరాకీ పెరుగుతోందని, లగ్జరియస్ హౌస్‌ల డిమాండ్‌ను తీర్చడానికి బడా బిల్డర్ల చూపు దిల్లీ-ఎన్‌సీఆర్‌పై పడిందని అన్‌రాక్ గ్రూప్ వైస్ చైర్మన్ సంతోష్ కుమార్ చెప్పారు. విలాసవంతమైన ఇళ్ల సరఫరా కోసం, రానున్న రోజుల్లో, దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో సుమారు 298 ఎకరాల భూమికి సంబంధించి 26 ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. వాణిజ్య అవసరాలకు సంబంధించి రెండు ఒప్పందాలు జరగొచ్చని వెల్లడించారు.
2023-24 ఆర్థిక సంవత్సరంలో, దేశంలోని 7 పెద్ద నగరాల్లో దాదాపు 83 పెద్ద భూ క్రయవిక్రయాలు జరిగాయి. అయోధ్య, అహ్మదాబాద్, జైపుర్, నాగ్‌పూర్, మైసూర్, లూథియానా, సూరత్ వంటి టైర్ 2 & టైర్ 3 నగరాల్లోనూ 1,853 ఎకరాలకు సంబంధించిన 18 బిగ్ డీల్స్ జరిగాయి.
మరో ఆసక్తిరకర కథనం: దేశంలో పేరుకుపోతున్న పసిడి రాసులు, రెండో వారంలోనూ తగ్గిన విదేశీ ద్రవ్య నిల్వలు