GQG Partners Earning From Adani Group Stocks: కష్టకాలంలో ఉన్న అదానీ గ్రూప్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన GQG పార్ట్స్‌నర్స్‌, తమ నిర్ణయం సరైనదేనని భారీ లాభాలతో నిరూపించారు. పెట్టుబడి సంస్థ జీక్యూజీ పార్ట్స్‌నర్స్‌, ఏడాది క్రితం, అదానీ షేర్లలో పెట్టిన పెట్టుబడికి ఇప్పుడు 5 రెట్లు తిరిగి వచ్చింది.


అదానీ షేర్లలో ఆల్ రౌండ్ సేల్స్‌ జరుగుతున్న సమయంలో, భారతీయ సంతతి వ్యక్తి రాజీవ్ జైన్‌కు చెందిన పెట్టుబడి సంస్థ జీక్యూజీ పార్ట్‌నర్స్‌, అదానీ గ్రూప్ షేర్లలో పెట్టుబడి పెట్టింది. 2023 జనవరిలో, అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్, అదానీ గ్రూప్‌పై వివాదాస్పద నివేదికను విడుదల చేసింది. అదానీ కంపెనీల షేర్‌ ధరలను దొంగదారిలో ప్రభావితం చేశారన్న ఆరోపణ సహా అదానీ గ్రూప్‌పై చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఆ తర్వాత అదానీ గ్రూప్‌ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో గ్రూప్‌లోని చాలా కంపెనీల విలువ సగానికి పైగా తగ్గింది.


4 కంపెనీల్లో భారీగా పెట్టుబడులు
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ తర్వాత, అదానీ కంపెనీల షేర్లు ప్రతిరోజూ లోయర్ సర్క్యూట్‌లోకి పడిపోతున్న తరుణంలో GQG పార్టనర్స్ రంగం మీదకు వచ్చింది. అదానీ షేర్లలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టింది. GQG పార్టనర్స్ నుంచి అదానీ షేర్లలోకి మొదటి విడుత పెట్టుబడి 2023 మార్చిలో వచ్చింది. ఆ సమయంలో, అదానీ గ్రూప్‌లోని 4 కంపెనీలు అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్‌లోకి GQG పార్టనర్స్ డబ్బు తీసుకొచ్చింది, చాలా తక్కువ ధరకు షేర్లను దక్కించుకుంది. ఒక గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ వచ్చి అదానీ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టడంతో, ఇన్వెస్టర్లలో విశ్వాసం తిరిగి వచ్చింది. అప్పటి నుంచి అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు క్రమంగా పుంజుకున్నాయి.


ఏడాదిలో 430 శాతం వృద్ధి
అదానీ షేర్లలో GQG పార్ట్‌నర్స్‌ పెట్టిన మొదటి పెట్టుబడి విలువ రూ.15,446 కోట్లు (1.9 బిలియన్‌ డాలర్లు). ఆ పెట్టుబడి ఇప్పటికి 5 రెట్లు పెరిగింది, ఇంకా ఒక సంవత్సరం కూడా పూర్తి కాలేదు. ఫండ్ మేనేజర్ సుదర్శన్ మూర్తి ఇటీవల బ్లూమ్‌బెర్గ్‌తో మాట్లాడుతూ, మార్చి 2023లో పెట్టుబడి పెట్టినప్పటి నుంచి, GQG పార్ట్‌నర్స్‌ ప్రారంభ పెట్టుబడి 10 బిలియన్‌ డాలర్లకు పెరిగిందని వెల్లడించారు. ఇది దాదాపు 430 శాతం అతి భారీ వృద్ధి. అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్‌ ధరలు పెరగడం వల్ల తమ రిటర్న్‌ భారీగా పెరిగిందని మూర్తి చెప్పారు.


GQG పార్టనర్స్‌కు చెందిన రాజీవ్ జైన్, అదానీ గ్రూప్ షేర్లలో పెట్టుబడులు పెట్టినప్పుడు చాలా ప్రశ్నలు, విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. అయితే, రాజీవ్ జైన్ తన నిర్ణయంపై పూర్తి విశ్వాసం కనబరిచారు. అదానీ గ్రూప్‌ షేర్లు ఎప్పట్నుంచో తమ రాడార్‌లో ఉన్నాయని ఆ సమయంలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక కారణంగా అదానీ షేర్లను అతి చౌకగా కొనగలిగారు. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: కోటి మంది మహిళలు లక్షాధికారులయ్యారు, మీరు కూడా అప్లై చేయండి