Lakhpati Didi Yojana Details in Telugu: దేశంలోని మహిళలకు వడ్డీ రహిత రుణాలు ‍‌(Interest Free Loans) ఇచ్చి, స్వయం ఉపాధి ద్వారా వారిని లక్షాధికారులను చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం లాక్‌పతి దీదీ యోజన. 2023 ఆగస్టు 15న, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద, స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాలు ఇస్తారు. 


స్కీమ్‌ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 3 కోట్ల మంది మహిళలకు రూ.1 లక్ష నుంచి 5 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చారు. దీంతోపాటు, మహిళలకు ఆర్థికాంశాల్లో, నైపుణ్యపరంగా శిక్షణ కూడా ఇస్తున్నారు. ఎల్‌ఈడీ బల్బుల తయారీ, ప్లంబింగ్, డ్రోన్ రిపేరింగ్ తదితర సాంకేతిక పనులను నేర్పుతున్నారు.


స్వయం సహాయక సంఘాల సభ్యులై ఉండి, కుటుంబ వార్షిక ఆదాయం రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువగా ఉన్న మహిళలను లాక్‌పతి దీదీలుగా పిలుస్తారు. 


ఈ ఏడాది ఫిబ్రవరి 1న, మధ్యంతర బడ్జెట్ ప్రసంగంలో (Interim Budget 2024), దేశంలో 3 కోట్ల మంది మహిళలను లాక్‌పతి దీదీగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) చెప్పారు. 


లాక్‌పతి దీదీ యోజన 2024 కోసం దరఖాస్తు చేసి, ఈ ప్రభుత్వ పథకం ప్రయోజనాలను పొందాలనుకుంటే, మొదట కొంత సమాచారం తెలుసుకోండి. 


లాక్‌పతి దీదీ పథకం వివరాలు
- వ్యాపారవేత్తలు కావాలనుకునే మహిళలు, ఒక వ్యాపారాన్ని ప్రారంభించి & అభివృద్ధి చేసుకోవడానికి ఈ పథకం కింద మార్గదర్శకత్వం పొందుతారు.
- లాక్‌పతి దీదీ యోజన కింద అందించే శిక్షణలో వ్యాపార ప్రణాళిక, మార్కెటింగ్ వ్యూహాలు, మార్కెట్ యాక్సెస్‌కు సంబంధించిన సాయం ఉంటుంది.
- మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సమగ్ర ఆర్థిక అక్షరాస్యత వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు. బడ్జెట్, పొదుపు, పెట్టుబడి వంటి వాటి గురించి నేర్పుతారు.
- లాక్‌పతి దీదీ యోజన మైక్రో క్రెడిట్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. దీని ద్వారా మహిళలు వ్యాపారం, విద్య, ఇతర అవసరాల కోసం సులభంగా చిన్న రుణాలు పొందొచ్చు.
- ఈ పథకం కింద, పొదుపు చేయడంలో మహిళలను ప్రోత్సహిస్తారు, నగదు రూపంలో ప్రోత్సాహకాలను కూడా అందిస్తారు.
- మహిళలకు బీమా కవరేజీ కూడా ఉంటుంది. దీంతో వారి కుటుంబ భద్రత మరింత పెరుగుతుంది.
- మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు అనేక రకాల సాధికారత కార్యక్రమాలు నిర్వహిస్తారు.
- డిపార్ట్‌మెంటల్ ఔట్‌లెట్‌లు, వివిధ ప్రదేశాల్లో నిర్వహించే ప్రదర్శనల్లో వారి ఉత్పత్తుల విక్రయానికి సాయం అందుతుంది.


అర్హతలు
- దరఖాస్తుదారు తప్పనిసరిగా భారతదేశ పౌరురాలై ఉండాలి.
- వయోపరిమితి 18 నుంచి 50 సంవత్సరాలు.
- స్వయం సహాయక సంఘంలో చేరడం తప్పనిసరి.


 అవసరమైన పత్రాలు
- ఆధార్ కార్డు
- ఆదాయ ధృవీకరణ పత్రం
- చిరునామా రుజువు
- పాన్ కార్డ్
- ఇ-మెయిల్ ఐడీ
- మొబైల్ నంబర్
- పాస్‌పోర్ట్ సైజ్‌ ఫోటో
- బ్యాంకు ఖాతా వివరాలు


లాక్‌పతి దీదీ యోజన కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి? (How to Apply Online for Lakhpati Didi Yojana?)
లాక్‌పతి దీదీ యోజన కోసం దరఖాస్తు చేసుకోవడానికి కొంత కాలం వెయిట్‌ చేయాలి. ఎందుకంటే, ఇప్పటి వరకు దీని కోసం అధికారిక వెబ్‌సైట్ విడుదల కాలేదు లేదా ఆన్‌లైన్ అప్లికేషన్స్‌ను ప్రారంభించలేదు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించిన వెంటనే, ఆ వివరాలను మేము మీకు అందిస్తాం. 


లాక్‌పతి దీదీ యోజన కోసం ఆఫ్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి? (How to Apply Offline for Lakhpati Didi Yojana?)
ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి, మీ బ్లాక్ లేదా జిల్లాలోని మహిళా & శిశు అభివృద్ధి శాఖ కార్యాలయానికి వెళ్లాలి.
అక్కడ లాక్‌పతి దీదీ యోజన దరఖాస్తు ఫారం మీకు అందుతుంది.
దరఖాస్తు ఫారంలో అడిగిన సమాచారం మొత్తాన్నీ పూరించండి, అవసరమైన పత్రాలను జత చేయండి.
పత్రాలతో పాటు దరఖాస్తు ఫారాన్ని అదే కార్యాలయంలో సమర్పించి, రసీదును పొందాలి.
ఈ విధంగా లాక్‌పతి దీదీ యోజన కోసం ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.


ప్రస్తుతం దేశంలో సుమారు 83,00,000 స్వయం సహాయక బృందాలు, 9 కోట్ల మందికి పైగా సభ్యులు ఉన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఈ 9 కోట్ల మంది మహిళల జీవితాల్లో మార్పు వచ్చింది. ఇప్పటి వరకు, కోటి మంది మహిళలు స్వావలంబన సాధించి లాక్‌పతి దీదీలుగా మారారు.


మరో ఆసక్తికర కథనం: మ్యూచువల్ ఫండ్స్‌పై లాభాలొస్తే ఐటీఆర్‌లో ఎలా చూపాలి?